చిరకాల మిత్రుడు, ఉద్యమ సహచరుని కోల్పోయాను : సీఎం కేసీఆర్

చిరకాల మిత్రుడు, ఉద్యమ సహచరుని కోల్పోయాను : సీఎం కేసీఆర్
x
Highlights

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స...

టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా సోకడంతో బంజారాహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో నాయిని నర్సింహారెడ్డి చికిత్స పొందారు. కోవిడ్ నెగటివ్ రిపోర్టు వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ సోకడంతో జూబ్లిహిల్స్ అపోలోకు తరలించారు. రాత్రి 12 గంటల 25 నిమిషాలకు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

నాయిని నర్సింహారెడ్డి 1944 మే 12న సుభద్రమ్మ, దేవయ్య రెడ్డి దంపతులకు జన్మించారు. భార్య ఆహల్యరెడ్డి, కుమారుడు దేవందర్ రెడ్డి, కుమార్తె సమతారెడ్డి ఉన్నారు. నాయిని స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్మ. కార్మిక నేతగా నాయిని నర్సింహారెడ్డి గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలో మొదట్నించీ కీలక పాత్ర పోషించిన నాయిని తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పలు ప్రముఖ కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికయ్యారు.

1970లో హైదరాబాద్ కు మకాం మార్చిన నాయిని నర్సింహారెడ్డి వీఎస్టీ కార్మిక సంఘం నేతగా పలు మార్లు ఎన్నికయ్యారు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. హైదరబాద్ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన నాయిని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారిగా 1978లో టీ.అంజయ్య పై గెలించారు. 1985, 2004లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2001లో టీఆర్ఎస్ లో చేరిన ఆయన తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించారు. వైఎస్ సర్కారులో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యాశాఖా మంత్రిగా పని చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడిన అనంతరం తొలి హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వహించారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ నాయినికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. గవర్నర్‌ కోటాలో శాసనమండలికి ఎంపికైన ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్‌తో ముగిసింది. నాయిని నర్సింహారెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన నాటినుంచి తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే నడిచారు. నాయిని మరణవార్తతో పార్టీ శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. జూబ్లీహిల్స్ లో చికిత్స పొందుతున్న నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన సీఎం కేసీఆర్ కన్నీటి పర్యంతం అయ్యారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాత్రి పొద్దుపోయాక నాయిని ఆరోగ్యం మరింత క్షీణించి కన్నుమూశారు. నాయిని మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిరకాల మిత్రుడు, ఉద్యమ సహచరుని కోల్పోయానన్నారు. నాయిని మృతి టీఆర్‌ఎస్‌ పార్టీకి, తెలంగాణ రాష్ర్టానికి, కార్మిక లోకానికి తీరనిలోటని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories