తెలంగాణలో బెంగాల్‌ తరహా వ్యూహానికి బీజేపీ పదును

తెలంగాణలో బెంగాల్‌ తరహా వ్యూహానికి బీజేపీ పదును
x
Highlights

తెలంగాణలో బెంగాల్‌ వ్యూహం. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా మదిలో మెదులుతున్న స్ట్రాటజీ ఇది. అయితే అక్కడ దీదీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలున్నాయి మరి...

తెలంగాణలో బెంగాల్‌ వ్యూహం. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా మదిలో మెదులుతున్న స్ట్రాటజీ ఇది. అయితే అక్కడ దీదీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలున్నాయి మరి తెలంగాణలో. తెలంగాణలోనూ కమ్యూనిస్టు నేతలపై గురిపెట్టిందట భారతీయ జనతా పార్టీ. లెఫ్ట్‌ భావాలు వదిలేసి, రైట్‌ రైట్‌ అనే నేతల కోసం అన్వేషణ మొదలుపెట్టిందట.

తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు కొల్లగొట్టే సరికి, రకరకాల వ్యూహాలకు పదునుపెడుతోంది కాషాయదళం. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను రీప్లేస్‌ చేసి, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని రకరకాల వ్యూహాలు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఇప్పుడు కమ్యూనిస్టు కంచుకోటలపై గురిపెట్టింది కమలం. పశ్చిమ బెంగాల్‌ స్ట్రాటజీని ఇక్కడ అప్లై చేయడానికి పకడ్బందీగా అడుగులు వేస్తోంది.

తెలంగాణలో మరో బెంగాల్ వ్యూహాం అమలు చేయడానికి అన్ని మార్గాలూ అన్వేషిస్తోంది భారతీయ జనతా పార్టీ. గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండే ఉత్తర తెలంగాణలో, పార్టీ బలపడాలంటే వారిని అక్కున చేర్చుకోవాలని భావిస్తోందట కాషాయదళం. బెంగాల్‌లో అధికార టిఎంసిని ఎదుర్కొనే సత్తాలేక వామపక్షపార్టీలు బలహీనపడ్డంతో, వారిని బిజేపి అక్కన చేర్చుకొని దీదీని ఢీకొట్టింది. సరిగ్గా అదే వ్యూహాన్ని తెలంగాణలో బిజేపి అమలు చేయడానికి పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో వామపక్షపార్టీలు రోజురోజుకు బలహీనపడుతున్నాయి. దీనికి తోడు అధికార టిఆర్ఎస్‌ను ఎదుర్కొనే మద్దతు కూడా కమ్యూనిస్టు పార్టీలకు లేకుండాపోయింది. దీంతో అదే పార్టీలోని కొందరు కమ్యూనిస్టు నేతలే, గులాబీని ఢీకొట్టేందుకు కాషాయం వైపు చూస్తున్నారన్నది జరుగుతున్న చర్చ. ఒక అధికార పార్టీని ఎదుర్కొవాలంటే, మరో అధికార పార్టీనే సరైన ఆయుధమన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది కమ్యూనిస్టు నేతలు. అందుకే తమ రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి లెఫ్టు పార్టీల నేతలు రైట్ భావాలు తగిలించుకుని బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటి వరకు కేవలం కాంగ్రెస్, టీడీపీ నేతలపైనే కన్నేసిన కాషాయపార్టీ, ఇక కమ్యూనిస్టులను తమ గూటికి చేర్చుకునేందుకు సిద్దమవుతోంది. గతంలో కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న హుస్నాబాద్ నియోజికవర్గంలో, ఆ జిల్లా సిపిఐ కార్యదర్శి రాంభూపాల్ రెడ్డితో పాటు అదే జిల్లాకు చెందిన కమ్యూనిస్టులను చేర్చుకుంది బీజేపీ. దీనికి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండిసంజయ్, మాజీ మంత్రి డికే అరుణ మధ్యవర్తిత్వం ఫలించడంతో, కమ్యూనిస్టులు కాషాయగూటికి చేరారు. దీంతో బిజేపి బెంగాల్ వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేసేందుకు సిద్దమవుతోందనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. కరీంనగర్‌తో ప్రారంభించినా, త్వరలో నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా కమ్యూనిస్టులను కాషాయ పార్టీలోకి చేర్చుకోవడానికి పార్టీ నేతలు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎంలనే కాదు, అధికార టీఆర్ఎస్‌పైనా ఆకర్ష్ మంత్రం వేస్తోంది బీజేపీ. అయితే గులాబీ నుంచి కమలం గూటికి వచ్చేందుకు ఇప్పటివరకైతే ఎవరూ సిద్దంగా లేరని తెలుస్తోంది. అందుకే మిగతా పార్టీలను రీప్లేస్ చేయడానికి స్ట్రాటజీలు వేస్తోంది కమలం. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే, తెలంగాణలోనూ బెంగాల్ తరహా వ్యూహం అమలు చేసేందుకు బీజేపీ సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి, బెంగాల్ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్‌ అవుతుందో, బూమరాంగ్ అవుతుందో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories