SIM Card : సిమ్ కార్డుకు ఒక మూల కట్ ఎందుకు ఉంటుంది? డిజైన్ వెనుక దాగున్న అసలు రహస్యం ఇదే

SIM Card : సిమ్ కార్డుకు ఒక మూల కట్ ఎందుకు ఉంటుంది? డిజైన్ వెనుక దాగున్న అసలు రహస్యం ఇదే
x
Highlights

సిమ్ కార్డుకు ఒక మూల కట్ ఎందుకు ఉంటుంది? డిజైన్ వెనుక దాగున్న అసలు రహస్యం ఇదే

SIM Card : మనం వాడుతున్న ప్రతి సిమ్ కార్డుకు ఒక మూల కట్ చేసి ఉండటం గమనించే ఉంటారు. ఇది కేవలం స్టైల్ కోసం చేసిన డిజైన్ అని చాలా మంది అనుకుంటారు. కానీ, దీని వెనుక ఒక బలమైన సాంకేతిక కారణం ఉంది. ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్లినా, ఏ కంపెనీ సిమ్ కొన్నా.. ఆ మూల మాత్రం కచ్చితంగా కట్ అయ్యే ఉంటుంది. మీ ఫోన్ భద్రతకు, సిమ్ కార్డు పనితీరుకు ఈ చిన్న కట్ ఎంతటి కీలకమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సిమ్ కార్డు చరిత్రను గమనిస్తే.. 1990వ దశకంలో ఇవి దాదాపు ఒక ఏటీఎం కార్డు సైజులో ఉండేవి. కాలక్రమేణా మొబైల్ ఫోన్లు చిన్నవిగా మారుతున్న కొద్దీ సిమ్ కార్డుల పరిమాణం కూడా మినీ, మైక్రో, నానో సిమ్ రూపంలోకి మారిపోయింది. అయితే సిమ్ ఏ పరిమాణంలో ఉన్నప్పటికీ దాని ఒక మూల కట్ చేసి ఉంచాలనే నియమాన్ని అంతర్జాతీయ టెలికాం ప్రమాణాల సంస్థ ఖరారు చేసింది. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం యూజర్ ఫ్రెండ్లీ టెక్నాలజీని అందించడం.

నిజానికి సిమ్ కార్డు మధ్యలో ఉండే గోల్డెన్ చిప్ చాలా సున్నితమైనది. ఇది ఫోన్‌లోని సిమ్ రీడర్‌తో కచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. ఒకవేళ సిమ్ కార్డుకు మూల కటింగ్ లేకపోతే, దానిని ఏ వైపు నుంచి ఫోన్‌లో పెట్టాలో వినియోగదారులకు అర్థం కాదు. పొరపాటున సిమ్ కార్డును ఉల్టాగా (తప్పు దిశలో) పెడితే, ఫోన్‌లోని సిమ్ స్లాట్ పిన్నులు విరిగిపోయే ప్రమాదం ఉంది లేదా చిప్ దెబ్బతినవచ్చు. ఆ కట్ ఉన్న మూల ఒక గైడ్ లాగా పనిచేస్తుంది, దీనివల్ల ఎవరైనా సరే సిమ్ కార్డును కచ్చితమైన దిశలోనే ఫోన్‌లో అమర్చగలరు.

మొబైల్ తయారీ కంపెనీలకు కూడా ఈ డిజైన్ ఎంతో సహాయపడుతుంది. ఫోన్‌లోని సిమ్ ట్రే, స్లాట్‌లను ఈ కట్ ఆధారంగానే రూపొందిస్తారు. దీనివల్ల ఫోన్ అసెంబ్లింగ్ సమయంలో తప్పులు జరగవు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు ఒకే రకమైన సిమ్ డిజైన్‌ను ఫాలో అవుతున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ మరింత ముందుకు వెళ్లి ఈ-సిమ్ రూపంలోకి మారుతోంది. ఐఫోన్ వంటి ప్రీమియం ఫోన్లలో ఇప్పటికే భౌతికమైన సిమ్ స్లాట్లను తొలగిస్తున్నారు. డిజిటల్ సిమ్ వాడకం పెరిగితే, భవిష్యత్తులో ఈ కట్ చేసిన సిమ్ కార్డులు కేవలం చరిత్రలో మాత్రమే మిగిలిపోవచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ చిన్న కట్ మన ఫోన్లను పెద్ద నష్టం నుంచి కాపాడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories