గ్రేటర్‌లో గులాబీలో కమలం రేపుతున్న గుబులేంటి?

గ్రేటర్‌లో గులాబీలో కమలం రేపుతున్న గుబులేంటి?
x
Highlights

అసెంబ్లీ ముందస్తుకు వెళ్లి, గులాబీ గుభాళించింది. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, గ్రేటర్‌కు కూడా ముందస్తు ముహూర్తానికి లెక్కలు చూస్తోంది....

అసెంబ్లీ ముందస్తుకు వెళ్లి, గులాబీ గుభాళించింది. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, గ్రేటర్‌కు కూడా ముందస్తు ముహూర్తానికి లెక్కలు చూస్తోంది. అసెంబ్లీకి ముందస్తు కలిసొచ్చినట్టే, జీహెచ్‌ఎంసీకి కూడా ఏడాది ముందే ఎన్నికల నగారా మోగిస్తే ఎలా ఉంటుందని గులాబీ బాస్‌ ఆలోచిస్తున్నారట. అయితే ముందస్తు చూపులో ఉన్న గులాబీకి, కళ్లెం వేయాలని చూస్తోంది కమలం. గ్రేటర్‌ టీఆర్ఎస్‌పై ఆపరేషన్‌ మొదలెట్టింది. ఇంతకీ గులాబీలో కమలం గుబులేంటి?

తెలంగాణ రాష్ట్రాభివృద్దికి గ్రోత్ ఇంజిన్ లాంటి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో, పాగా వేయాలని ప్రతి పార్టీ భావిస్తుంది. రాష్ట్ర విభజనకు ముందు టీఆర్ఎస్‌ ఇటువైపు అసలు చూడలేకపోయింది. అయితే 2015లో విజయఢంకా మోగించి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 సీట్లలో 99 స్థానాలు గెలుపొంది సత్తా చాటింది. గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేసిన టీఆర్ఎస్, యువ నాయకులుకు ప్రాధాన్యమిచ్చి బొంత రామ్మోహన్‌కు మేయర్, బాబా ఫసియుధ్దీన్‌కు డిప్యూటి మేయర్ పదవులు కట్టబెట్టింది. అటు పెద్ద సంఖ్యలో మహిళలను, పార్టీ నాయకులను కార్పొరేటర్లుగా గెలిపించుకొంది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దం అవుతుండటంతో, వీటితో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా అటు మున్సిపల్ చట్టం రూపకల్పనతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ చట్టం, వాటర్ బోర్టు చట్ట సవరణలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇంకా ఏడాది పాటు పాలక వర్గం కొనసాగడనికి సమయం ఉన్నా, ముందస్తు కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లేలా టీఆర్ఎస్‌ ప్రణాళిక సిద్దం చేస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే రాష్ట్ర్రంలో మున్సిపాలిటీల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు ఖరారు అవుతున్నాయి. అంటు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ముందస్తు సెంటిమెంట్‌తో గ్రేటర్‌లో మరోసారి పాగా వేయాలని గులాబీదళం వ్యూహం సిద్దం చేస్తుంటే, ఇదే అందివచ్చిన అవకాశంగా అటు బీజేపీ పావులు కదుపుతుండటం గ్రేటర్‌ పాలిటిక్స్‌ను మరింత హీటెక్కిస్తోంది.

మొన్న పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రయ్యారు. ఇప్పుడు జరుగబోయో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను గెలిచి, మోడీ, అమిత్‌ షాలకు కానుకివ్వాలనుకుంటున్నారు కిషన్‌ రెడ్డి. ఇందుకోసం అనేక వ్యూహాలు రచిస్తున్నారు. అందులో ఒక స్ట్రాటజీ టీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు గాలం. బలమైన టీఆర్ఎస్ కార్పొరేటర్లను ఆకర్షించేందుకు పావులు కదుపుతోంది బీజేపీ. గ్రేటర్‌లో చాలా మంది కార్పొరేటర్లు ఆర్థికంగా, సామాజికంగా బలమైన వారు. చాలామంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ల కోసం కూడా గట్టిగా ప్రయత్నించారు. అయితే సిట్టింగ్‌లకే టీఆర్ఎస్ మళ్లీ అవకాశం ఇవ్వడంతో, ఆశావహులు అసంతృప్తితో రగిలిపోయారు. తమ భవిష్యత్ రాజకీయ అవసరాలకోసం ప్రత్యామ్నాయ అవకాశాల కోసం అన్వేషిస్తున్నారని చర్చ జరుగుతోంది. అదే కమలానికి ఆయుధమవుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 డివిజన్లకుగాను, దాదాపు హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో 40 కార్పొరేషన్ డివిజన్లలో ఎంఐఎం ప్రభావం ఉంటుంది. మిగతా 110 డివిజన్లలో కొంత మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఇటు చేవెళ్ల పరిధిలో, సికింద్రాబాద్ లోక్ సభ నియోజక వర్గం లిమిట్స్‌లో ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయినా, పార్లమెంటు ఎన్నికల్లో కాస్త చతికిలబడింది టీఆర్ఎస్. నాలుగు ఎంపీ స్థానాలతో జోష్‌ మీదుండటంతో పాటు రాజకీయంగానూ, తమకు మంచి అవకాశంగా భావిస్తున్న బీజేపీ, బలమైన నాయకులకు గాలమేస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల నుంచి అనేకమందిపై ఆపరేషన్‌ ఆకర్ష్ ప్రయోగిస్తూ, ఎలాగైనా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాలని స్ట్రాటజీలు వేస్తోంది.

ఇప్పటికే చాలామందితో ఆ పార్టీ సీనియర్ నేతలు టచ్లోకి వెళ్లినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 60 నుంచి 80 కార్పొరేషన్ స్థానాల్లో, తమ సత్తా చాటాలాని బీజేపీ ప్రయత్నిస్తుంటే, ఇప్పుడు వారి ప్రయత్నాలు గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మొన్నటి ఎన్నికల్లో సరిగ్గా పనిచేయని నేతలను పక్కన బెడుతామని ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో, ఈసారి తమకు అవకాశం వస్తుందో రాదోననే బెంగతోనే చాలా మంది సిట్టింగ్ కార్పొరేటర్లు పక్కచూపులు చూస్తున్నారని తెలుస్తోంది.

మొత్తానికి ఇప్పుడు టీఆర్ఎస్ అధిష్టానం, బీజేపీ విసురుతున్న ఆపరేషన్ గ్రేటర్ ఆకర్ష్‌కు ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి. మరో ఏడాది గ్రేటర్ పాలక మండలి కొనసాగే అవకాశం ఉన్నా, నగరంలో బీజేపీ బలపడకముందే ముందస్తుకు వెళ్లాలని టీఆర్‌ఎస్‌ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు వర్కౌటైన నేపథ్యంలతో, ముందస్తు గ్రేటర్‌ పోల్‌కు వెళితే, ఫలితాలు సానుకూలంగా ఉంటాయని భావిస్తోంది టీఆర్ఎస్. అయితే అటు బీజేపీ కూడా ఈసారి గ్రేటర్‌ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, చాపకింద నీరులా స్ట్రాటజీలు సిద్దం చేస్తుండటంతో, ఈసారి మహా నగరం పోరు, రసవత్తరంగా సాగే అవకాశముందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories