ఎమ్మెల్యేపై కేసు వెనుక అసలేం జరిగింది.. షాడో ఎమ్మెల్యే తీరు కొంప ముంచుతోందా?

ఎమ్మెల్యేపై కేసు వెనుక అసలేం జరిగింది.. షాడో ఎమ్మెల్యే తీరు కొంప ముంచుతోందా?
x
Highlights

ఆ ఎమ్మెల్యే అధికార పార్టీకి తలనొప్పిగా మారాడా..? ఇటీవల ఆయన పెంచిన స్వరం సదరు ఎమ్మెల్యేకు చేటు చేస్తుందా...? అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆయన సొంత...

ఆ ఎమ్మెల్యే అధికార పార్టీకి తలనొప్పిగా మారాడా..? ఇటీవల ఆయన పెంచిన స్వరం సదరు ఎమ్మెల్యేకు చేటు చేస్తుందా...? అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆయన సొంత నియోజకవర్గంలో కేసు నమోదు చేసేందుకు, పోలీసులు సాహసం చేయడం వెనుక ఏ అదృష్ట శక్తి పనిచేసింది...? ఇందూరులో గులాబీ ఎమ్మెల్యేను వెంటాడుతున్న ఆ వివాదం ఏంటి.. షాడో ఎమ్మెల్యే తీరు ఆయన్ను ప్రజలకు దూరం చేస్తోందా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఏకైక మైనార్టీ ఎమ్మెల్యేపై జరుగుతున్న తాజా చర్చ ఏంటి...? పార్టీకి ఆయన దూరం అవుతున్నారా.. పార్టీ ఆయన్ను దూరం పెడుతోందా...? తాజా పరిణామాలు దేనికి సంకేతం..?

ఆయన రాష్ట్రంలోనే ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే. కొంత కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన కొద్ది రోజుల క్రితం అదిష్ఠానంపై స్వరం పెంచి బీజేపీ ఎంపీతో ములాఖత్ అయ్యారు. ఆ వివాదం సద్దుమణగకముందే తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. సదరు ఎమ్మెల్యేపై ఏకంగా ఆయన సొంత నియోజకవర్గంలో పోలీస్ కేసు నమోదు కావడం రాష్ట్ర స్దాయిలో సంచలనం సృష్టించిందట. ప్రాథమికంగా సాక్ష్యాధారాలు లేకుంటే సామాన్యుల విషయంలోనే ఆచితూచి కేసు పెట్టే పోలీసులు, ఏకంగా ఎమ్మెల్యే విషయంలో ఆదరబాదరగా కేసు నమోదు చేయడం వెనుక అసలు కారణం ఏంటో తెలియక ఆయన లోలోపల కుమిలిపోతున్నారట. మీడియాలో చూసే వరకు కేసు విషయం తెలియక, ఓ దశలో పోలీసుల తీరుపై రాజీనామాకు సిద్దపడ్డారనే వార్త, నియోజకవర్గం గులాబీ శ్రేణులను హైరానా పడేలా చేసిందట.

బోధన్ మండలం ఆచన్‌పల్లి రహదారిపై రెండు రోజుల క్రితం అర్ధరాత్రి ఓ గొడవ జరిగింది. ఎమ్మెల్యే షకీల్ ఆయన అనుచరులు ఇసుక మాముళ్ల కోసం తనపై దాడి చేశారంటూ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లడం ఆఘమేఘాలపై ఎమ్మెల్యే షకీల్ తో పాటు ఆయన సోదరుడు సోహైల్, మరో ఏడుగురిపై కేసు కావడంపై ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట. ఏదో అదృశ్య శక్తి తన సొంత నియోజకవర్గంలో వేలు పెడుతోందని తనపై కేసు పెట్టేలా పోలీసులపై ఒత్తిడి చేశారని సదరు ఎమ్మెల్యే తర్జన భర్జన పడుతున్నారట. ఐతే ఎమ్మెల్యే షకీల్ పై అధిష్ఠానం కొద్ది రోజులుగా గుర్రుగా ఉందట. ఆయన నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ను కలవడం, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం - బీజేపీ వైపు వెళ్తారనే ప్రచారంతో ఆయన వ్యవహార శైలీపై ఓ కన్నేసిందనే టాక్ నడుస్తోంది.

దీనికి తోడు నియోజకవర్గంలో ఇసుక దందాలో ఎమ్మెల్యే అనుచరుల జోక్యం పెరిగిపోవడం కూడా అధిష్ఠానానికి తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఆయన సోదరుడు షాడో ఎమ్మెల్యేగా ప్రతీ పనిలో జోక్యం చేసుకోవడం, అధికారులను బెదిరించడం పట్ల అధిష్ఠానం సీరియస్ అయ్యిందట. ఈ వివాదాలు ఆయనకు చెక్ పెట్టేలా చేస్తున్నాయనే ప్రచారం నడుస్తోంది.

ఎమ్మెల్యేపై కేసు నమోదు వెనుక పార్టీ పెద్దల జోక్యం ఉందనే ప్రచారం ఉంది. ఆయన దూకుడుకు బ్రేక్ వేసేందుకు కేసు పేరుతో పాచిక వేసిందనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినపిస్తోంది. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో ఉన్న షకీల్ పార్టీకి దూరం అవుతున్నారా..? పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారనే సమాచారంతో ఆయన్ను దూరం పెడుతున్నారా .? అనేది తేలక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. ఈ వివాదానికి గులాబీ బాస్ ఎలాంటి ముగింపు ఇస్తారన్నది ఆసక్తికరంగా మరింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories