కారు జోరుకు ఆరు కారణాలు.. ఇంతకీ టీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఆరు మెట్లేంటి?

కారు జోరుకు ఆరు కారణాలు.. ఇంతకీ టీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఆరు మెట్లేంటి?
x
కారు జోరుకు ఆరు కారణాలు.. ఇంతకీ టీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఆరు మెట్లేంటి?
Highlights

అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక ఎన్నికలు, హుజూర్ నగర్ ఉప ఎన్నిక. ఇప్పడు మున్సిపల్ ఎన్నికలు. ఎలక్షన్‌ రావడమే తరువాయి, గులాబీ దండు సంబరాలకు సర్వం సిద్దం....

అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక ఎన్నికలు, హుజూర్ నగర్ ఉప ఎన్నిక. ఇప్పడు మున్సిపల్ ఎన్నికలు. ఎలక్షన్‌ రావడమే తరువాయి, గులాబీ దండు సంబరాలకు సర్వం సిద్దం. హోరాహోరి తప్పదని భావించిన మున్సిపల్ ఎన్నికల్లోనూ, కారుకు తిరుగేలేకుండాపోయింది. ఇంతకీ టీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఆరు మెట్లేంటి?

కారు జోరుకు ఆరు కారణాలు

ఎన్నిక ఏదైనా విజయం తమదే అన్నట్టు టిఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు సాధించి సత్తా చాటింది. రాష్ట్రంలో రెండోసారి అధికారాన్ని చేపట్టి తమకు తామే సాటి, అని నిరూపించింది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది. అన్ని పంచాయతీలు, పరిషత్‌లలో గులాబీ జెండా ఎగురవేసింది. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటి, తనకు పోటీనేలేదని నిరూపించుకుంది టీఆర్ఎస్‌. అయితే పురపోరులోనూ ఈ రేంజ్‌లో కారు జోరుకు ఆరు కారణాలున్నాయి.

1. పైన కేసీఆర్ కింద కేటీఆర్

టీఆర్‌ఎస్‌ అంటే కేసీఆర్, కేటీఆరే. టీఆర్‌ఎస్‌ అధినేతగా, ప్రభుత్వాధినేతగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దుమ్మరేపుతుంటే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, రాబోయే కాలంలో కాబోయే రథసారథిగా కల్వకుంట్ల తారక రామారావు చక్రంతిప్పుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, పరిషత్‌, పంచాయతీ, హుజూర్‌ నగర్‌‌ ఎలక్షన్స్‌లో వరుసగా విజయాలు సాధిస్తున్నా, మున్సిపోల్స్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లారు కేసీఆర్, కేటీఆర్. ప్రగతి భవన్‌ నుంచి ఎన్నికలు, అభ్యర్థులు, ప్రచార సరళిని కేసీఆర్‌ పర్యవేక్షిస్తుంటే, క్రేత్రస్థాయిలో కేటీఆర్‌ పార్టీ విజయానికి బాటలేశారు. పురపోరులో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందే, కేటీఆర్‌ నాయకత్వంలో దుమ్మురేపాల్సిందేనని కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాలు, గ్రౌండ్‌ లెవల్లో తారకమంత్రంలా పని చేశాయి. ఎప్పటిప్పడు పార్టీ నేతలతో సమావేశమవుతూ, సోషల్‌ మీడియా విభాగానికి సలహాలు, సూచనలు ఇస్తూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు కేటీఆర్. సంక్రాంతి పండగ సంబరంలోనూ గులాబీ ముగ్గులు, కారు గుర్తు పతంగులను ఎగురవేయాలని, పార్టీలో కొత్త జోష్‌ నింపారు. పట్టణ పోరులో తనకు ఎదురులేదని నిరూపించుకున్నారు కేటీఆర్.

2. అధికారం అదనపు బలం

సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి తిరుగుండదు. తెలంగాణ మున్సిపోల్స్‌లోనూ టీఆర్ఎస్‌కు అదే కలిసిసొచ్చింది. పవర్‌లో వున్న పార్టీనే గల్లీలోనూ అధికారంలోకి వస్తే, పురవీధుల రూపురేఖలు మారతాయని భావించారు జనం. అందుకే గులాబీ దండుకు వీరతిలకం దిద్దారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అందుతుండటంతో, మరిన్ని తమకు దక్కుతాయని భావించిన జనం, కారుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అధికారంలో వుండటం, టీఆర్ఎస్‌కు అదనపు బలం.

3. చావోరేవోగా పోరాడిన మంత్రులు, ఎమ్మెల్యేలు

ఈ మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు టెన్షన్‌ పడినంతగా ఎవరూ పడలేదేమో. ముఖ్యంగా మినిస్టర్లు. ఫలితాలు కాస్త తేడా వచ్చినా కేబినెట్‌ పదవులకు ఎసరేనని కేసీఆర్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తమ జిల్లాల పరిధిలో కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో విజయం సాధించాల్సిందేనని, లేదంటే పదవులు ఊడి ఇంట్లో కూర్చోక తప్పదని వార్నింగ్‌ ఇచ్చారు గులాబీ బాస్. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు తమతమ జిల్లాలు, నియోజకవర్గాల్లో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. డూ ఆర్‌ డైగా ప్రచారం చేశారు. రెబెల్స్‌ పోటెత్తినా, వారిని నయానోభయానో బుజ్జగించి దారిలోకి తెచ్చారు. కేటీఆర్ చెప్పినట్టు ప్రతి ఇంటికీ కనీసం మూడు, నాలుగుసార్లు తిరిగి అభ్యర్థుల తరపున ఓట్లడిగారు. సంక్రాంతి టైంలోనూ ఊరూవాడా ప్రచారం చేశారు. మంత్రులు చావోరేవోగా పోరాడారు కాబట్టే, పురపోరులో గులాబీ ఈ రేంజ్‌లో గుబాళించింది.

4. నేటి మున్సిపోల్స్‌కు నిన్నటి స్థానిక జోష్

మున్సిపల్ ఎన్నికల ముందు జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్‌, పంచాయతీ ఎన్నికల్లోనూ దూసుకుపోయింది కారు పార్టీ. ఇప్పుడదే జోష్‌, మున్సిపోల్స్‌లోనూ కంటిన్యూ అయ్యింది.

5. గ్రౌండ్‌లెవల్‌లో బలమైన గులాబీ దండు

2014 ఎన్నికల వరకూ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్‌కు పెద్దగా బలం లేదు. కానీ ఆ తర్వాత గల్లీగల్లీకి చొచ్చుకుపోయింది కారు. ఒకవైపు కార్యకర్తలకు వెన్నుతట్టి ప్రోత్సాహం, మరోవైపు వలసలతో పార్టీ పటిష్టంగా తయారైంది. పట్టణ వీధుల్లో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఇప్పుడు మున్సిపోల్స్‌ అదే ప్రతిఫలించింది. కేటీఆర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన తర్వాత, పార్టీ మరింత పటిష్టంగా తయారైంది. పార్టీలో చక్కని సమన్వయం, ఆర్థిక అండదండలు విజయానికి బాటలేశాయి.

6. ఎంఐఎంతో చెలిమి ప్రతిపక్షాల బలహీనత

తెలంగాణలో బలమైన పక్షం టీఆర్ఎస్. అంతే బలహీనంగా వున్నాయి విపక్షాలు. ఏ దశలోనూ కారుకు బ్రేకులెయ్యలేకపోయాయి. గులాబీ దండుకు విపక్షాల బలహీనతే అదనపు బలం. అడుగడుగునా వారి లోపాలే, టీఆర్‌ఎస్‌కు వరాలు. కాంగ్రెస్‌, బీజేపీలు రెండు అడుగులు ముందుకేసే టైంలోనే, టీఆర్ఎస్‌ పది అడుగుల ముందుంటుంది. కారు స్పీడును ఏమాత్రం అందుకోలేపాయాయి విపక్షాలు. అటు ఎంఐఎం కూడా టీఆర్ఎస్‌కు అదనపు బలమైంది. నేరుగా పొత్తులేకపోయినా ఫ్రెండ్లీగా పోటీ చేశాయి. ఎంఐఎంకు బలమున్న చోట టీఆర్ఎస్‌ సహకరిస్తే, టీఆర్ఎస్‌ బలంగా వున్న ఎంఐఎం హెల్ప్ చేసింది. మైనార్టీ ఓట్లు దాదాపు ఈ రెండు పార్టీల మధ్యే తిరిగాయి. అందుకే ఈ రేంజ్‌లో మున్సిపల్‌ స్థానాలు వచ్చాయి గులాబీకి. అనూహ్యంగా చాలా చోట్ల పోటీనిచ్చింది ఎంఐఎం.

ఇవీ గులాబీ విజయప్రస్థానంలో ఆరు మెట్లు. పైన కేసీఆర్, కింద కేటీఆర్, అధికారం అదనపు బలం, మంత్రులు, ఎమ్మెల్యేల చావోరేవో, మొన్నటి స్థానిక ఎన్నికలు నేటి మున్సిపోల్స్‌కు జోష్‌నివ్వడం, క్షేత్రస్థాయిలో పార్టీకి పటిష్ట యంత్రాంగం వుండటం, ఎంఐఎంతో చెలిమి, ప్రతిపక్షాల బలహీనత, గులాబీ విజయఢంకాకి కారణాలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories