Warangal: బిచ్చగాడు కథకు ఏమాత్రం తీసిపోని ఘటన

Warangal: భర్త ప్రాణాల కోసం వివాహిత బిక్షాటన * తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టిన దేవేందర్

Arun Chilukuri
Updated on: 12 Sept 2021 9:00 PM IST
A Story in Warangal Same as Bicchagadu Movie
X

బిచ్చగాడు సినిమా (ఫోటో ది హన్స్ ఇండియా )

Warangal: అతడో కోటీశ్వరుడు అయినా, కన్నతల్లికోసం నిరుపేదగా మారిపోతాడు తల్లిని బతికించుకునేందుకు ఏకంగా బిక్షగాడి అవతారం ఎత్తుతాడు. ఆ సమయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా తాను చేపట్టిన దీక్ష మాత్రం వీడడు.! అతడు చేసిన దీక్ష ఫలమో లేక దేవుడి దయో మొత్తానికి అతడి తల్లి ప్రాణాలతో లేచిరావడంతో ఆ కథకు శుభం కార్డు పడుతుంది. ఇదంతా బిచ్చగాడు సినిమా గురించే అని ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అయితే, ఇప్పుడు చెబుతున్నది కూడా బిచ్చగాడు సినిమాకు ఏమాత్రం తీసిపోని కథ కాదు, కాదు నిజం. మృత్యువు అంచులవరకూ వెళ్లిన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ వివాహిత చేస్తున్న పోరాటం.

జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త ఊహించని విధంగా మంచాన పడ్డాడు. దీంతో ఆ వివాహిత బిచ్చగాడు సినిమాలో లానే బిక్షాటన వ్రతం చేస్తోంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం తిరుమల గండిలో జరిగింది. కొన్నేళ్ల క్రితం కొత్తగూడెం మండల కేంద్రంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న దేవేందర్‌తో వినోదకు వివాహం జరిగింది. ఆనాటి నుంచి సజావుగా సాగుతున్న వీరి దాంపత్య జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఉన్నట్లుండి భర్త దేవేందర్‌ ఆరోగ్యం క్షిణించింది. వైద్యులు సైతం చేసేది లేదని చెప్పడంతో తాను నమ్ముకున్న వేములవాడ రాజన్నే దిక్కని భావించింది.

వేములవాడ రాజన్నకు, బద్ది పోచమ్మలకు 101 ఇళ్లలో భిక్షాటన చేసి మొక్కులు చెల్లిస్తానని వినోద మొక్కుకుంది. దీంతో గ్రామంలో గడప గడపకూ తిరుగుతూ బిక్షాటన చేస్తోంది. ఇప్పటి వరకూ సంతోషంగా సాగిపోయిన వీరి జీవితాన్ని దగ్గరుండి చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.అయితే, వినోద మాత్రం బిక్షాటన ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే తన భర్త ఆరోగ్యం కుదుటపడుతోందని చెబుతోంది. జీవిత భాగస్వామికోసం ఆమె పడుతున్న వేదన పలువురిని కన్నీళ్లు పెట్టిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story