మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు రీ ఎంట్రీ అందులో భాగమేనా?

మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు రీ ఎంట్రీ అందులో భాగమేనా?
x
Highlights

తెలంగాణలో గులాబీని ఢీకొట్టి... కమలం వికలసించాలనుకుంటుందా? మళ్లీ పాత నాయకులను తెరపైకి తెచ్చి బలపడాలనుకుంటుందా? మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు...

తెలంగాణలో గులాబీని ఢీకొట్టి... కమలం వికలసించాలనుకుంటుందా? మళ్లీ పాత నాయకులను తెరపైకి తెచ్చి బలపడాలనుకుంటుందా? మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు రీ ఎంట్రీ అందులో భాగమేనా? సాగర్‌జీని తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకం చేయాలన్న ప్లాన్‌లో ఉందా? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ఇంతకీ కమలం యాక్షన్‌ ప్లాన్‌ ముందు ముందు ఎలా ఉండబోతోంది?

అటు కారు పరుగులు... ఇటు కమలం కత్తులు

గులాబీ దీటైన వ్యూహాన్ని కాషాయదళం రచిస్తోందా?

విద్యాసాగర్‌రావు రీ ఎంట్రీని ఎలా చూడాలి?

కల్వకుంట్ల వర్సెస్‌ చెన్నమనేని ఫ్యామిలీ అన్నట్టేనా?

కేసీఆర్‌కు చెక్‌ పెట్టే సత్తా సాగర్‌జీకి ఉందా?

తెలంగాణపై ఫోకస్ చేసిన కమలం పార్టీ అందుకు అనుగుణంగా వేగంగా పావులు కదుపుతోంది. ముందు సంస్థాగతంగా బలోపేతం చేయటంపై దృషి సారించిన ఆ పార్టీ ఆ దిశగా దృష్టి సారించింది. ఇతర పార్టీ నాయకులను పార్టీలో భారీగా చేర్చుకోవడంతో పాటు సభ్యత్వ నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆశించిన స్థాయిలో సభ్యత్వాలు చేయించగలిగింది. ఇటీవల ఢిల్లీ బీజేపీ పెద్దలు తరచూ రాష్ట్రానికి వస్తూ ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేలా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అందుకే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఆ పార్టీలో మరింత జోష్ నింపింది. తెలంగాణ గడ్డపై కాషాయం జెండా మరింత రెపరెపలాడాలని ఆశిస్తున్న హైకమాండ్ ఇక కేసీఆర్‌కు ధీటుగా తమ సీనియర్లను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

రెండుసార్లు ఎంపీ, మూడుసార్లు ఎమ్మెల్యే

ఈ అర్హత సరిపోతుందా... ఇంకా ఏమైనా కావాలా?

మాస్‌ను మెప్పించే సత్తా విద్యాసాగర్‌కు ఉందా?

టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలంటే విద్యాసాగర్‌రావుకు కీలక బాధ్యతలు అప్పగించి పార్టీకి జవసత్వాలు నింపాలని పార్టీ ఆలోచన చేస్తుందని ఆ పార్టీలోని నాయకులే చెబుతున్నారు. గతంలో తెలంగాణ రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన విద్యాసాగర్‌రావు మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా గెలిచారు. దివంగత వాజ్‌పేయి హయాంలో హోంశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2004, 2009 ఉపఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో వేములవాడ శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. అలా కొన్నాళ్లు రాజకీయాలకు దూరమైన విద్యాసాగర్‌రావు తర్వాతి కాలంలో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. విద్యాసాగర్‌రావు గవర్నర్ పదవీ కాలాన్ని పొడిగిస్తారని అంతా చర్చ జరిగింది. కానీ అలా జరగలేదు. దీంతో ఇక విద్యాసాగర్‌రావు విశ్రాంతి తీసుకుంటారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన పార్టీ సభ్యత్వం తీసుకోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ వంటి రాజ్యాంగపరమైన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి అదీ రాష్ట్ర రాజకీయాల్లోకి రావటం కచ్చితంగా చర్చనీయాంశంమేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

సామాజిక వర్గం ఒకటే అయితే సరిపోతుందా?

కేసీఆర్‌కు చెక్‌ పెట్టాలంటే ఇదొక్కటే చాలా?

పార్టీ అధ్యక్ష పదవిని విద్యాసాగర్‌ చేతిలో పెడుతారా?

ఇవన్నీ సరే అయితే తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా ఉన్న కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు సాగర్‌జీకి ఉన్నాయా? వేదికలపై మంచి ప్రసంగాలు చేయగలడేమో కానీ కేసీఆర్‌లా మాస్‌ను మెప్పించే చతురత విద్యాసాగర్‌రావుకి ఉందా? కేసీఆర్‌ సామాజికవర్గం నాయకుని ద్వారానే తెలంగాణ సీఎంకు చెక్ పెట్టాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది. విద్యాసాగర్‌రావుకు పార్టీ బాధ్యతలు అప్పగించి 2023లోపు పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ భావిస్తుందన్నది పార్టీలో ఉన్నతస్థాయి వర్గం వాదన. ప్రస్తుతం అధ్యక్షుడి ఎన్నిక విషయంలో కొత్త, పాత, సీనియర్, జూనియర్ అనే చర్చ జరుగుతుండటంతో సాగర్‌జీకి పార్టీ సారథ్యం అప్పగిస్తే ఏ బాధ ఉండదని భావిస్తున్నట్లు పార్టీలో మాట్లాడుకుంటున్నారు.

ఇక కొందరైతే వచ్చే ఎన్నికల నాటికి సాగర్్జీని సీఎం అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. ఈ చర్చలను పార్టీలోని మరో వర్గం ఖండిస్తుంది. చెన్నమనేని కుటుంబం కల్వకుంట్ల కుటుంబ మధ్య మంచి సంబంధాలున్నాయని ఆ విషయం పార్టీ అధిష్టానానికి తెలుసునని, తెలిసి తెలియని సాగర్‌జీని పార్టీలో అందలం ఎక్కించాలని ఎందుకు చూస్తుందన్నది వారి వాదన. కేసీఆర్‌కు, విద్యాసాగర్‌రావుకు మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందేనని చెబుతున్నారు. ఆయన తిరిగి పార్టీ సభ్యత్వం తీసుకోవడం కేవలం వారి సొంత అభిప్రాయమేనని అందులో పార్టీ ప్రమేయం ఏమీ లేదని కొట్టిపారేస్తున్నారు. ఈ విషయంలో సాగర్ జీ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. పార్టీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చిందని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మాత్రమే ఆయన చెప్పుకొస్తున్నారు. మరి లోగట్టు పెరుమాళ్లకే తెలుసా?


Show Full Article
Print Article
More On
Next Story
More Stories