Death Clock: మీరు చనిపోయే తేదీ ఏంటో చెబుతా అంటున్న డెత్ క్లాక్

AI based death clock website claims it predicts humans death date, is it really possible to know death date with AI technology
x

Death Clock: మీరు చనిపోయే తేదీ ఏంటో చెబుతా అంటున్న డెత్ క్లాక్ 

Highlights

Death Clock: మనిషి పుట్టుక, చావు... ఈ రెండూ ఎవ్వరికీ తెలియదు. కానీ కొత్తగా మనిషి పుట్టించిన టెక్నాలజీలు మనిషి గురించే ఏవేవో కొత్త కొత్త విషయాలు చెబుతున్నాయి.

Death Clock

మనిషి పుట్టుక, చావు... ఈ రెండూ ఎవ్వరికీ తెలియదు. కానీ కొత్తగా మనిషి పుట్టించిన టెక్నాలజీలు మనిషి గురించే ఏవేవో కొత్త కొత్త విషయాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో కొత్తగా వినిపిస్తున్నది ఏంటంటే... మీరు ఎప్పుడు చనిపోతారు, ఎలా చనిపోతారు అనే విషయం మేం చెబుతాం అంటోంది డెత్ క్లాక్ అనే ఒక వెబ్‌‌సైట్. ఇది వినడానికే విడ్డూరంగా ఉంది కదూ!!

అసలు డెత్ క్లాక్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుందనే విషయాలతో పాటు అసలు శాస్త్రీయంగా ఒక మనిషి కచ్చితంగా ఎప్పుడు చనిపోతారనేది చెప్పడం కుదురుతుందా లేదా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డెత్ క్లాక్ ఎలా పనిచేస్తుంది?

ఒక మనిషి ఎప్పుడు చనిపోతారో మేం చెబుతాం అని డెత్ క్లాక్ అనే వెబ్ సైట్ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక సెన్సేషన్ అయింది. ఆ వెబ్ సైట్‌లోకి లాగిన్ అయితే కొన్ని వివరాలు అడుగుతుంది. వయస్సు, బాడీ మాస్ ఇండెక్స్, తీసుకునే ఆహారం, వ్యాయామాలు చేసే అలవాటు ఉందా లేదా? ఉంటే ఏ మేరకు వ్యాయామం చేస్తారు? స్మోకింగ్ చేసే అలవాటుందా? ఆల్కహాల్ అలవాటుందా? ఇలా డెత్ క్లాక్ అడిగే అన్ని వివరాలు అందులో పొందుపర్చాలి. ఈ వివరాలను విశ్లేషించి వారు ఎప్పుడు, ఎలా చనిపోతారో చెబుతాం అని డెత్ క్లాక్ వెబ్ సైట్ అంటోంది.

మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారు? మీ లైఫ్ స్టైల్ ఏంటి అనే వివరాల కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డీటేయిల్స్‌‌తో కంపెనీ డిజైన్ చేసిన అడ్వాన్స్‌డ్ లైఫ్ ఎక్స్‌‌పెక్టెన్సీ క్యాలిక్యులేటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ మీరు చనిపోయే తేదీని వెల్లడిస్తుందని డెత్ క్లాక్ బలంగా చెబుతోంది.

ఒకరు చనిపోయే తేదీ మాత్రమే కాదు... చనిపోవడానికి ముందు ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు బతికి ఉంటారనేది కూడా చెబుతామంటోంది ఆ వెబ్ సైట్. ఇప్పటికే అలా 6 కోట్ల 30 లక్షల మందికి వారి డెత్ డేట్ ఏంటో చెప్పామంటోంది.

ఇక డెత్ డేట్ చెప్పి యూజర్స్‌ను టెన్షన్ పెట్టడమే కాదు... వారికి ఎక్కువ రోజులు బతకాలంటే ఏం చేయాలో కూడా సూచిస్తుందట. ఆల్కహాల్ తాగడం, సిగరెట్లు తాగడం, జంక్ ఫుడ్ తినే అలవాటు ఉన్న వాళ్లు వాటికి దూరంగా ఉంటే ఎక్కువ కాలం బతికే అవకాశం ఉందని చెబుతుందన్నమాట. చక్కటి ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, బరువు పెరగకుండా చూసుకోవడం, ఒకవేళ అధిక బరువు ఉంటే తగ్గాల్సిందిగా చెప్పడం లాంటివి చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే... లైఫ్ స్టైల్ మంచిగా మార్చుకుంటే ఎక్కువ కాలం బతుకుతారని డెత్ క్లాక్ సూచిస్తుంది.

శాస్త్రీయంగా ఇది సాధ్యమేనా?

సోషల్ మీడియా వాడకం పెరిగాక ఇంటర్నెట్లో ఇలాంటి యాప్స్, వెబ్‌సైట్స్ చాలానే దర్శనమిస్తున్నాయి. మీరు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో మీ ఫోటో అప్‌లోడ్ చేస్తే చెబుతామని గతంలోనే ఎన్నో యాప్స్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా మరో అడుగు ముందుకేసి బర్త్ డే డేట్ మీరు చెప్పండి... డెత్ డేట్ మేం చెబుతామని యాప్స్, వెబ్‌సైట్స్ పెడుతున్నారు. కానీ వాస్తవానికి ఒక మనిషి ఎప్పుడు చనిపోతారు అని కచ్చితంగా చెప్పే శాస్త్రం అంటూ ఏదీ లేదు. మనిషి ఆయుష్షును కొలిచే సాధనం ఏదీ లేదు. ఇలాంటి యాప్స్, వెబ్‌సైట్స్ అన్నీ కూడా సరదాగా చేసే ప్రయత్నాలే కానీ అవి నిజం కాదు. ఈ విషయాన్ని వారే చిన్న అక్షరాలతో గమనిక అంటూ తమ యూజర్స్ కోసం డిస్‌క్లైమర్ వేసి మరీ చెబుతారు.

ఇదంతా ఒక కోణమైతే... ఇందులో బయటికి కనిపించని మరో కోణం ఇంకొకటుంది. మనిషి భవిష్యత్ గురించి చెబుతామని ప్రకటించే యాప్స్, వెబ్‌సైట్స్‌కు భారీగా యాడ్స్ వస్తుంటాయి. అలా వారు యాడ్స్ రూపంలో భారీగా డబ్బు సంపాదించుకుంటారు. అంతేకాదు... మీరు ఇచ్చే మీ పర్సనల్ డీటేయిల్స్‌ను థర్డ్ పార్టీలకు డబ్బులకు అమ్ముకోరు అనే గ్యారెంటీ కూడా లేదు. ఉదాహరణకు మీరు ఇచ్చే డీటేయిల్స్ వెల్‌నెస్ క్లీనిక్స్, హాస్పిటల్స్ వంటి వ్యాపార సంస్థలకు బాగా పనికొస్తాయి. కస్టమర్స్‌ను వెతుక్కునే పనిలేకుండా ఇలాంటి సంస్థలే వారికి తమ యూజర్స్ డీటేయిల్స్ ఇస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అని సైబర్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories