బీజేపీ అధ్యక్షుడి రేసులో ఎవరి పేరు తెరపైకి వస్తోంది?

బీజేపీ అధ్యక్షుడి రేసులో ఎవరి పేరు తెరపైకి వస్తోంది?
x
Highlights

బీజేపీ తెలంగాణ శాఖ కొత్త అధ్యక్షుడి ఎన్నిక‌కు స‌మ‌యం ఆస‌న్నమైంది. వ‌చ్చే నెల రెండో వారం నాటికే అధ్యక్షుడి ఎన్నిక పూర్తికావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో...

బీజేపీ తెలంగాణ శాఖ కొత్త అధ్యక్షుడి ఎన్నిక‌కు స‌మ‌యం ఆస‌న్నమైంది. వ‌చ్చే నెల రెండో వారం నాటికే అధ్యక్షుడి ఎన్నిక పూర్తికావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో జాతీయ నాయ‌క‌త్వం అధ్యక్ష ఎంపిక‌పై అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్టింది. కేసీఆర్ లాంటి నాయకున్ని ధీటుగా ఎదుర్కొనే లీడర్‌కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పంగించాలని అధిష్టానం భావిస్తోంది. అయితే, ఈ పదవి కోసం నేతల పైరవీలు, అలకలు, కోల్డ్‌వార్‌లు చూసి, తల పట్టుకుంటోంది బీజేపీ అధిష్టానం.

డిసెంబర్‌లో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతల నుంచి ఇప్పటికే కేంద్ర నాయకత్వం, వివరాలు సేకరించినట్లు సమాచారం. తాజాగా పార్టీ ముఖ్యనేతలతో నాంపల్లి బీజేపీ కార్యాలయంలో సమావేశమైన రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ కృష్ణ దాస్, పార్టీ ముఖ్య నేతలను పిలిపించుకొని కొత్త అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందనే దానిపై అభిప్రాయం సేకరించారట. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలో ఉన్న కృష్ణ దాస్, పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించి కేంద్ర నాయకత్వానికి ఓ నివేదిక పంపించారని తెలుస్తోంది.

అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో ఇద్దరు ఎంపీలతో పాటు మరికొందరు ముఖ్య నేతలు, అధికార ప్రతినిధులు ఉన్నారని సమాచారం. ఇప్పటి వరకు 13 మంది నేతలు అధ్యక్ష పదవి కోసం అప్లికేషన్ పెట్టుకున్నారట. అయితే చాలామంది నేతలు బయటకు చెప్పకపోయినప్పటికీ అధ్యక్ష పదవికోసం ఢిల్లీ స్థాయిలో తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తాను అధ్యక్ష భాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాల వివరాలను కేంద్ర నాయకత్వానికి ఓ నివేదిక రూపంలో సమర్పించారట. ఇక మాహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు కూడా రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇటీవలే పార్టీ సభ్యత్వం తీసుకోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.

జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు మాత్రం, తనకు అధ్యక్ష పదవి అవకాశం గతంలోనే వచ్చినా తానే స్వీకరించలేదని, ఇప్పుడు కూడా ఆశించట్లేదని బహిరంగంగా చెప్తున్నా, తన ప్రయత్నాల్లో తాను ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా అధ్యక్ష పదవి కోసం తీవ్రంగానే కృషి చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇటీవల ఆయన వేరే పనులపై ఢిల్లీ వెళ్లినట్టు బయటకు చెప్తున్నా పార్టీ పెద్దలను కలిసి అధ్యక్ష పదవి కోసం తన పేరును పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. సంజయ్‌కి ఆరెస్సెస్ నేతలతో మంచి సంబంధాలు ఉండటం కలిసొస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఇక అధ్యక్ష పదవి కోసం పాతవారిలో, పోటీలో ఉన్నవారిలో రాంచంద్రరావు ముందున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ అధ్యక్ష పదవి కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. డీకే అరుణ రాంమాధవ్ ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడి చేయడంలో డీకే అరుణ ముందుంటారని, అందులోనూ మహిళ కాబట్టి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్న చర్చ పార్టీలో జరిగినా, కొత్త వాళ్ళకిస్తే పాత వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. ఇక వీళ్ళే కాకుండా రఘునందన్ రావు, పేరాల శేఖర్, కృష్ణ సాగర్ రావు, యెండల లక్ష్మీనారాయణ, వివేక్, చింతల రాంచంద్రా రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నిజానికి బీజేపీ అధిష్టానానికి అధ్యక్షుడి నియామకం పెద్ద తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది. సీనియర్, జూనియర్ అనే సమస్యతో పాటు కొత్త-పాత పంచాయతీ మొదలవుతోంది. దీంతో రెండోసారి కూడా లక్ష్మణ్‌నే కొనసాగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పార్టీలో చెప్పుకుంటున్నారు. లక్ష్మణ్ నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా, లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకుని నాలుగు స్థానాల్లో గెలుపొందటం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే ఈ సమయంలో అధ్యక్షుడి ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం మనసులో ఏముందోనన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ వుంది. చూడాలి, తెలంగాణ కమలదళానికి పాత అధ‌్యక్షుడే వుంటారో, లేదంటే కొత్త వ్యక్తితో సరికొత్తగా సమరం ప్రారంభిస్తారో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories