Shafali Verma: మళ్లీ అగ్రస్థానానికి చేరిన యువ సంచలనం షెఫాలీ వర్మ

shafali varma get top rank
x

షెఫాలీ వర్మ

Highlights

Shafali Verma: భారత్ మహిళా క్రికెట్ జట్టు సంచలన బ్యాటర్, డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.

Shafali Verma: భారత్ మహిళా క్రికెట్ జట్టు సంచలన బ్యాటర్, డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో మరోసారి టాప్ ప్లేస్ నిలిచింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో విధ్వంసకర బ్యాటర్‌ షెఫాలీ వర్మ తిరిగి అగ్రస్థానం చేరుకుంది. బెత్‌ మూనీని దాటుకొని అగ్రస్థానం కైవసం చేసుకుంది. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో షెఫాలీ విద్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. ప్రస్తుతం షెఫాలీ వయసు 17 ఏళ్లు మాత్రమే.

గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ నాకౌట్‌ దశకు తీసుకెళ్లినందుకు ఆమె తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంకు సాధించింది. ఇక సఫారీ క్రీడాకారిణి లిజెల్‌ లీ 3 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకు అందుకుంది. లారా వోల్వార్డ్‌ 5 స్థానాలు మెరుగై 24, సన్‌ లూస్‌ 5 స్థానాలు మెరుగై 38, నదిన్‌ డి క్లెర్క్‌ మూడు స్థానాలు ఎగబాకి 74కు చేరుకున్నారు.

టీమ్‌ఇండియా నుంచి దీప్తిశర్మ 4 స్థానాలు మెరుగై 40వ ర్యాంకు అందుకుంది. యువ బ్యాటర్‌ రిచా ఘోష్‌ ఏకంగా 59 స్థానాలు ఎగబాకి 85 ర్యాంకుకు చేరుకుంది. ఆల్‌రౌండర్‌ హర్లీన్‌ డియోలో బ్యాటర్ల జాబితాలో 262 స్థానాలు మెరుగై 99, బౌలర్లలో జాబితాలో 76 స్థానాలు మెరుగై 146కు చేరుకుంది. స్పిన్నర్‌ రాజేశ్వరీ గైక్వాడ్‌ 34 నుంచి 25కు ఎగబాకింది. వన్డేల్లో మిథాలీ ఒక స్థానం మెరుగై 8, ప్రియా పునియా 5 స్థానాలు మెరుగై 53, గైక్వాడ్ (బౌలింగ్‌)‌ 8 స్థానాలు మెరుగై 38కి చేరుకున్నారు.

తొలి రెండు టీ20ల్లో 23, 47తో విరుచుకుపడింది. బుధవారం జరిగిన మూడో టీ20లో విజృంభించింది. 113 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు షెఫాలీ వర్మ(60పరుగులు,30బంతుల్లో, 7ఫోర్లు,5సిక్సులు) స్మృతి మందానా(48పరుగులు, 28బంతుల్లో,9ఫోర్లు) చెలరేగి ఆడడంతో భారత్ తొమ్మిది వికెట్లు మిగిలి ఉండగా.. 11 ఓవర్లలోనే విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. కెప్టెన్ లూస్ 28 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లలో గైక్వాడ్ మూడు వికెట్లు దక్కించుకోగా..రాధా యాదవ్, అరుంధతిరెడ్డి, దీప్తి తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories