హైదరాబాద్‌లో మరో పరువు హత్య.. బేగంబజార్‌లో.. కత్తులతో పొడిచి...

Another Honour Killing Takes Place in Begum Bazar Hyderabad | TS Live News
x

Representational Image

Highlights

Hyderabad: ఏడాదిన్నర క్రితం నీరజ్ పన్వార్, సంజన ప్రేమపెళ్లి...

Hyderabad: హైదరబాద్‌లో మరో పరువు హత్య తీవ్ర కలకలం సృష్టించింది. బేగం బజార్ లో అందరూ చూస్తుండగానే నీరజ్ పన్వార్‌ అనే యువకున్ని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు దుండగులు. ఏడాదిన్నర క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కారణంతోనే నీరజ్ ను యువతి బంధువులు హతమర్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెళ్లడయ్యింది. అయితే ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న మృతుడి కుటుంబ సభ్యులు నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ హత్యను ఖండిస్తూ శనివారం బేగంబజార్ మార్కెట్ బంద్ కు వ్యాపారులు పిలుపునిచ్చారు.

సరూర్ నగర్ లో నాగరాజు హత్య మరువకముందే అదే తరహాలో మరో పరువు హత్య నగరంలో సంచలనం సృష్టించింది. బేగంబజార్‌కు కోల్సివాడికి చెందిన నీరజ్‌ పన్వార్‌ శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన తాతతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. చేపల మార్కెట్‌ సమీపంలో మాటేసిన నలుగురు దుండగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. తాత నిశ్చేష్టుడై చూస్తుండగానే కత్తులతో అతి కిరాతకంగా పొడిచి క్షణాల్లో అక్కడినుంచి పరారయ్యారు. రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతున్న నీరజ్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రేమ వివాహం చేసుకున్న నీరజ్‌పై అతని భార్య తరపు కుటుంబ సభ్యులు కక్ష పెంచుకుని హత్య చేశారని నీరజ్‌ తండ్రి రాజేందర్‌ పన్వార్‌ ఆరోపించారు.

మాల కులానికి చెందిన నీరజ్‌ తన ఇంటికి సమీపంలో నివసించే యాదవ కులానికి చెందిన సంజనను ప్రేమించాడు. వీరి పెళ్లికి సంజన కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్న వీరు పాతబస్తీ శంషీర్‌గంజ్‌లో ఉంటున్నారు. వారికి రెండు నెలల బాబు కూడా ఉన్నాడు. కాగా శుక్రవారం రాత్రి తాత జగదీష్‌ పన్వార్‌తో కలిసి బైక్‌పై వెళ్తున్న నీరజ్‌ను అటకాయించిన దుండగులు కత్తులతో పొడిచి హతమార్చారు. నీరజ్ శరీరంపై 15 నుంచి 20 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే బేగంబజార్‌ రోడ్డుపై చోటు చేసుకున్న ఈ దారుణ హత్యోదంతంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. గోషామహాల్‌ ఏసీపీ సతీష్‌కుమార్, షాహినాయత్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌కుమార్‌ల నేతృత్వంలో పోలీసులు నీరజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇక ప్రేమ వివాహం చేసుకున్నందుకే సంజన కుటుంబీకులు తన కుమారుడిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారని నీరజ్‌ తల్లి తో పాటు అతడి భార్య తాతలు ఆరోపించారు. వారితో నీరజ్ కు ప్రాణహాని ఉందని గతంలో అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రేమ వివాహం చేసుకోవడంతో ఏడాదిన్నరగా కక్ష పెంచుకున్న వారు నీరజ్ ను హత్య చేశారని ఆరోపించారు. నీరజ్ ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ,హోం మంత్రి మహమూద్ అలీలు స్పందించి నిందితులను పట్టుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు.

ఇక మరోవైపు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితులను పట్టుకోవడం కోసం నాలుగు టీమ్స్ ను రంగంలోకి దించాయి. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా రెండు ద్విచక్ర వాహనాలపై ఐదుగురిని గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

మార్కెట్ లోపల జరిగిన హత్య కు నిరసనగా శనివారం బేగం బజార్ మార్కెట్ బంద్ చేస్తామని మార్కెట్ కమిటీ సభ్యులు అంటున్నారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని మృతుడి బంధువులు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories