చెదిరిపోతున్న టెక్కీల కలలు.. భారీగా తొలగింపులు చేపడుతున్న కంపెనీలు..

Techies Face Hardships Amid Companies Serve Pink Slip
x

చెదిరిపోతున్న టెక్కీల కలలు.. భారీగా తొలగింపులు చేపడుతున్న కంపెనీలు..

Highlights

చెదిరిపోతున్న టెక్కీల కలలు.. భారీగా తొలగింపులు చేపడుతున్న కంపెనీలు..

Technology: కార్పొరేట్‌ కంపెనీలు అంటేనే అత్యాధునిక వసతులు, పని-జీవితం సమత్యులత.. టెక్‌ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులను చూసి.. అబ్బో అనుకునే వారు.. వారి హంగులు, ఆర్బాటాలు చూసి.. కొందరు అసూయపడేవారు.. వారి లైఫ్‌ స్టైల్‌ చూసి.. చాలా మంది కార్పొరేట్‌ కంపెనీల్లో పని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ.. ఇప్పుడు కార్పొరేట్‌ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. రేపు ఆఫీసుకు వెళ్తామో లేదో? అని కార్పొరేట్‌ ఉద్యోగులు ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్‌లో దిగ్గజ సంస్థలుగా పేరున్న అమెజాన్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, గూగుల్ వంటి పలు కంపెనీలు ఇప్పుడు ఉద్యోగుల తొలగింపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి.

టెక్‌ కంపెనీల్లో పని చేసేందుకు భారతీయు యువత ఎగబడింది. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా.. మన దేశం నుంచి యువత టెక్నికల్‌ స్కిల్స్‌ను పెంచుకుని పలు కంపెనీల్లో పాతుకుపోయారు. ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల హంగులు, ఆర్బాటాలను చూసి మరికొందరు అటువైపుగా అడుగులు వేశారు. ఇంజినీరింగ్‌ చేశారంటే.. బ్రాంచ్‌తో నిమిత్తం లేకుండా.. అందరూ టెక్‌ కంపెనీల్లోనే చేరేందుకు ప్రయత్నాలు చేశారు. అలా వేలాది మంది ఉద్యోగాలను కూడా సాధించుకున్నారు. మరెందరో సాప్ట్‌వేర్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వాటి కోసమే హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్పించే ఇన్‌స్టిట్యూట్‌లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. తమ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఆయా ఇన్‌స్టిట్యూట్లలో యువత చేరేవారు. డిమాండ్‌ ఉన్న కోర్సులను నేర్చుకుని.. ప్రయత్నాలు చేసేవారు. అయితే ఇప్పటికే పని చేస్తున్న టెక్కీలకు, కొత్తగా జాబ్‌ కోసం ప్రయత్నం చేసే యువత ఆశలపై టెక్‌ కంపెనీలు నీళ్లు జల్లుతున్నాయి. కంపెనీల్లో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2023 టెక్కీలకు పీడకలనే మిగులుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి టెక్కీ బుడగ పేలిపోయేలా పరిణామాలు మారుతున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ భారీ బాంబునే పేల్చింది. ఏకంగా 18వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించి.. టెక్కీల్లో కలవరం రేపింది. ఇప్పటికే 10 వేలమందిని తొలగించిన అమెజాన్‌ మళ్లీ ఇలాంటి భారీ నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటి? అంటే.. ఆర్థిక మాంద్యం భయాలే అన్న సమాధానం వస్తుంది. ఆ భయంతోనే అమెజాన్‌ కఠిన నిర్ణయం తీసుకుందా?

ఉద్యోగులను తొలగించడం ఎంతో కష్టమైన నిర్ణయమని అమెజాన్‌ సీఈవో ఆండీ జాసీ ప్రకటించారు. నవంబరులోనే చేపట్టిన తొలగింపులతో పరిస్థితులు చక్కబడలేదని ప్రస్తుతం మరింత మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఏకంగా 18వేల మందిని తొలగిస్తున్నట్టు జాసీ వెల్లడించారు. గతేడాది నవంబరులోనే 10వేల మంది ఉద్యోగులను అమెజాన్‌ తొలగించింది. నిజానికి కరోనా సమయంలో బ్లాక్‌ బాస్టర్‌ లాభాలను అమెజాన్‌ పొందింది. అప్పుడు డిమాండ్లకు తగ్గట్టుగా భారీ నియామకాలను చేపట్టింది. తాజాగా వారందరినీ వదిలించుకుంటోంది. ఇతర టెక్‌ దిగ్గజాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఆపిల్‌ పరిశోధన విభాగం ఉద్యోగాల నియామాకాన్ని నిలిపేసింది. 100 మందిని అడోబ్‌ కంపెనీ తొలగించింది. 12 వందల 50 మందిని విధులకు రావొద్దని డోర్‌ డాష్‌ తేల్చి చెప్పింది. సిక్కో సిస్టమ్స్‌ ఉద్యోగులను తొలించేందుకు సిద్ధమైంది. సేల్స్‌ ఫోర్స్‌ 10 శాతం మంది ఉద్యోగులను, మెటా 11వేల మందిని, లిఫ్ట్‌ 13 శాతం, హెచ్‌పీ వచ్చే మూడేళ్లలో 6వేల మందిని వదిలించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఉద్యోగుల తొలగింపుపై ఆయా కంపెనీలు చెబుతున్న కారణం మాత్రం ఒక్కటే మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ నుంచి కోలుకోవడమే లక్ష్యమని వెల్లడిస్తున్నాయి. సంస్థలు మనుగడ సాగించాలంటే ఖర్చులు తగ్గింపు మంత్రాన్ని జపిస్తున్నాయి. అందుకు ఉద్యోగుల తొలగింపు తప్పనిసరి అంటున్నాయి. ఈ క్రమంలో పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్టు పలు దిగ్గజ కంపెనీలు చెబుతున్నాయి.

దాదాపు దశాబ్దం పాటు సిలికాన్‌ వ్యాలీ స్టాక్‌ మార్కెట్లలో ధగధగ మెరిసింది. భారీ విస్తీర్ణంతో ఆఫీసులు వెలిశాయి. పెద్ద మొత్తంలో జీతాలను చెల్లించాయి. ఉద్యోగులు ప్రశాంత వాతావరణంలో గడిపారు. టెక్‌ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు స్వర్గంలా భావించారు. కానీ ఇప్పుడు వారి కల చెదిరిపోతోంది. ఆర్థిక మాంద్యం భయాలు కంపెనీల్లో మొదలయ్యాయి. దీంతో ఉద్యోగుల్లో కలవరం రేగుతోంది. నిజానికి కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అన్ని రకాల పరిశ్రమలు కుప్పకూలాయి. కానీ.. టెక్‌ కంపెనీలు మాత్రం లాభాల్లో దూసుకెళ్లాయి. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా వాతారవణాన్ని కల్పించాయి. డోర్‌ టు డోర్‌ డెలవరీలతో హోరెత్తాయి. వీడియో కాన్ఫరెన్స్‌లతో పనులను యధావిధిగా పని చేయించాయి. ఊహించనంతగా లాభాలను అర్జించాయి. ఐపీవో కార్యాచరణ, వెంచర్‌ క్యాపిటల్‌ మునుపెన్నడూ చూడని విధంగా అమ్మకాలు జరిగాయి. భారీ సంపాదన తోపాటు ఉద్యోగుల నియామకాల్లోనూ టెక్‌ సెక్టార్‌ ఊపందుకుంది. సీన్‌ కట్‌ చేస్తే.. పెట్టుబడులు పడిపోయాయి. టెక్‌ ఐపీవో మార్కెట్‌ 2008 తరువాత.. అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. 2022లో యాపిల్‌, అమెజాన్‌ ఒక్కోక్కటి 83వేల కోట్ల డాలర్లకు పైగా నష్టపోయాయి. 2022లో భారీ టెక్‌ కంపెనీల కీర్తి ప్రతిష్టలు ఢమాల్‌ అన్నాయి. మెటా ఏకంగా 64 శాతం, నెట్‌ఫ్లిక్స్‌ 51 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి. ఎక్కడ చూసినా ఆర్థిక మాంద్యం వస్తున్న భయాలు కమ్ముకున్నాయి. భారీగా ఉద్యోగుల తొలగింపులు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి.

టెక్‌ దిగ్గజ కంపెనీలు.. నష్టాల కారణంగానే ఉద్యోగులను తొలగిస్తున్నాయా? లేక వాటి పని విధానాల్లో అంతర్గతంగా లోపాలు ఉన్నాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి పలువురు ప్రసిద్ద కంపెనీల వ్యవస్థాపకులు.. లాభాదాయకత కంటే.. విలువల సృష్టికి ప్రధాన్యమిచ్చారు. మెటా, ట్విట్టర్‌ వంటి కంపెనీలు నిజమైన సంపద కంటే.. ఊహాజనిత సంపదకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఇటీవల కాలంలో టెక్‌ కంపెనీలు, స్టార్టప్‌లు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. లాభాలు లేకుండా.. కంపెనీల రెవెన్యూ భారీగా పెరిగింది. చాలావరకు టెక్‌ కంపెనీలు స్టేక్‌హోల్డర్‌ చేతుల్లో నుంచి స్టాక్‌ హోల్డర్‌ మేనేజ్‌మెంట్‌లోకి మారుతున్నాయి. ఏదైనా కంపెనీలో కొంత వాటా కలిగిన వ్యక్తిని షేర్‌ హోల్డర్ లేదా స్టాక్‌ హోల్డర్ అని అంటారు. స్టేక్‌ హోల్డర్ అంటే.. కంపెనీలో ప్రాజెక్టు ద్వారా ప్రభావితమై పెట్టుబడి పెట్టిన వారు. అయితే కంపెనీల్లో స్టాక్‌ హోల్డరే కీలక పాత్ర పోషిస్తారు. వారు తమ ఉత్పత్తులను వ్యాపార విలువలతో సంపదను సృష్టించాలని యత్నిస్తారు. కంపెనీలు భాగా నడుస్తున్నప్పుడు లాభాలు భారీగా వస్తాయి. ఆ లాభాలను స్టాక్‌ హోల్డర్‌ తీసేసుకుంటాడు. అయితే స్టేక్‌ హోల్డర్ మాత్రం అంత లాభాలను తీసుకోలేడు. దీంతో పలువురు కంపనీ యజమానులు కోటీశ్వరులు అవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళ్లినప్పుడు కంపెనీ ఆదాయం పడిపోతుంది. ఆ ప్రభావం కంపెనీ, దాని ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో నష్టాలను తగ్గించుకునేందుకు కంపెనీలు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. పెద్ద కంపెనీల్లో అధిక వేతనాలు, ప్రోత్సాహకాలను పెట్టుబడిదారుల వ్యతిరేకించడం సర్వసాధారణం. మొత్తంగా 2023 కార్పొరేట్‌ ఉద్యోగులకు పీడకలను మిగిల్చే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం భయాలు, పెట్టుబడిదారుల ఒత్తిడిలకు గురవుతున్న కంపెనీలు.. ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నాయి. తొలగింపుల పర్వం మున్ముందు మరింత దారుణంగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories