Top
logo

ఆ ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్యే ఇచ్చిన షాకేంటి..?

ఆ ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్యే ఇచ్చిన షాకేంటి..?
X
ఆ ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్యే ఇచ్చిన షాకేంటి..?
Highlights

వాళ్లిద్దరూ ఒకే పార్టీ ఎమ్మెల్యేలు నిన్న మొన్నటి వరకు చెట్టా పట్టాలేసుకుని మరీ తిరిగారు కానీ ఇప్పుడు కథ అడ్డం...

వాళ్లిద్దరూ ఒకే పార్టీ ఎమ్మెల్యేలు నిన్న మొన్నటి వరకు చెట్టా పట్టాలేసుకుని మరీ తిరిగారు కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. ఒకరి పేరు చెబితేనే మరొకరు ఒంటికాలితో లేచే పరిస్ధితి. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న వాళ్లిద్దరి మధ్య ఓ సొసైటీ ఛైర్మన్ పీఠం చిచ్చు పెట్టింది. తన తండ్రిని సొసైటీ ఛైర్మన్ గా చూడాలన్న ఓ ఎమ్మెల్యే కోరికకు మరో ఎమ్మెల్యే గండి కొట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యేకు సొంతూళ్లో షాక్ ఇచ్చే సాహసం, లోకల్ ఎమ్మెల్యే ఎందుకు చేశారు? మూడో ఎమ్మెల్యే మధ్యవర్తిత్వం ఎందుకు ఫలించలేదు...? అధిష్ఠానానికి మొర పెట్టుకున్నా స్పందించక పోవడానికి కారణాలేంటి..?

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు గులాబీ ఎమ్మెల్యేల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ మొదలైందట. నిన్న మొన్నటి వరకు పక్కపక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆ ఇద్దరు, ఇప్పుడు బద్ద శత్రువులుగా మారారట. ఇందుకు కారణం లేకపోలేదని గులాబీ పార్టీలో టాక్ నడుస్తోంది. నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే సుప్రీం. ఇదీ పార్టీ అధినేత చెప్పిన మాట. ఐతే అదే ఎమ్మెల్యే పక్క నియోజకవర్గంలో వేలు పెడితే మాత్రం, జీరో కావడం ఖాయమనేలా, సదరు అర్బన్ ఎమ్మెల్యేకు పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారట. ఇంతలా పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే సహాయ నిరాకరణ చేయడానికి కారణాలేంటని వెతికే పనిలో పడ్డారట సదరు అర్బన్ ఎమ్మెల్యే.

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా స్వగ్రామం మాక్లూరు. అది ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గణేష్ గుప్తా తన తండ్రి కృష్ణమూర్తిని డీసీసీబీ లేదా డీసీఎంఎస్ ఛైర్మన్ చెయ్యాలని పెద్ద స్కెచ్చే వేశారట. ఈ మేరకు తన సొంతూళ్లో తండ్రి కృష్ణమూర్తిని, సొసైటీ ఛైర్మన్ చేయాలని కలలు కన్నారట. అందుకు తగ్గట్టుగానే మాక్లూర్ ఒకటో టీసీ నుంచి డైరెక్టర్‌గా తండ్రి బిగాల కృష్ణమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేశారట సదరు ఎమ్మెల్యే. ఆ సొసైటీ డైరెక్టర్లంతా గులాబీ పార్టీ అభ్యర్థులుగా విజయం సాధించడంతో, మాక్లూర్ సొసైటీ ఛైర్మన్‌గా తన తండ్రి ఎన్నిక లాంఛనమే అనుకున్నారట. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ద్వారా ప్రయత్నాలు కూడా చేశారట. కానీ, తాను తలచిందొకటైతే దైవం మరోలా తలచినట్లు కథ ఇక్కడే అడ్డం తిరిగిందట.

మిత్రునిగా ఉన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకరిస్తారనుకుంటే, ఒక్కసారిగా ఆయన యూటర్న్ తీసుకున్నారట. జీవన్ రెడ్డి ఓకే అంటే అర్బన్ ఎమ్మెల్యే తండ్రి, కృష్ణమూర్తి ఛైర్మన్ అయ్యేవారు. కానీ మాక్లూర్ సొసైటీ ఛైర్మన్ పదవిని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన అనుచరులకు ఇప్పించుకుని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు, ఊహించని షాక్ ఇచ్చారట. అర్బన్ ఎమ్మెల్యేకు ఎంతో స్నేహంగా ఉండే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఝలక్ ఇవ్వడానికి అసలు కారణమేంటో తెలియక, రాజకీయ విశ్లేషకులే తలలు పట్టుకుంటున్నారట.

అర్బన్ ఎమ్మెల్యే తండ్రి కోసం, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సైతం మధ్యవర్తిత్వం వహించారనే ప్రచారం ఉంది. ఎమ్మెల్యే గణేష్ గుప్తా తండ్రిని ఛైర్మన్ చెయ్యాలని ఆర్మూర్ ఎమ్మెల్యేకు నచ్చ చెప్పారట. ఐతే ఆయన మాట కూడా చెల్లుబాటు కాలేదట. తన నియోజకవర్గంలో అర్బన్ ఎమ్మెల్యే ఆధిపత్యం పెరగొద్దనే ఉద్దేశ్యంతో, ఆర్మూర్ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారనే ప్రచారం నడుస్తోంది. పైగా అధిష్ఠానం నుంచి ఎలాంటి ఆదేశాలూ లేకపోవడంతో ఆయన కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారట. ఒక ఇంట్లో రెండు పదవులు వద్దనే సంకేతాలు ఇచ్చేందుకు అధిష్ఠానం సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదనే టాక్ నడుస్తోంది.

సొసైటీ ఎన్నికలు ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పూడ్చలేనంత గ్యాప్ తెచ్చినట్టయ్యింది. తండ్రి కోరిక తీర్చలేక, సదరు ఎమ్మెల్యే బయట గెలిచి ఇంట్లో ఓడినట్లు ఫీలవుతుంటే, మరో ఎమ్మెల్యే మాత్రం తన నియోజకవర్గంలో మరొకరి పెత్తనం లేకుండా చేసి, పైచేయి సాధించానని సన్నిహితుల వద్ద అంటున్నారట. గులాబీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న ఈ వివాదం రానున్న రోజుల్లో ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.Web Titlebigala ganesh gupta vs jeevan reddy in Nizamabad
Next Story