logo
టెక్నాలజీ

నాసా సూపర్ ఎర్త్ సీక్రెట్స్ ఏంటి.. భూమిని పోలిన గ్రహం నిజమేనా?

NASA Found Super Earth Ross 508 b
X

నాసా సూపర్ ఎర్త్ సీక్రెట్స్ ఏంటి.. భూమిని పోలిన గ్రహం నిజమేనా? 

Highlights

Super Earth: 8 బిలియన్.. అక్షరాలా 8వందల కోట్లు ఇదేదో ఆర్ధికపరమైన లెక్కలనుకుకుంటే పొరపాటే ప్రస్తుతం భూమి మీదున్న మొత్తం జనాభా సంఖ్య.

Super Earth: 8 బిలియన్.. అక్షరాలా 8వందల కోట్లు ఇదేదో ఆర్ధికపరమైన లెక్కలనుకుకుంటే పొరపాటే ప్రస్తుతం భూమి మీదున్న మొత్తం జనాభా సంఖ్య. ఇది ఇక్కడితో ఆగేది కూడా కాదు. జనాభా పెరిగే కొద్దీ కొత్త ఇబ్బందులూ తప్పవు. మరి మానవాళి భవిష్యత్ సంగతేంటి..? ఈ ప్రశ్నతోనే భూమికి ప్రత్యామ్నాయం కోసం యావత్ ప్రపంచం ఆశగా ఎదురు చూస్తోంది. ఈ ప్రయోగాల్లో నాసానే టాప్ గతంలో అడపా దడపా భూమికి రీప్లేస్‌మెంట్ ఇదే అని అంతరిక్షంలో పలు గ్రహాలను భావించినా.. ఇప్పటి వరకూ ఎలాంటి కన్‌క్లూజన్‌కూ రాలేదు. నిరంతర ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే నాసా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది..? ఆ అప్‌డేట్ మరేంటో కాదు సూపర్ ఎర్త్..! ఇంతకూ నాసా చెబుతున్న సూపర్ ఎర్త్‌ ఎక్కడుంది..? భూమి వెలుపల జీవరాశి ఉందనడానికి నాసాకు దొరికిన ఆధారాలు ఏంటి..?

సూపర్ ఎర్త్... ప్రపంచంలో ఇంతకుమించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంకోటి ఉండదు. అచ్చంగా భూమిలాగే మరో గ్రహం ఉంటే..? అక్కడ కూడా సమస్త జీవరాశులు ఉండేందుకు ఆస్కారం ఉంటే..? నింగీ, నేల, నీరు, నిప్పు, గాలి ఇలా పంచాభూతాలకూ భూమి కాకుండా మరో నిలయం అంటూ ఉంటే..? అంతకుమించిన గుడ్‌న్యూస్ మరొకటి ఏముంటుంది..? ఎందుకంటే విపరీతంగా పెరుగతున్న జనాభాతో భూమిపై రానున్నవన్నీ గడ్డురోజులే అన్నది అందరకీ తెలుసు. ఏమాత్రం అవకాశం ఉన్నా భూమిని పోలిన గ్రహం అంటూ దొరికితే మనిషకి అదో వరంగా మారడం ఖాయం. అందుకే, అగ్రరాజ్యాల నుంచి అవకాశం ఉన్న ప్రతి దేశ సైంటిస్టులూ భూమికి ప్రత్యామ్నాయ గ్రహం కోసం అంతరిక్షాన్ని జల్లెడ పడుతూనే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి ఆశలు, అంచనాల మధ్యే ఈ అంశంపై ఈసారి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సూపర్ ఎర్త్‌కు సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. నాసా పరిశోధనలు వర్క్‌ఔట్ అయితే ఈ సారి బ్యాగులు సర్దుకుని కొత్త గ్రహానికి వెళ్లిపోవచ్చనే అంచనాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇంతకూ, నాసా కనుగొన్న సూపర్ ఎర్త్‌ సీక్రెట్స్ ఏంటి..?

రొస్ 508 బీ ఇదే అంతరిక్ష పరిశోధకులు చెబుతున్న సూపర్ ఎర్త్‌. భూమి వెలుపల జీవరాశి అన్వేషణలో భాగంగా పాలపుంత బయట రొస్ 508 బీ అనే గ్రహాన్ని నాసా సైంటిస్టులు గుర్తించారు. నక్షత్రం నుంచి గ్రహం పరిభ్రమిస్తున్న దూరాన్ని బట్టి ఈ గ్రహంపై ఖచ్చితంగా జీవరాశి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ద్రవ్యరూపంలో నీరు కూడా ఉండొచ్చనే అంచనాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. భూమి నుంచి 37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం ద్రవ్యరాశి భూమి కంటే 4 రెట్లు అధికంగా ఉందట. అందుకే దీన్ని సూపర్ ఎర్త్‌గా పేర్కొంటున్నారు. పాలపుంతకు వెలుపల ఓ రెడ్ డ్వార్ఫ్స్ నక్షత్రం చుట్టూరా ఈ గ్రహం తిరుగాడుతోంది. కక్ష్యను ఒక్కసారి చుట్టిరావడానికి కేవలం 10.8 రోజుల సమయం మాత్రమే పడుతోంది. అంటే కేవలం 10.8 రోజుల్లోనే ఆ గ్రహంపై సంవత్సర కాలం పూర్తవుతుందన్న మాట.

మరోవైపు సూపర్ ఎర్త్-దాని నక్షత్రం మధ్య సగటు దూరం భూమి-సూర్యుడి మధ్యదూరం కంటే 0.05 రెట్లు అధికంగా ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో ఆవాసయోగ్యానికి అవకాశం ఉన్న ప్రాంతం వెలుపలికి రావడం, మళ్లీ ఆ ప్రాంతం గుండా వెళ్లడం ఒక్కటే ప్రతికూలాంశంగా అనిపిస్తోందని నాసా సైంటిస్టులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ గ్రహంపై నీరు ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో భవిష్యత్ పరిశీలనకు రొస్ 508 బీ ఉత్సాహాన్ని నింపనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజా ప్రయోగాలు ఏమాత్రం పాజిటివ్‌గా వచ్చినా అంతకుమించిన గుడ్‌స్యూస్ మరొకటి ఉండదంటున్నారు సైంటిస్టులు. అయితే, ఈ గ్రహాన్ని నాసా ఎలా గుర్తించింది..?

సుబరు టెలిస్కోప్‌పై ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్‌ని ఉపయోగించి రొస్ 508 బీ గ్రహాన్ని సుబరు స్ట్రాటజిక్ ప్రోగ్రామ్ గుర్తించింది. కాగా, రెడ్ డ్వార్ఫ్స్ నక్షత్రాలు ప్రధాన శ్రేణి నక్షత్రాలతో పోల్చితే కాస్త చిన్నగా, చల్లగా ఉంటాయి. గెలాక్సీలో మూడొంతుల నక్షత్రాలు ఇవే ఉన్నాయి. ఇందులో అధిక నక్షత్రాలు సౌరవ్యవస్థలో ఉండే పరిస్థితులకు దగ్గర వాతావరణాన్ని కలిగివుండే అవకాశం ఉంది. అలాగే, రొస్ 508 బీ గ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్యలో నక్షత్రం చుట్టూ తిరిగే అవకాశం ఉందంటున్నారు. ఒక్కసారి కక్ష్యను పూర్తి చేసేందుకు దాదాపు 11 రోజుల సమయం పడుతుండగా ఆవాసయోగ్య జోన్ గుండా వెళ్లే అవకాశముందన్నారు. ప్రస్తుత టెలిస్కోపులు నేరుగా ఈ గ్రహాన్ని ఫొటో తీయలేక పోతున్నాయని వివరించారు. దీనికి నక్షత్ర కేంద్రం, గ్రహానికి మధ్య దూరమే కారణమని చెబుతున్నారు. భవిష్యత్‌లో జీవరాశి అన్వేషణ లక్ష్యంగా ఈ గ్రహంపై పరిశోధనలు జరిగే అవకాశం ఉందని ఐఆర్‌డీ-ఎస్ఎస్‌పీ బృందం వెల్లడించింది. ఇదంతా సరే ఆవాసయోగ్యమైన జోన్ అంటే ఏంటి..?

పరిభ్రమిస్తున్న గ్రహం ఉపరితలంపై ద్రవ్యరూపంలో నీళ్లు ఉండగలిగేలా నక్షత్రం నుంచి తగిన దూరంలో ఉండే ప్రాంతాన్నే ఆవాసయోగ్య జోన్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతాలనే గోల్డీలాక్ జోన్స్ అని కూడా పిలుస్తారు. జీవం పుట్టేందుకు అనువైన ప్రదేశాలుగా వాటిని భావిస్తారు. నక్షత్రం చుట్టూ ఉన్న ఈ గోల్డీలాక్స్ జోన్‌ ద్వారానే రొస్ 508 బీ పరిభ్రమిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక జీవరాశి అన్వేషణలో రెడ్ డ్వార్ఫ్స్ నక్షత్రాలు చాలా కీలకమైనమని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ నక్షత్రాలపై పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. రెడ్ డ్వార్ఫ్స్ నక్షత్రాలపై ఉపరితలంపై 4వేల డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని చెబుతున్నారు. రొస్ 508 బీ మినహా ఇప్పటివరకు కనుగొన్న ఆవాసయోగ్య గ్రహాల్లో 'ప్రొగ్జిమా సెంటౌరి బీ' మాత్రమే ఉందని గుర్తు చేస్తున్నారు. తాజా అంచనాలతో భూమి వెలుపల జీవరాశి ఉందనడానికి బలం చేకూరుతున్నట్టు కనిపిస్తోంది.

మొత్తంగా రొస్ 508 బీ నాసా సైంటిస్టుల్లో కొత్త ఆశలు రేపుతోంది. ఒకవేళ ఈ గ్రహంపై జీవనానికి అనుకూల పరిస్థితులు ఉంటే, అది భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తుంది. అయితే, తదుపరి ప్రయోగాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయన్నదానిపైనే భూమికి ప్రత్యామ్నాంగా రొస్ 508 బీ ఉంటుందా లేదా అనేది తేలనుంది. దీంతో యావత్ ప్రపంచం కొత్త గ్రహంపై నాసా అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి రానున్న రోజుల్లో నాసా ప్రయోగాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

Web TitleNASA Found Super Earth Ross 508 b
Next Story