T20 World Cup Finals Result: లాస్ట్ పంచ్ టీమిండియాది అయితే.. కివీస్ కి చుక్కలు.. ఫాన్స్ కి కిక్!
T20 World Cup Finals Result: టీమిండియా చరిత్ర సృష్టించింది . ప్రపంచ కప్ ను సగర్వంగా . . రికార్డులతో చేజిక్కించుకుంది . వరుసగా రెండోసారి కప్ గెలిచి చరిత్ర సృష్టించింది
T20 World Cup Finals Result
T20 World Cup Finals Result: సెమీస్ లో అరివీర భయంకరంగా రెచ్చిపోయారు. ఓటమి ఎరుగని సౌతాఫ్రికాను భారీ తేడాతో ఓడించి ఫైనల్స్ చేరుకున్నారు. అదే రేంజిలో భారత్ పని పట్టేస్తారని.. కనీసం టీమిండియాను టెన్షన్ పెట్టే రేంజిలో వారి ఆటతీరు ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. ఎక్కడ కూడా వారిని కోలుకోనీయకుండా కుమ్మి..కుమ్మి వదిలేశారు. బ్యాటింగ్ లో వరుసగా ముగ్గురు బ్యాటర్స్ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోతే.. తరువాత బౌలింగ్ లో టీమిండియా బౌలర్లు కివీస్ బ్యాటర్లకు ఊపిరి ఆండనీయలేదు. దీంతో భారీ తేడాతో న్యూజీలాండ్ ఓడిపోయింది.
వరుసగా రెండోసారి భారత్ టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడింది. యావత్ భారతావని మురిసిపోయేలా సగర్వంగా వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుని..
ప్రపంచ కప్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచింది. బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. దీంతో బ్యాటింగ్ మొదలెట్టిన భారత్.. కివీస్ ప్లేయర్లను ఎందుకు ఫీల్డింగ్ తీసుకున్నామా అనే రేంజిలో చితకొట్టేశారు. మొదటి రెండు ఓవర్లలో ఆచి తూచి ఆడిన ఓపెనర్లు సంజూ సాంసన్, అభిషేక్ శర్మలు మూడో ఓవర్ నుంచి దాడి మొదలు పెట్టారు. ఎంతలా అంటే.. వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చిన అభిషేక్ శర్మ పూనకం వచ్చినట్టు వచ్చిన బాల్ ను వచ్చినట్టు బౌండరీలు దాటించి 21 బంతుల్లోనే 52 పరుగులు చేసి భారత్ ను ఒక రేంజిలో నిలబెట్టాడు అభిషేక్ శర్మ. మరోవైపు సంజూ సాంసన్ తన అరివీర భయంకర బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లకు పీడకల లా మారిపోయాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి టీమిండియా వికెట్ కోల్పోకుండా భారత్ 92 పరుగులు చే సింది. అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి రెండు ఓవర్లలో 12 పరుగులు రాగా, తర్వాతి నాలుగు ఓవర్లలో భారత్ 80 పరుగులు చేసింది. పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది, ఇది T20 ప్రపంచ కప్‌లో అత్యధిక పవర్ ప్లే స్కోరు కూడా.
8వ ఓవర్ తొలి బంతికే అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటవడం ద్వారా భారత్ పై తొలి దెబ్బ పడింది. తరువాత బ్యాటింగ్ కి వచ్చిన ఇషాన్ కిషన్..కివీస్ కి వికెట్ తీసిన సంతోషాన్ని మిగులనీయలేదు. సంజూ తో కలిసి రెచ్చిపోయాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు సాధించిన జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించింది. ఫైనల్స్ లో భారత్ కేవలం 7.2 ఓవర్లలోనే 100 పరుగులు సాధించింది. అంతకుముందు ఇదే టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 7.5 ఓవర్లలోనే 100 పరుగులు సాధించింది.
11 ఓవర్లలో భారత్ 1 వికెట్ నష్టానికి 137 పరుగులు చేసింది. సంజు సామ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 33 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు, ఇది అతని వరుసగా మూడవ అర్ధ సెంచరీ.
12వ ఓవర్ మొదటి బంతికే భారత్ స్కోరు 150 పరుగుల మార్కును దాటింది. ఫెర్గూసన్ వేసిన మొదటి రెండు బంతుల్లో సామ్సన్ వరుసగా రెండు సిక్సర్లు బాది భాగస్వామ్యాన్ని 50 దాటించాడు.
ఆ తర్వాత, ఇషాన్ కిషన్ నాలుగు బంతులకు సిక్స్ కొట్టి జట్టు స్కోరును 150 దాటించాడు.
15వ ఓవర్లో భారత్ స్కోరు 200 పరుగుల మార్కును దాటింది. మిచెల్ సాంట్లర్ ఇన్నింగ్స్ చివరి బంతికి ఇషాన్ కిషన్ ఫోర్ కొట్టాడు. ఈ ఫోర్ జట్టు స్కోరును 200 పరుగుల మార్కును దాటించింది.
ఆ తరువాత ఒక్కసారిగా భారత్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. 16వ ఓవర్ తొలి బంతికే భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సంజు సామ్సన్ 46 బంతుల్లో 89 పరుగులు చేసి ఔటయ్యాడు. జామీ నీషమ్ బౌలింగ్‌లో కోల్ మెక్‌కాంచీకి క్యాచ్ ఇచ్చి అతను ఔటయ్యాడు.
వెస్టిండీస్‌కు చెందిన మార్లన్ శామ్యూల్స్ 85 పరుగుల రికార్డును అధిగమించి, టి20 ప్రపంచ కప్ ఫైనల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సామ్సన్ నిలిచాడు.
16వ ఓవర్లో జిమ్మీ నీషమ్ అద్భుతంగా బౌలింగ్ చేసి, ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ ఓవర్లో మూడు వికెట్లు, కేవలం ఒక పరుగు మాత్రమే రావడంతో, 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్లకు 204 పరుగులు చేసింది.
చివరలో దూబే అద్భుత బ్యాటింగ్ తో 20 ఓవర్లకు 254 పరుగులు చేసి.. న్యూజిలాండ్ ముందు 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ప్రతిగా బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది బుమ్రా బౌలింగ్లో కివీస్ బ్యాటర్లను చుక్కలు కనిపించాయి. నాలుగు ఓవర్లలో 4 వేయికోట్లు బుమ్రా పడగొట్టాడంటే అర్ధం చేసుకోవచ్చు భారత్ బౌలింగ్ ఎలా ఉందొ.
మొత్తమ్మీద న్యూజిలాండ్ 19 ఓవర్లకు 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా సంబరాలలో మునిగిపోయింది. వరుసగా రెండు వరల్డ్ కప్ లు గెలిచి రికార్డ్ సృష్టించింది. మూడు వరల్డ్ కప్ లు గెలిచినా తోలి టీమ్ గా భారత్ చరిత్ర సృష్టించింది.




