
CM KCR: ప్రధాని స్వయంగా కేసీఆర్, ప్రభుత్వాన్ని కూలగొడతానంటే.. ఏం అర్థం చేసుకోవాలి..?
CM KCR: నువ్వు ఎట్లా గెలిచావో.. మేము అలా గెలవలేదా..?
CM KCR: ప్రధాని మోదీ, బీజేపీ తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశాభివృద్ధిని విస్మరించి రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడతామంటూ ప్రధాని స్థాయి వ్యక్తి బహిరంగంగా మాట్లాడటం కరెక్టేనా అని కేసీఆర్ ప్రశ్నించారు. పాలమూరు కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో కేంద్రం విధానాలను ఎండగట్టారు. ఎవరైనా ఎదురు మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడతామంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఏ కారణంతో తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొడతావు..? నువ్వు ఎలా గెలిచావో.. మేము అలా గెలవలేదా..? అని ప్రధాని మోదీని.... కేసీఆర్ ప్రశ్నించారు. బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీ పార్టీ ఎమ్మెల్యేలు.. 40 మంది మాతో టచ్‌లో ఉన్నారని ప్రధాని చెప్పొచ్చా..? అని ఫైరయ్యారు.
భావోద్వేగాలు, అబద్ధాల ఒరవడి సృష్టించి మేలైన నాయకులను ఇబ్బంది పెడుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేయించి.. దౌర్జన్య పూరిత, దుర్మార్గపూరితమైన విధానం..జరుగుతున్నదన్నారు. ఎక్కడో ఒక దగ్గర బెబ్బులిలా పంజా లేపి దెబ్బకొట్టాలనన్నారు. మొన్న హైదరాబాద్‌కు కొందరు దొంగలు వచ్చి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి పుల్లపెట్టి.. అస్థిర పరిచి కిందమీద చేద్దామని చూస్తే అణగబట్టి జైల్లో వేయడం కరెక్టే కదా.. అని నిలదీశారు.
జిల్లాలో ఒకప్పుడు భయంకరమైన కరవు పరిస్థితులు ఉండేవన్న సీఎం కేసీఆర్.. పెండింగ్‌లో పెట్టిన నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి పాలమూరును పచ్చగా మార్చామన్నారు. తాగునీరు పూర్తిగా ఇచ్చామని... ఇంకా కొంత సాగునీటి సమస్య తీర్చాల్సి ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉందన్న కేసీఆర్.. మోదీ పాలమూరు వచ్చి హమ్ బనాయేంగే.. అని చెప్పారని ఎద్దేవా చేశారు. కృష్ణానదిలో వాటా తేల్చాలంటే.. 8 ఏళ్లు అయినా సమాధానం లేదన్నారు. సమాధానం చెప్పేదెపుడు.. ప్రాజెక్ట్‌లు ఎప్పుడు కట్టాలని ప్రశ్నించారు.
సంక్షేమంలో తెలంగాణకు సాటీ, పోటీ లేరన్న కేసీఆర్.. 9,500 కోట్ల పెట్టుబడితో పాలమూరుకు బ్యాటరీ పరిశ్రమ వచ్చిందన్నారు. స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి రేపే జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తమతోపాటే కేంద్రంలో మరో పార్టీ అధికారంలోకి వచ్చిందిని.. వాళ్ల అసమర్థ విధానాల వల్ల ఒక్క తెలంగాణకే 3లక్షల కోట్లు నష్టం జరిగిందని కేసీఆర్ మండిపడ్డారు. పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో పరిస్థితులు ప్రస్తావించిన సీఎం.. బార్డర్ జిల్లాల ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారని గుర్తుచేశారు. 75ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత ఢంబాచారాలు.. ఈస్ట్‌మన్ కలర్ ఫోజులు కొడుతున్నారని బీజేపీపై ఫైరయ్యారు.
వాల్మీకి, బోయలను ఎస్సీల్లో కలపాలని.. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి.. ఏడేళ్లయినా అతీగతీ లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ తీర్మానం చేసి పంపిస్తామన్నారు. జాతీయ రాజకీయాల్లోకి అనుమతించాలని కోరుతున్నాని చెప్పిన కేసీఆర్.. జై భారత్.. జై తెలంగాణ అంటూ ప్రసంగం ముగించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




