ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదనలు

ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదనలు
x

ఫ్లైట్ ఫైల్ ఫోటో 

Highlights

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయంటూ భారత...

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయంటూ భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ అధికారుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానాశ్రయ ఏర్పాటుపై జిల్లావాసులకు ఆశలు చిగురిస్తున్నాయి.

దేశానికి స్వాతంత్య్రం రాక ముందే అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు అప్పటి నిజాం ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పడే జిల్లా కేంద్రంలోని 320 ఎకరాలకు పైగా మైదాన భూమిని కూడా సేకరించారు. మరో రెండేళ్లలో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయనగా దేశానికి స్వాతంత్రం రావడం, ఆ ఆర్వాత కొన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడంతో విమానాశ్రయం ముచ్చట మూలనపడింది.

విమానాశ్రయం ఏర్పాటుకోసం ఇప్పటికే ఆదిలాబాద్ శివారులో 369 ఎకరాలు విమానాశ్రయ భూములు ఉన్నాయి. వీటితో పాటు ఎయిర్ స్ట్రిప్ నిర్మాణానికి ఆదిలాబాద్ శివారులోని ఖానాపూర్‌లో 481.16 ఎకరాల పట్టా భూములు, 50 ఎకరాల అసైన్డ్ భూములు, అనుకుంటలో 535.38 ఎకరాల పట్టా భూములు, 34.04 ఎకరాల అసైన్డ్ భూములు, తంతోలిలో 261.27 ఎకరాల పట్టా భూములు, 5.02 ఎకరాల అసైన్డ్ భూములు కేటాయించనున్నారు. మొత్తంగా 1590 ఎకరాల్లో ఎయిర్‌స్ట్రిప్ నిర్మాణం చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనిని ఆనుకుని పక్కనే డొమెస్టిక్ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.

ఈ ప్రాంతంలో విద్యుత్, నీరు, రోడ్లు, భవనాల కోసం 40 కోట్ల మేర అవసరమవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే ఇక్కడ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం నిలిపేశారు. ఎయిర్‌ఫోర్స్ విభాగం అధికారులు కూడా ఇప్పటికే రెండుసార్లు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లాలో విమానాశ్రయం నెలకొల్పితే ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతర్జాతీయస్థాయిలో ఈ మూడు జిల్లాలకు గుర్తింపు వస్తుంది. రాకపోకలు పెరిగి వ్యాపారంతో పాటు ఉన్నతాధికారులు, జాతీయ నాయకుల తాకిడి పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories