Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పోలీసుల కాల్పులు

Agneepath Scheme Protests in Secunderabad Railway Station
x

Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పోలీసుల కాల్పులు

Highlights

Secunderabad: పలువురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

Agnipath Recruitment Scheme: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.అగ్నిపథ్ ఆందోళనలు హైదరాబాద్ ను తాకాయి. భారీ సంఖ్యలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు తరలివచ్చిన యువకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్ ఆపివేయాలని డిమాండ్ చేస్తూ రైల్వేస్టేషన్ లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు.. పట్టాల మధ్యలో పార్సల్ సమాన్లు వేసి నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన యువకులు రైళ్లపై రాళ్లు రువ్వారు. భయాందోళనతో ప్రయాణీకులు రైళ్లను వదిలి పరుగులు పెట్టారు. వేలా సంఖ్యలో ఆందోళనకారులు తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో పోలీసులకు, యువకులకు మధ్య తోపులాటతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో యువకులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు తరలివచ్చారు. మొదట రైల్వేస్టేషన్ బయట ఆగిఉన్న ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం, రైల్వేస్టేషన్ లోకి దూసుకెళ్లారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. ఆర్మీ అభ్యర్థుల ఆకస్మిక దాడితో పరిస్థితి అదుపుతప్పింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే రైల్వేస్టేషన్ అగ్నిగుండంలా మారింది. రైళ్లు, స్టాళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు పట్టాలపై టైర్లను తగలపెట్టారు. అజంతా ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టడంతో పలు బోగీలు ధ్వంసం అయ్యాయి.

గత రెండు గంటలుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసకాండ కొనసాగుతోంది. ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. లాఠీచార్జ్ చేస్తున్న పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దీంతో రైల్వే అధికారులు అలెర్ట్ అయ్యారు. ఆందోళనకారులు వెంటనే రైల్వేస్టేషన్ ను ఖాళీ చేయాలని కోరారు. విధ్వంసం ఆపకపోతే కాల్పులు జరుపుతామని వార్నింగ్ ఇచ్చారు. ముందస్తుగా టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను తెప్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories