Adilabad: ఎమ్మెల్యే బాపురావు, మాజీ ఎంపీ నగేష్‌ మధ్య వర్గపోరు

Clashes Between the MLA Bapu Rao And Ex MP Nagesh
x

బాపూరావు మరియు నగేష్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Adilabad: పార్టీ నేతలను ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని ఆరోపణలు

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కారు స్టీరింగ్ అదుపు తప్పుతోందా...? సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ గోడం నగేష్ మధ్య అధిపత్యపోరు కొనసాగుతోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇరువర్గాల మధ్య ఉన్న విభేదాలు.. రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటుండంతో.. గులాబీ నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

బోథ్ నియోజకవర్గంలో అధికారపార్టీలో ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. మాజీ ఎంపీ గోడం నగేష్ ల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. దీంతో గులాబీ పార్టీ ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోతోంది. ఎమ్మెల్యే బాపురావు స్థానికంగా ఉండకపోవడంతో పాటు సెకెండ్ క్యాడర్ నేతలను పట్టించుకోవడం లేదనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అయన వ్యవహారశైలితో విసుగుచెందిన పలువురు మండలస్థాయి నాయకులు ఎమ్మెల్యే తీరుపట్ల గుర్రుగా ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. బాపురావు వైఖరి కారణంగానే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోగా.. పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. బోథ్ అసెంబ్లీ సెగ్మెంట్ లో తొమ్మిది మండలాలు ఉండగా.. వాటిలో టీఆర్‌ఎస్‌కు కేవలం నాలుగుచోట్లనే జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు దక్కాయి. గెలిచినవారు కూడా మాజీ ఎంపీ గోడం వర్గానికి చెందినవారే కావడంతో.. దీనంతటికి కారణం.. ఎమ్మెల్యేనే అని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

ఇటీవల కాలంలో బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన కొంతమంది నాయకులు.. ఎమ్మెల్యే వైఖరిపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పార్టీ పదవుల పంపకంలో ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలతో అర్హులకు అన్యాయం జరిగినట్లు కూడా తెలుస్తోంది. నియోజకవర్గంలోని కొంతమంది సర్పంచ్‌లు.. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల కొమరం భీం జిల్లాలో కొందరు సర్పంచులు తమ పదవులకు రాజీనామాలు చేయగా.. జడ్పీ చైర్మన్‌ చొరవతో.. వాటిని ఉపసంహరించుకున్నారు. అయితే.. బోథ్ అసెంబ్లీ సెగ్మెంట్ లోనూ అలాంటి పరిస్థితులే ఉత్పన్నమయ్యే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది సర్పంచులతో పాటు సెకెండ్ క్యాడర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై మాజీ ఎంపీ నగేష్ వద్దకు చర్చకు రాగా.. వారికి ఆయన నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే బాపురావుకు పోటీగా మాజీ ఎంపీ నగేష్‌ తో పాటు కొత్తగా గులాబీ కండువా కప్పుకున్న జాదవ్‌ అనిల్‌ కూడా పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికైనా బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.. పార్టీ నేతలను, కార్యకర్తలను పట్టించుకోకపోతే.. ఆయనపై వస్తున్న విమర్శలకు బలం చేకూరనుంది. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ఛాన్స్‌ కూడా లేకపోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories