WhatsApp : మీరు పంపిన మెసేజ్‌లు వాట్సాప్ చదువుతోందా? మెటాపై సంచలన కేసు

WhatsApp : మీరు పంపిన మెసేజ్‌లు వాట్సాప్ చదువుతోందా? మెటాపై సంచలన కేసు
x
Highlights

మీరు పంపిన మెసేజ్‌లు వాట్సాప్ చదువుతోందా? మెటాపై సంచలన కేసు

WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. మీ వ్యక్తిగత చాటింగ్‌లు ఎంతవరకు సురక్షితం? ప్రైవసీ విషయంలో కంపెనీ చెబుతున్నవన్నీ నిజాలేనా? అంటే.. కాదనే సమాధానం వినిపిస్తోంది. వాట్సాప్ మాతృసంస్థ మెటా పై అమెరికాలో ఓ భారీ దావా నమోదైంది. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి ప్రైవసీతో ఆడుకుంటున్నారని ఈ కేసులో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లలో ఇప్పుడు ఆందోళన మొదలైంది.

వాట్సాప్ తన అతిపెద్ద బలంగా చెప్పుకునేది ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్. అంటే, మెసేజ్ పంపే వ్యక్తి, అందుకునే వ్యక్తి తప్ప మధ్యలో వాట్సాప్ కూడా వాటిని చదవలేదని కంపెనీ ఇన్నాళ్లు నమ్మబలికింది. ప్రతి చాట్ బాక్స్‌లోనూ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రదర్శిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. కానీ ఇప్పుడు అమెరికాలో నమోదైన తాజా కేసు ఈ నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. వాట్సాప్ మెసేజ్‌లు పూర్తిగా ప్రైవేట్ కావని, కంపెనీకి వాటిని యాక్సెస్ చేసే, స్టోర్ చేసే టెక్నికల్ కెపాసిటీ ఉందని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ కేసులో మరో సంచలన విషయం ఏమిటంటే.. భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా వంటి దేశాల యూజర్లు కూడా ఈ వివాదంలో బాధితులుగా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది విజిల్‌బ్లోయర్లు (సంస్థ రహస్యాలను బయటపెట్టేవారు) ఇచ్చిన సమాచారం ప్రకారం.. వాట్సాప్ తన యూజర్ల కమ్యూనికేషన్లను విశ్లేషిస్తోందని, అవసరమైతే కంపెనీ ఉద్యోగులు కూడా మెసేజ్‌లను చూడగలరని ఆరోపణలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రైవసీ విషయంలో వాట్సాప్ చేస్తున్న ప్రచారం కేవలం వ్యాపార జిమ్మిక్కు అని పిటిషనర్లు వాదిస్తున్నారు.

మెటా కంపెనీ మాత్రం ఈ ఆరోపణలను ఘాటుగా తిరస్కరించింది. ఇవన్నీ కల్పితాలని, నిరాధారమైన ఆరోపణలని మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ కొట్టిపారేశారు. గత పదేళ్లుగా వాట్సాప్ అత్యంత సురక్షితమైన సిగ్నల్ ప్రోటోకాల్ పై ఆధారపడి పనిచేస్తోందని, యూజర్ల ప్రైవసీని తాము ఎప్పటికీ విస్మరించబోమని స్పష్టం చేశారు. ఈ కేసును న్యాయపరంగా గట్టిగా ఎదుర్కొంటామని మెటా ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే అమెరికా కోర్టులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వాట్సాప్ తప్పు చేసినట్లు తేలితే, కంపెనీ భారీ జరిమానాతో పాటు వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories