తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు!

తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు!
x
Highlights

ఈనెల 20న తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అలంపూర్‌ నియోజకవర్గంలో నాలుగు పుష్కరఘాట్ల వద్ద ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అలంపూర్‌ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లో అలంకరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు.

తుంగభద్ర పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. గతంలో పుష్కరాలు వైభవంగా నిర్వహించినా.. ఈ సారి కోవిడ్‌ నేపథ్యంలో నిబంధనల ప్రకారం జరపనున్నారు. మరో మూడు రోజులే సమయం ఉండటంతో జోగుళాంబ గద్వాల జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. పుష్కరాల పనులను ముమ్మరం చేసింది. అయితే ఆలస్యంగా పనులు ప్రారంభించటంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఈనెల 20న తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అలంపూర్‌ నియోజకవర్గంలో నాలుగు పుష్కరఘాట్ల వద్ద ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అలంపూర్‌ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లో అలంకరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు. ఆలయాల ప్రాంగణంలో క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అలంపూర్‌లో పుష్కర పనుల సందడి కనిపిస్తోంది. అయితే పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో సమయానికి పూర్తవుతాయా..? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం తుంగభద్ర నదీ తీరాన ఉన్న అలంపూర్, పుల్లూరు, రాజోలి, వేణిసోంపురం ప్రాంతాల్లో నాలుగు పుష్కరఘాట్లు ఏర్పాటు చేసి, నదీ స్నానాలకు అనువుగా తీర్చిదిద్దున్నారు. అయితే పుష్కరాలు సమీపిస్తున్నా రహదారుల మరమ్మత్తు పనులు మందకొడిగా కొనసాగుతుండటం భక్తులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇక నదీ స్నానాలకు కరోనాతో పాటు తుంగభద్ర నదిలో నీరు లేకపోవడం కూడా అడ్డంకిగా మారింది. అలంపూర్‌, వేణిసోంపూర్‌ ఘాట్ల దగ్గర నీరు పుష్కలంగా ఉన్నా.. మిగిలిన చోట్ల నీరు అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ప్రత్యేక నల్లాలు ఏర్పాటు చేస్తున్నారు.

పుష్కరాల ఏర్పాట్ల కోసం అధికారులు మరింత ముందే చర్యలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యేవి కావంటున్నారు స్థానికులు. పుష్కరాలకు నామమాత్రంగా రెండున్నర కోట్లు మంజూరు చేశారని, ఆ నిధులు దేనికి సరిపోవంటున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు నదిలో స్నానం చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారని.. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

ఏపీలో పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదంటూ మండిపడుతున్నారు స్థానికులు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories