logo

రాములమ్మ తిరిగి సొంత గూటికి చేరుతురా?

రాములమ్మ తిరిగి సొంత గూటికి చేరుతురా?
Highlights

తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లేడీ నేతకు, కమలం గాలం వేస్తోందా సొంత గూటికి ఆహ్వానించేందుకు చాటుమాటుగా ప్రయత్నాలు...

తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లేడీ నేతకు, కమలం గాలం వేస్తోందా సొంత గూటికి ఆహ్వానించేందుకు చాటుమాటుగా ప్రయత్నాలు సాగుతున్నాయా గతంలో ఆమె అదే పార్టీలో పనిచేయడంతో పాత మిత్రులు కాషాయ తీర్థం పుచ్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నారా టికాంగ్రెస్‌లో ఎంతకష్టపడ్డా గుర్తింపు లేదని బాధపడుతున్న లేడీ డాన్‌తో మాట్లాడేందుకు బీజేపీ నేతలు ట్రై చేస్తున్నారా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, వీటికి ఔననే సమాధానం వస్తోంది.

తెలంగాణలో నాలుగు పార్లమెంట్‌ స్థానాలు గెలిచిన ఉత్సాహంలో రకరకాల వ్యూహాలకు స్కెచ్ వేస్తోంది కమలం పార్టీ. కాంగ్రెస్, టీడీపీ నేతలను ఆకర్షిస్తూ, తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్నామ్నాయ శక్తిగా ఎదగాలని అనేక ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగా కొందరు ఫైర్‌ బ్రాండ్‌ లీడర్లకు గాలం వేస్తోంది కమలం. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారే కాకుండా, గతంలో బిజేపిలో పనిచేసిన నేతలను సైతం ఆకర్షించేపనిలో ఉంది బీజేపీ. ఇప్పుడా వరుసలో గట్టిగా వినిపిస్తున్న పేరు విజయశాంతి. తెలంగాణ రాములమ్మ.

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌ విజయశాంతిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని చాలా సీరియస్‌గా కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. బీజేపీ అంటే పడని నేతలు, కరడు గట్టిన కాంగ్రెస్ వాదులు సైతం కమలం వైపు చూస్తుండటంతో, గతంలో బీజేపీలో పనిచేసిన విజయశాంతిని సైతం, పార్టీలోకి తీసుకురావడానికి ఢిల్లీ నుంచే జోరుగా ప్రయత్నాలు మొదలయ్యాయని రాజకీయవర్గాల్లో డిస్కషన్‌ జరుగుతోంది.

బీజేపీలో ఉన్నకాలంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతంగా నడిపారు విజయశాంతి. సొంత పార్టీ స్థాపించారు. అయితే దాన్ని నడపలేక టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత కేసీఆర్‌తో విభేదాలు, అటు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందన్న కారణాలతో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ పెద్దల తీరుతో చాలా అసంతృప్తిగా ఉన్నారు రాములమ్మ.

ఎన్నికల టైంలో అనేక నియోజకవర్గాలు చుట్టేసి వచ్చినా, కేసీఆర్‌పై దీటుగా మాట్లాడినా, సరైన గుర్తింపు రావడం లేదని రగిలిపోతున్నారు రాములమ్మ. సొంత పార్టీ నేతల తీరుపై సోషల్ మీడియా వేదికగా అనేక విమర్శలు చేశారు. రాజకీయాలపై విసిగిపోయి, సినిమాల బాటపట్టారని కొందరు అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ మీద కోపంతో ఊగిపోతున్న విజయశాంతిని, ఇలాంటి పరిస్థితుల్లో తమవైపు లాగేందుకు సరైన సమయమని ఆలోచిస్తున్నారు కాషాయ నేతలు.

విజయశాంతిని మళ్లీ బీజేపీలోకి తీసుకొస్తే, పార్టీకి మహిళా ఓటర్లు మరింత దగ్గర కావడంతో పాటు , రాములమ్మ పేరుతో మాస్ ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని ఆలోచిస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. కేసీఆర్‌ మీద కూడా అటాకింగ్‌ మోడ్‌లో విజయశాంతి మాట్లాడతారు కాబట్టి, ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌ దొరికినట్టవుతుందని భావిస్తున్నారు. విజయశాంతిని తిరిగి బీజేపీలోకి తీసుకురావడం వల్ల కాంగ్రెస్‌ను దెబ్బతీయడంతో పాటు, వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌కు దీటుగా యుద్ధానికి సిద్దంకావొచ్చన్నది బీజేపీ వ్యూహకర్తల ఆలోచన. అందుకే విజయశాంతిని అప్రోచ్ అయ్యేందుకు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యనేతలే ఆమెతో టచ్‌లోకి వెళ్లినట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరగుతోంది.

కాంగ్రెస్‌లో ముఖ్యమైన కార్యక్రమాలకు సైతం ఆమెకు ఆహ్వానం పంపడం లేదట ముఖ్యనేతలు. దీంతో విజయశాంతి అలిగినట్లు ప్రచారం జరుగుతోంది. కోర్ కమిటి మీటింగ్‌కు సైతం ఆమె డుమ్మా కొట్టారు. అందుకే విజయశాంతిని, కమలం వైపు ఆకర్షించేందుకు ఇదే సరైన సమయంగా చక్రంతిప్పుతున్నారు. చూడాలి. రాములమ్మ మళ్లీ సొంత గూటికి చేరుతురా లేక అవమానాలు భరిస్తూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా.


లైవ్ టీవి


Share it
Top