
Br Ambedkar: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు హైదరాబాద్‌తో గొప్ప అనుబంధం.. డాక్టరేట్‌తో గౌరవించిన తొలి వర్సిటీ ‘ఓయూ’
Br Ambedkar: నాలుగు సార్లు నగర పర్యటన.. నిజాం సర్కారుతో సత్సంబంధాలు
Br Ambedkar: భారతదేశంలోనే గొప్ప యూనివర్శిటీగా పేరొందిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచదేశాలు గౌరవించిన న్యాయకోవిదుడు, గొప్ప ఆర్థిక నిపుణుడు, రాజనీతిజ్ఞుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం గొప్ప గౌరవంగా భావించింది. అంబేద్కర్‌కు మొట్టమొదట గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసిన తొలి భారతీయ విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీయే... 1953, జనవరి 12న ఓయూ ఆయనను డీలిట్‌తో సత్కరించి, అరుదైన ఘనతను సొంతం చేసుకుంది ఓయూ.
అణగారిన వర్గాల ఆత్మాభిమాన పతాక బాబా సాహెబ్ అంబేద్కర్ అడుగు జాడలు హైదరాబాద్ నగర చరిత్రలో అత్యంత అపురూపమైనవి. భారత రాజ్యాంగ నిర్మాతను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించిన ఘనత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సొంతమయింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం నగరం నడిబొడ్డున ఇవాళ ఆవిష్కృతమవుతున్న సందర్భంగా ఈ నేలతో ఆ మహనీయుడికున్న ఆత్మీయానుబంధం ఎంతో గొప్పది...
హైదరాబాద్‌తో అంబేడ్కర్‌కు చాలా అనుబంధం ఉంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హైదరాబాద్‌కు నాలుగు సార్లు వచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ సికింద్రాబాద్ పెండర్ ఘాస్ట్ రోడ్డులోని జేహెచ్ సుబ్బయ్య ఇంట్లో బస చేసే వారు. 1931లో లండన్‌లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు అంబేద్కర్‌కు నిజాం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. అందులో మిగిలిన 8 వేల రూపాయలతో ఆయన ముద్రణ యంత్రాన్ని, మరికొన్ని పుస్తకాలను కొనుగోలు చేశారు. హైదరాబాద్ దళిత త్రయంగా పిలిచే అరిగె రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, బీఎస్ వెంకట్రావుతోనూ అంబేద్కర్‌కు స్నేహ సంబంధాలున్నాయి. అంబేద్కర్‌ను రౌండ్ టేబుల్ సమావేశానికి పంపించాలని తీర్మానించిన లఖనవ్ మహాసభకు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించడమే గాక, ఆయన ఆలోచనలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
1936లో సికింద్రాబాద్ న్యూ బోయిగూడలో 'అంబేద్కర్ యూత్ లీగ్'ను బీఎస్ వెంకట్రావు ప్రారంభించారు. తెలుగు నేల మీద అంబేద్కరిజానికి తొలి అడుగు ఇదే అని తెలుస్తోంది. తర్వాత రెండేళ్లకు దాన్ని హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్‌గా మార్చారు. 1936, మే 30న ముంబైలో ప్రథమ మహర్ సదస్సుకు అధ్యక్షత వహించడానికి వెళ్లిన బీఎస్ వెంకట్రావుకు.. దాదర్ రైల్వే స్టేషన్‌లో అంబేద్కర్ స్వాగతం పలకడమే కాదు.. ఆయనను అంబారీపై ఊరేగింపుగా సభాస్థలికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి వెంకట్రావును 'హైదరాబాద్ అంబేద్కర్' అనే వారు... అదే తరంలో జేహెచ్ సుబ్బయ్య, రాజమణీ దేవి, కేఆర్ వెంకటస్వామి, ఆదయ్య, శ్యాంసుందర్, విఠల్‌రావు కాంబ్లే, తర్వాత సుమిత్రాదేవి, ఈశ్వరీ బాయి, సదాలక్ష్మి వంటి వారంతా అంబేద్కర్ ఆలోచనలకు ప్రభావితమై, దళిత ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారు.
అంబేద్కర్‌కు ఆత్మీయుడైన బీఎస్ వెంకట్రావు నిజాం ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిగా 1947లో బాధ్యతలు తీసుకున్నారు. అదే సమయంలో మహారాష్ట్రలో విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్న అంబేద్కర్‌కు ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనను ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దృష్టికి తీసుకెళ్లారు వెంకట్రావు.... అలా ఆయన చొరవతో.. బాబా సాహెబ్ ఔరంగాబాద్‌లో స్థాపించిన 'మిలింద్ మహా విద్యాలయ' నిర్మాణానికి 54 ఎకరాల భూమితో పాటు 12 లక్షల రూపాయల నగదును ఏడో నిజాం విరాళంగా ఇచ్చారు.
భారత తొలి ఎన్నికల్లోనూ అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ పార్టీ... హైదరాబాద్ రాష్ట్రంలో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయగా, ఐదు స్థానాల్లో గెలిచింది. అందులో మహబూబాబాద్ నుంచి బీఎం రామచందర్‌రావు, సిరిసిల్ల నుంచి రాజమణీ దేవి, జగిత్యాల నుంచి బుట్టి రాజారాంతో పాటు మహారాష్ట్ర పర్బని జిల్లా నుంచి మరో ఇద్దరు చట్టసభలో అడుగు పెట్టారు. అంబేద్కర్ నాయకత్వంలో ఆ పార్టీ గెలిచిన రెండు లోక్‌సభ స్థానాల్లో కరీంనగర్ ఎంపీగా ఎంఆర్ కృష్ణ విజయఢంకా మోగించడం మరో విశేషం. ఆ మహనీయుడి పేరుతో నగరంలో ఎన్నో కాలనీలు.. వాడవాడలా విగ్రహాలు... ఉన్నాయి. అంబేద్కర్ పేరుతో సార్వత్రిక విశ్వవిద్యాలయం కూడా ఉంది. ఇప్పుడు తెలంగాణ సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘటనకు నాంది పలికింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




