logo
తెలంగాణ

వరంగల్‌లో తీన్మార్‌.. కారు పార్టీలో హుషార్‌..

CM KCR Focus on Warangal District
X

వరంగల్‌లో తీన్మార్‌.. కారు పార్టీలో హుషార్‌..

Highlights

CM KCR: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వరంగల్ టీఆర్ఎస్‌లో తీన్మార్ మోగిస్తోందా?

CM KCR: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వరంగల్ టీఆర్ఎస్‌లో తీన్మార్ మోగిస్తోందా? కేసీఆర్ పదవుల పందేరం కారు పార్టీలో జోష్ హుషారెత్తుతోందా? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు సిరికొండకు, పోచంపల్లికి అవకాశం కల్పించడం మొత్తం ఐదు స్థానాలను ఓరుగల్లుకే కేటాయించిన కేసీఆర్ మదిలో ఏముంది? ఈ నేతల్లో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారా? అందుకే ఓరుగల్లు గులాబీ శ్రేణులు ఫుల్ ఖుషీగా ఉన్నాయా? ఈ ఐదుగురు ఎమ్మెల్సీలలో ఎవరికి ఉన్నత పదవులు రానున్నాయి? ఇంతకూ ఆ అదృష్టవంతులు ఎవరు? ఆశావహులను కేసీఆర్ ఎలా బుజ్జగిస్తారు?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎమ్మెల్సీ పదవులు దక్కడం గులాబీ శ్రేణులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి చాలా మంది నేతలు ఎమ్మెల్సీ పదవులకు పోటీ పడ్డారు. దాదాపు పదిమంది నేతలు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అధినేత మాత్రం కడియం, బండాప్రకాశ్, తక్కెళ్లపల్లి వంటి సీనియర్లు, ఉద్యమ నేపథ్యం, రాజకీయాలను ప్రభావితం చేసే సామాజిక కోణాలనే పరిగణనలోకి తీసుకుని ఎంపిక తంతును పూర్తి చేశారు. ఆ తర్వాత మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి గవరర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి అవకాశమిచ్చారు. ఏమైనా ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ వరంగల్‌కు మరోసారి పెద్దపీటే వేశారు.

అయితే, తాజా పరిణామాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా శ్రేణుల్లో పుల్ జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ బలపడకుండా కారు పార్టీలో కదలికలు లేకుండా ఉండేందుకే అధినేత ఈ నిర్ణయాలు తీసుకొని ఉంటారన్న చర్చ జరుగుతోంది. ఆరుగురు అభ్యర్థుల్లో ముగ్గురు వరంగల్ నేతలను ఎంపిక చేయడంతో ఓరుగల్లుకు రాజకీయంగా ఇచ్చే ప్రాధాన్యాన్ని చాటుకున్నారు. గతంలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లానుంచే కడియంకు డిప్యూటీ సీఎం పదవి, మధుసూదనాచారికి స్పీకర్ పదవి ఇచ్చిన విషయాన్ని జిల్లా నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది ఎమ్మెల్సీల ఎంపిక తర్వాత ఇప్పుడు అధినేత కరుణ ఎవరిపై ఉంటుందనే చర్చ జరుగుతోంది. హుజురాబాద్ ఎన్నిక తర్వాత వరంగల్, కరీంనగర్ జిల్లాలపై పట్టు బిగించడానికి కేసీఆర్ పదవుల పందేరం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే సామాజిక, రాజకీయ సమీకరణాలను వాడుకున్నారు. ముదిరాజ్ ఓటు బ్యాంకు దూరం కాకుండా ఉండేందుకు త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో బండాప్రకాశ్‌కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కడియంకు కూడా మొదట్లో మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతం ఆయన విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవేళ కడియంకు మంత్రి పదవి వస్తే జిల్లాలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరు డమ్మీ అవుతారని, అందుకే కడియంకు పదవి రాకుండా ఆపే ప్రయత్నాలు మొదలయ్యాయన్న టాక్‌ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి ఎంపికయిన సిరికొండకు మండలి చైర్మన్ ఇచ్చే అవకాశాలు దాదాపుగా ఉన్నాయట.

ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఒక చీఫ్ విప్ ఉండటంతో మరో రెండు పదవులు ఇస్తారా లేదా అన్న డిస్కషన్ జరుగుతోంది. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ ప్రభుత్వంలో కీలకమైన ఐదు పదవులు దక్కినట్టవుతుంది. అయితే మొదటి నుంచి పార్టీలో పదవులు ఆశిస్తున్న వారు ప్రస్తుతం మరోమారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారట. ముఖ్యంగా వరంగల్‌లో సీనియర్ నేతలుగా ఉన్న వారికి ఈసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కకపోయినా తిరిగి ఏదో ఒక ఛాన్స్ దక్కకపోతుందా అని ఎదురుచూస్తున్నారట. ఉమ్మడి జిల్లాలో ఉన్న నేతల్లో ఎవరికి వారే సొంత గ్రూపులు మెయింటైన్‌ చేస్తుంటే ఇప్పుడు కొత్తగా పదవులు దక్కిన తర్వాత గ్రూపుల గోల మరింత పెరిగే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు బండాప్రకాశ్‌కు కానీ, సిరికొండకు కానీ గ్రూపులు కడుతారన్న పేరు లేకున్నా తాజా రాజకీయాలు పరిస్థితులను ఏ మలుపు తిప్పునున్నాయోనన్న టాక్‌ వినిపిస్తోంది.

పదవులు ఆశించి భంగపడిన వారు కూడా రాబోయే నామినేటెడ్ పదవుల్లోనైనా తమకు అవకాశం దక్కుతుందన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్, కరీంనగర్‌ జిల్లాలలో బీజేపీ జోరు పెంచుతున్న వేళ కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చాలా ప్రాధాన్యమిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీల సంఖ్యను పెంచడంతో పాటు వారు ప్రాతినిధ్యం వహించే చోట్ల పార్టీ స్ట్రెంతెన్ చేసే వ్యూహం పన్నినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏమైనా ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యాన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులలో కూడా వరంగల్ జిల్లా నేతలకు సువర్ణావకాశాలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ మనసులో ఏమున్నా వరంగల్ సెంటిమెంట్ వర్కవుట్ చేసి కచ్చితంగా ఉత్తర తెలంగాణలో పార్టీకి మరింత గట్టి పునాదులు వేసే ప్రయత్నంలో ఉన్నట్టే తెలుస్తోంది. అనూహ్య పరిణామాల మధ్య ఎమ్మెల్సీలుగా ఎన్నికై మరో ఉన్నత అవకాశం దక్కించుకునే ఆ అదృష్టవంతులెవరో తేల్చాల్సిన పెద్ద సార్ ఈ సస్పెన్స్‌కు ఎలా తెర దించుతారో చూడాలి.

Web TitleCM KCR Focus on Warangal District
Next Story