About Telangana new secretariat: తెలంగాణా కొత్త సచివాలయం ఏర్పాటు వెనుక కథ ఇదే!

About Telangana new secretariat: తెలంగాణా కొత్త సచివాలయం ఏర్పాటు వెనుక కథ ఇదే!
x
New Design of Telangana Secretariat
Highlights

About Telangana new secretariat: రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో వేగంగా మార్పులు వచ్చాయి. హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్ ,తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు తెలంగాణ సచివాలయం ఒక ఎత్తు..

రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో వేగంగా మార్పులు వచ్చాయి. హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్ ,తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు తెలంగాణ సచివాలయం ఒక ఎత్తు.. ఇప్పుడున్న నిజాం కాలంనాటి పాత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. దీనిపై పలుమార్లు ప్రతిపక్షాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే చట్టసభల్లో తీసుకునే నిర్ణయాలలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పడంతో సచివాలయం కూల్చివేతకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్త సచివాలయ భవన నమూనాను కూడా ముఖ్యమంత్రి కార్యాలయం రిలీజ్ చేసింది.

నూతన సచివాలయం :

కొత్త భవనం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.500 కోట్ల మేరకు నిధులు ఖర్చు చేయనుంది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయని పేర్కొంది. కనీవినీ ఎరుగని రీతిలో సచివాలయ నిర్మాణం ఉండేలా ముఖ్యమంత్రి కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయానికి మొత్తం పది నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి.. చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్నీ సంస్థ రూపొందించిన నమూనాను ఒకే చేశారు. 27 ఎకరాలున్న స్థలంలో 20 శాతాన్ని మాత్రమే భవన నిర్మాణానికి ఉపయోగించి, మిగిలిన స్థలాన్ని ల్యాండ్ స్కేప్‌లు, రాష్ట్ర అధికార పుష్షమైన తంగేడు పువ్వు ఆకారంలో ఫౌంటెయిన్లు నిర్మించనున్నారు. అంతేకాదు ఒకేసారి 800 కార్లు పార్కు చేసుకునేలా, ఒకేసారి రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా డిజైన్ చేశారు. ఇక ఇందులో మొత్తం ఆరు అంతస్తులుంటాయి. వీటికి ఏ విధమైన వాస్తు దోషం లేకుండా నిపుణులను సంప్రదించి మరీ ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ప్రభుత్వం వెల్లడించిన డిజైన్ ప్రకారం 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారంలో కొత్త సచివాలయం రూపుదిద్దుకోనుంది.

పాత సచివాలయం చరిత్ర :

132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పాత సచివాలయాన్ని 1888లో నిజాం నవాబులు సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో నిర్మించారు. హుస్సేన్ సాగర్ కనిపించేలా వ్యూ ఉన్న చిన్న ప్యాలెస్ ఉండేది. దానిని సైఫా బాద్ ప్యాలెస్ అని పిలిచేవారు.1956 లో ఆంధ్రా, హైదరాబాద్ రాష్ట్రాలు కలిసిపోయాయి. తర్వాత సైఫాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ సచివాలయంగా ఇది మారిపోయింది.ఇది మొత్తం 25 ఎకరాల ప్రాంగణంలో ఉంది. 10 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో పది బ్లాకుల్లో ఉన్న ఈ భవన సముదాయంలో అనేక మంది ముఖ్యమంత్రులు పాలన అందించారు. ఈ భవన సముదాయంలో అతి పురాతనమైన జీ బ్లాకు ఆరవ నిజాం కాలంలో నిర్మితమైంది. 2003లో డీ బ్లాకు, 2012లో నార్త్, సౌత్ బ్లాకుల్ని ఆయా ప్రభుత్వాలు నిర్మించాయి. ఈ సచివాలయం ఇకనుంచి కాలగర్భంలో కలిసిపోనుంది.

ఆంధ్రప్రదేశ్ భవనాల అప్పగింత :

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం సచివాలయంలోని భవనాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కేటాయించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిపాలనా వ్యవహారాలు క్రమంగా అమరావతికి తరలిపోయాయి. ఆ భవనాలు మాత్రం కొన్నాళ్లు ఏపీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చలు జరపడంతో తమ అధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు ఇచ్చేసింది జగన్ ప్రభుత్వం.

సచివాలయం ఎప్పుడు తరలించారు? :

నిజానికి తెలంగాణ సచివాలయం 2019 ఆగస్టులోనే తరలించినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగులను అప్పుడే బీఆర్‌కే భవన్‌కు తరలించారు. వారు ఆగస్టు 9 నుంచి కొత్త ప్రాంగణంలో కార్యకలాపాలు మొదలుపెట్టారు.

పాత సచివాలయంలో లోపాలు :

పాత సచివాలయం నిర్మించి 132 సంవత్సరాలు కావడంతో లోపల కొన్ని భవనాలు మరీ పాతబడిపోయాయి. అంతేకాదు ప్రభుత్వ ఆసరార్దం వీలైనన్ని సమావేశ హాళ్లు ఉద్యోగులు, ఇతర సందర్శకుల కోసం క్యాంటీన్ల వంటి సదుపాయాలు లేవు.. ఒకవేళ నిర్మించుకుందామంటే స్థలం లేదు. దానికితోడు అధికారులు, సిబ్బంది ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే కష్టంగా ఉందని కొందరు ఉద్యోగులే చెబుతుంటారు. అంతేకాదు అగ్ని ప్రమాదం జరిగితే జనం బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోలేని దుస్థితిలో పాత సచివాలయం ఉంది. అయితే వీటన్నింటిని పక్కనబెట్టి కేవలం వాస్తు కోసమే కెసిఆర్ సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories