అదే భూపాలపల్లిలో కోల్డ్‌వార్‌కు దారి తీస్తోందా?

అదే భూపాలపల్లిలో కోల్డ్‌వార్‌కు దారి తీస్తోందా?
x
Highlights

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులు. ఎలక్షన్స్‌ వేళ మాటల యుద్ధం చేశారు. పోరు తరువాత ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో. ఒకరు బీసీ నేత మరొకరు ఓసి నాయకుడు. ఆ...

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులు. ఎలక్షన్స్‌ వేళ మాటల యుద్ధం చేశారు. పోరు తరువాత ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో. ఒకరు బీసీ నేత మరొకరు ఓసి నాయకుడు. ఆ జిల్లాలో బీసీ నేతగా ఎదిగి ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌తో కలిసి నడిచిన నేత ఒకరు. కాంగ్రెస్‌లో పుట్టి, పెరిగి, ఎదిగిన నేత మరొకరు. గత ఎన్నికల్లోనూ అదే పార్టీ నుంచి గెలిచి, అధికార పార్టీలో చేరారు. ఇక్కడి వరకు ఒకే. అక్కడే మొదలైంది అసలు యుద్ధం. బద్ద శత్రువులు-ఒక్కసారిగా మిత్రులు కావాలంటే అంత ఈజీనా? అందుకే లోలోపల సమరం, నివురుగప్పిన నిప్పులా, భగ్గుమని మండేందుకు సిద్దంగా వుంది వారి రాజకీయం. ఇంతకీ ఎవరా నేతలు?

సిరులు కురిపించే సింగరేణి గడ్డ భూపాలపల్లి. గ్రామం నుంచి అనతికాలంలోనే నియోజకవర్గంగా, మున్సిపాలిటీగా, జిల్లా కేంద్రంగా ఏర్పడింది. అభివృద్ధి జరుగుతున్న క్రమంగానే రాజకీయ సమీకరణాలు కూడా అంతే వేగంగా మారిపోతున్నాయి అక్కడ. అధికార, విపక్ష నేతలు ఇప్పుడు ఒకే చోట కలిశారు. ప్రత్యర్థులు ఒకే గొడుగు కిందకు చేరారు. కానీ కిందిస్థాయి క్యాడర్ మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోందట. మాజీ స్పీకర్ మధుసూదనాచారితో ఉన్న పాత కార్యకర్తలను, ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పట్టించుకోవడం లేదని అధిష్టానం వద్ద మొర పెట్టుకున్నారట. దీంతో అధిష్టానం భూపాలపల్లిలో ఏం జరుగుతోందని నజర్ పెట్టిందట. ఉద్యమ సమయం నుంచి పార్టీకి సేవలు చేస్తున్న వారిని గండ్ర విస్మరిస్తున్నారన్న అంచనాకు వచ్చిందట. అయినా సంయమనంతో వుండాలని చెప్పిందట. మధుసూధానాచారి, గండ్ర కోల్డ్‌వార్‌‌ అదుపు తప్పుతోందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు మధుసూదనాచారి. అయితే, మూట ముల్లే సర్దుకుని కారెక్కేశారు గండ్ర. దీంతో గెలిచిన, ఓడిన ఇద్దరు నేతలూ ఒకే పార్టీలో. ఈ పరిణామాలు చారి వర్గానికి ఏమాత్రం రుచించలేదు. అయినా చారి గౌరవానికి తగ్గట్టుగా పదవి ఇస్తానని కేసీఆర్ హామినివ్వడంతో ఓపికపట్టారు. అయితే, నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ కార్యకర్తల పట్ల గండ్ర వర్గం వివక్ష చూపిస్తోందని రగిలిపోతున్నారట మధుసూదనాచారి. నియోజకవర్గంలో పట్టు కోసం ఒక రకంగా ఇరువురి నడుమ కోల్డ్‌వార్‌ నడుస్తోంది.

భూపాలపల్లి నియోజకవర్గం ఇప్పుడు జిల్లా కేంద్రమైంది. అక్కడికి నిత్యం ఏదో ఒక పని మీద పార్టీ కార్యకర్తలు వెళుతూ ఉంటారు. వారికి కావాల్సిన పనులు చెయ్యాలని అడుగుదామంటే, ఎమ్మెల్యే గండ్ర పట్టించుకోవడం లేదని కార్యకర్తల ఆవేదన అట. పాత, కొత్త కార్యకర్తలను ఎమ్మెల్యే కలుపుకపోవడంలేదని ఆగ్రహంతో రగిలిపోతున్నారట. అదీగాక తన సామాజిక వర్గానికే అన్ని పనులూ చేస్తున్నారని, గండ్రపై రుసరులాడుతోంది మాజీ స్పీకర్ వర్గం. అయినా తాను ఏమీ చెయ్యలేనని నిస్సహాయత వ్యక్తం చేశారట చారి. దీంతో కార్యకర్తలు, తమ ఆవేదనను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో మొరపెట్టుకున్నారట. మాజీ స్పీకర్ మధుసూదనాచారి సీఎం కేసీఆర్‌కు ఆప్తుడు. కానీ టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో చేరిన గండ్ర దంపతులు, కేటీఆర్ ఆశీస్సులు తమకున్నాయని పాత కార్యకర్తల వద్ద అంటుడటంతో, వారికి ఏమీ పాలుపోవడం లేదట. దీంతో మాజీ స్పీకర్ వర్గం కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.

తన భార్య జ్యోతికి వరంగల్ రూరల్ జిల్లా జెడ్పి చైర్మన్ పదవి కోసమే, గండ్ర టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారన్న ప్రచారం వుంది. గండ్రకు వరంగల్ జిల్లాలో పెట్రోల్ బంకుల బిజినెస్ వుంది. దానితో పాటు కాంట్రాక్టు వర్కులు, షోరూమ్స్ ఉన్నాయి. వాటిని కాపాడుకోవడంతో పాటు, తన భార్యకు పదవి వస్తుందన్న అంచనాతోనే గండ్ర కారెక్కారని, పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోసం కాదని మాజీ స్పీకర్ వర్గం కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. రెండు వర్గాల వివాదం అధిష్టానం దృష్టికి వెళ్లిందని, కార్యకర్తలకు మేలు జరిగే నిర్ణయం వస్తుందని చారి వర్గం ఆశిస్తోందట. ముందే చెప్పినట్టు, భూపాలపల్లి టీఆర్ఎస్‌, మాజీ స్పీకర్ మధుసూదనాచారి - ఎమ్మెల్యే గండ్ర వర్గంగా చీలిపోయింది. మాజీ స్పీకర్ వర్గం సీఎం కేసీఆర్‌కు మొరపెట్టుకుంటే, కేటీఆర్ వద్ద కూర్చుని తన చేతికి మట్టి అంటకుండా చూసుకుంటున్నారట గండ్ర. అయితే, ఇద్దర్నీ మరోసారి కూర్చోబెట్టి, వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని హైకమాండ్‌ కూడా ఆలోచిస్తోందట. చూడాలి, ఒకే గూటికి చేరిన ప్రత్యర్థుల మధ్య సయోధ్య కుదురుతుందో, సమరమే సాగుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories