Champions Trophy 2025: హైబ్రిడ్‌ మోడల్‌కు ఓకే చెప్పిన పాకిస్తాన్‌.. కానీ మూడు కండిషన్స్!

Champions Trophy 2025: హైబ్రిడ్‌ మోడల్‌కు ఓకే చెప్పిన పాకిస్తాన్‌.. కానీ మూడు కండిషన్స్!
x
Highlights

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 హైబ్రిడ్‌ మోడల్‌లోనే జరగనుంది. ఐసీసీ దెబ్బకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) దిగొచ్చినట్లు తెలుస్తోంది.

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 హైబ్రిడ్‌ మోడల్‌లోనే జరగనుంది. ఐసీసీ దెబ్బకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) దిగొచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నో చర్చలు, సమావేశాల అనంతరం ఎట్టకేలకు హైబ్రిడ్‌ విధానానికి పీసీబీ ఓకే చెప్పిందట. అయితే హైబ్రిడ్‌ మోడల్‌కు పాక్ ఓకే చెబుతూనే మూడు కండిషన్స్ పెట్టిందని, అందుకు ఐసీసీ కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. నేడు ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై అధికార ప్రకటన రానుంది. పీసీబీ పెట్టిన ఆ కండిషన్స్ ఏంటో తెలుసుకుందాం.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్యం హక్కులు పాకిస్తాన్‌ వద్ద ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరి చివరలో టోర్నీ జరగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును బీసీసీఐ పాకిస్తాన్‌కు పంపడం లేదు. హైబ్రిడ్‌ మోడల్‌లో అయితే టోర్నీ ఆడతామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పీసీబీకి ఐసీసీ తెలపగా.. తాము హైబ్రిడ్‌ మోడల్‌కు ఒప్పుకోమని చెప్పింది. భారత్‌ కూడా వెనక్కి తగ్గలేదు. పీసీబీ, బీసీసీఐ మధ్య ఐసీసీ చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. చివరకు శుక్రవారం అన్ని దేశాల బోర్డులతో వర్చువల్‌గా సమావేశం అయింది. హైబ్రిడ్‌ మోడల్‌కు పాకిస్తాన్‌ ఒప్పుకోకపోవడంతో.. ఐసీసీ కఠినంగా వ్యవహరించింది.

హైబ్రిడ్‌ మోడల్‌కు ఒప్పుకోకుంటే.. టోర్నీ మొత్తాన్ని పాకిస్తాన్ వెలుపల నిర్వహిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఐసీసీ దెబ్బకు దిగివచ్చిన పీసీబీ.. ఐసీసీ ప్రపోజల్‌కు ఓకే చెప్పింది. అయితే మూడు కండిషన్స్ విధించిందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. భారత్ ఆడే (గ్రూప్‌.. ఒకవేళ సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌కు అర్హత సాధిస్తే) మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించాలని పీసీబీ మొదటి కండిషన్. ఒకవేళ​ భారత్ గ్రూప్‌ దశలోనే నిష్క్రమిస్తే.. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లను లాహోర్‌లో నిర్వహించాలన్నది రెండో కండిషన్. భవిష్యత్తులో భారత్‌ నిర్వహించే ఐసీసీ ఈవెంట్ల మ్యాచ్‌లను (పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లను) తటస్థ వేదికలపై నిర్వహించాలన్నది చివరిది. ఇందుకు ఐసీసీ సుముఖంగానే ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్.. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు లేకుంటే మరింత నష్టపోనుంది. అందుకే హైబ్రిడ్‌ మోడల్‌కు ఓకే చెప్పింది. అన్నీ అనుకూలిస్తే.. 2025 ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతుంది. భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ టీమ్స్ టోర్నమెంట్‌లో బరిలో దిగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories