Top
logo

అప్పు చేసి తిప్పలు పడుతున్న ఎమ్మెల్యేలు ఎవరు?

అప్పు చేసి తిప్పలు పడుతున్న ఎమ్మెల్యేలు ఎవరు?
X
Highlights

అది ఎన్నికల సంగ్రామం ఆ యుద్దంలో విజయం వరిస్తే చాలు, అమాత్య పదవితో అందలం ఐదేళ్లపాటు నియోజకవర్గం రారాజు. అలాంటి ...

అది ఎన్నికల సంగ్రామం ఆ యుద్దంలో విజయం వరిస్తే చాలు, అమాత్య పదవితో అందలం ఐదేళ్లపాటు నియోజకవర్గం రారాజు. అలాంటి పదవే కలగా, నాయకులు సర్వశక్తులు ఓడ్డిపోరాటం చేశారు. ఓట్ల కోసం నీళ్లలా డబ్బులు ఖర్చు చేశారు. ఆ ఖర్చే ఇప్పుడు కొండలా పెరిగి, గుదిబండలా తయారైందట నేతలకు. తనఖా పెట్టిన ఆస్తులు వేలం వేస్తామంటూ బ్యాంకులు నోటీసులివ్వడంతో, ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదట ఆదిలాబాద్‌ జిల్లాలోని కొందరు నేతలకు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది సమీపిస్తున్నా, ఎన్నికల సంక్షోభం నుంచి నాయకులు మాత్రం బయటపడటం లేదట. ఎలక్షన్స్‌లో టిఆర్ఎస్‌, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడ్డారు. కొందరు జీవితకాలంలో ఎమ్మెల్యేగా గెలవడం చిరకాల వాంచగా పెట్టుకుంటే, మరికొందరు ఎమ్మెల్యే అయితే చాలు మంత్రి పదవి అదే వస్తుందని భావించారట. దానిలో భాగంగానే ఖర్చుకు వెనుకాడలేదట. ఆయా నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ ఆర్థిక వనరులు సమాకూర్చుకుందట. అది చాలదన్నట్లుగా వ్యాపారంలో వచ్చిన డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారట. గెలుపు ముఖ్యమని, ఖర్చుకు వెనకాడకుండా మంచి నీళ్లప్రాయంలా డబ్బులు వెదజల్లారట. అదే ఇప్పుడు, వారికిప్పుడు గుదిబండగా మారిందట.

అయితే గులాబీ పార్టీ అభ్యర్థిని ఆరు నూరైనా ఓడించాలని హస్తం అభ్యర్థి కంకణం కట్టుకున్నారట. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే నియోజకవర్గంలో సదరు అభ్యర్థి హడావుడి చేశారట. పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, తామే మంత్రులమని ప్రచారం చేసుకున్నారట. అందులో భాగంగా నియోజకవర్గంలో భారీగా డబ్బులు ఖర్చు చేశారట. అయినప్పటికీ ఆ అభ్యర్థికి ఓటమి తప్పలేదు. ఆస్తులను అమ్మి ‌ఎన్నికల్లో పోటీ చేసినా, ఫలితం దక్కలేదట. చివరకు వ్యాపారాలూ నిలుపుకోలేకపోతున్నారట.

ఎన్నికల్లో ఖర్చు కోసం భారీగా అప్పులు చేశారట. ఆస్తులు బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందారట. అప్పుల వల్ల వ్యాపారాలు నష్టాల బాట పట్టాయట. దాంతో బ్యాంకు రుణాలు కట్టలేని స్థితికి చేరుకున్నారట సదరు నేత. రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఆస్తుల వేలానికి సిద్దమవుతున్నాయట. దీంతో సదరు నేత లబోదిబోమంటున్నాడట.

ఓడిన నాయకుని పరిస్థితి ఇలా ఉంటే, గెలిచిన లీడర్ పరిస్థితి కూడా అలానే వుందట. గెలిచినా కూడా అప్పలు కట్టలేకపోతున్నానని ఆవేదన చెందుతున్నారట. ఒకవైపు అప్పు తీర్చాలంటూ బ్యాంకుల ఒత్తిడి లేదంటే, ఆస్తులు వేలం వేస్తామన్న నోటీసుల నేపథ్యంలో ఏం చెయ్యాలో పాలుపోక సతమతమవుతున్నాడట విజేత.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలుంటే ఐదు జనరల్ స్థానాలు ఉన్నాయి. వీటిలో కోట్లు ఖర్చు చేసిన‌ విజయం సాధించలేకపోయామని బాధపడుతున్నారట. ఇక గెలిచిన వారి పరిస్థితి మరీ విచిత్రంగా ఉందట. పనులు జరిగితే ఏడాదిలో అన్నీ సెట్ అవుతాయని భావించారట. ఏదో ఒక రూపంలో డబ్బులేమీ రాకపోవడంతో కార్యకర్తలు కూడా దగ్గరకు రావడం లేదట. కనీసం లక్ష రుపాయల పని కూడా చేయలేకపోతున్నామని‌ ఆందోళన చెందుతున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. దాంతో పరువు దక్కినా ఫలితంలేదని మధనపడున్నారట. పైగా నిధల కొరత వల్ల చేసిన పనులకు చెల్లింపులు కావడం లేదట. ఇది ‌మరింత కుంగదీస్తోందట. అందుకే గతంలో దూకుడుగా వ్యవహరించిన‌ ఎమ్మెల్యేలు, అంతగా అన్ని కార్యక్రమాల్లో ఉత్సాహం‌ చూపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లడం చివరికి కొంతమంది ఎమ్మల్యేలకు మొదటికే మోసంలా మారింది. ఎమ్మెల్యే అయితే ఎలాగైనా సంపాదించుకోవచ్చని లెక్కలేసే నేతలకు, ఇప్పుడు బ్యాంకుల నోటీసులతో దిమ్మతిరుగుతోంది. డబ్బు, మద్యం జోలికి పోకుండా, నిజాయితీగా ఓట్లు అడిగితే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా అని, రాజకీయ పండితులు అంటున్నారు. ఎవరి తీసుకున్న గోతిలో వారే పడటం అంటే ఇదేనేమో అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.


Web TitleAdilabad leaders scared of bank notices: who are they?
Next Story