Kalvakuntla Kavitha: కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు..?

Kalvakuntla Kavitha: కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు..?
x

Kalvakuntla Kavitha: కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు..?

Highlights

Kalvakuntla Kavitha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Kalvakuntla Kavitha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష భారతీయ రాష్ట్ర సమితిలో అత్యంత చురుకైన పాత్ర పోషించిన కవితను ఆ పార్టీ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. కవిత ఇష్యూలో ఆమె సొంత ఇలాకాతోపాటు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు సైతం అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట. ఈ పరిణామంతో కవిత నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయటంపై బీఆర్‌ఎస్ నేతలెవరూ ఎక్కడా పాజిటివ్‌గా స్పందించడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏకచక్రాధిపత్యం వహించి పార్టీని నడిపించిన కవిత ప్రస్తుతం ఒంటరి అయ్యారు. మీడియా సమావేశాలు నిర్వహించి మరీ.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని గులాబీ పార్టీ శ్రేణులు స్వాగతిస్తున్నారు. కన్నకుమార్తె అనీ కూడా చూడకుండా.. అధినేత కేసీఆర్ పార్టీ శ్రేయస్సు కోసం కఠిన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొస్తున్నారు. అసలు కవిత ఉంటే ఎంత..? పోతే ఎంత..? అన్నట్లు.. తమకు మాత్రం కేసీఆరే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు హరీశ్ రావ్, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ జాగృతి నాయకులు ఆందోళన చేస్తున్నారు. వారి దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కనీసం ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి శ్రేణుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కవిత టార్గెట్‌గా బీఆర్ఎస్ శ్రేణులు పోస్టులు చేస్తుంటే.. హరీశ్ రావ్ టార్గెట్‌గా జాగృతి కార్యకర్తలు, కవిత అనుచరులు పోస్టులు పెడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జాగృతి నేతలు రెండు వర్గాలుగా వీడిపోయారు.

కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారనే చర్చ ఒకవైపు జోరందుకుంది. ఇప్పటికే జాగృతి సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్న ఆమె.. సొంతంగా పార్టీని ప్రకటించే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ఒకటి, రెండు పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అంతే కాకుండా ఎమ్మెల్సీ పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా కవిత రాజీనామా చేయడంతో అసలేం జరుగుతుందనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న కవిత... పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ రావడం, బీసీ అజెండాగా పలు కార్యక్రమాలు సైతం చేపట్టారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే మాదిరిగా ముందుకెళ్లే అవకాశాలు ఉండగా, జాగృతి పేరుతోనే పార్టీని ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయనే రాజకీయ విశ్లేషణలు, అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా కారు పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన కవిత.. సస్పెన్షన్ వేటుకు గురికావటం రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అంతే కాకుండా కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నసంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సొంత కుమార్తె అయిన కవితను సస్పెండ్ చేయటం వంటి పరిణామాలు కారు పార్టీలో కల్లోలంగా మారాయి. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత.. పార్టీలో జరుగుతున్న విషయాలపై తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినప్పటి నుంచి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. లేఖ లీక్‌ కావడం అమెరికా పర్యటన నుంచి వచ్చిన ఆమె.. కేసీఆర్‌ వెంట దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించడంతో కవిత అనుచరులు బహిరంగంగానే సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం.. వాటిని బీఆర్‌ఎస్‌ శ్రేణులు తిప్పికొట్టడం వంటివి జరిగాయి. జిల్లాలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓటమికి పరోక్షంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సహకరించారని కవిత అనుచరులు సోషల్‌ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత తరుణంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్నీతానై కారు పార్టీని నడిపించిన కవిత.. ప్రస్తుతం ఒంటరయ్యారు. కవిత విషయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కేసీఆర్‌ కుమార్తెగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత.. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. జిల్లాలో పార్టీని ఒంటి చేత్తో నడపగలిగిన కవిత.. తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఒకరిద్దరు మండల స్థాయి నాయకులు తప్ప ప్రథమ శ్రేణి నాయకత్వం ఎక్కడ కూడా స్పందించకపోవడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కవిత గతంలో పార్టీ పరిస్థితిపై లేఖ రాయడం, లేఖ లీక్‌ కావడం.. అమెరికా పర్యటన నుంచి వచ్చిన ఆమె బహిరంగంగా పార్టీలో దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం వంటి విషయాలపై జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత జిల్లాకు వచ్చిన ఆమెకు ఎక్కడ కూడా బీఆర్‌ఎస్‌ శ్రేణులు స్వాగతం పలకలేదు. చివరికి ఆమెను స్వాగతం పలుకుతూ పెట్టిన ఫ్లెక్సీలలో సైతం కేసీఆర్‌ ఫొటో తప్ప.. ఇతర నాయకుల ఫొటోలు ఏవీ పెట్టలేదు. ఆమె పర్యటనకు సైతం బీఆర్‌ఎస్‌ శ్రేణులు దూరంగానే ఉన్నారు. ఒకరిద్దరు పెద్ద నాయకులు తప్ప ఆమె పర్యటనకు గులాబీ శ్రేణులు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఎక్కడ కూడా ప్రథమశ్రేణి నాయకత్వం స్పందించకపోవడంతో జిల్లాలో కవిత ఒంటరి అవుతున్నారనే ప్రచారానికి బలం చేకూర్చుతోంది. ఈ క్రమంలో కవిత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న విషయం తీవ్ర ఉత్కంఠగా మారింది. కవిత సొంతంగా పార్టీ పెడతారా..? జాతీయ పార్టీలతో కలిసి ముందుకు నడుస్తారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే కవితతో కలిసి నడిచేదెవరు..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories