IND vs SA : ROKO సునామీ.. 61 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసిన కోహ్లీ-యశస్వి

IND vs SA
x

IND vs SA : ROKO సునామీ.. 61 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసిన కోహ్లీ-యశస్వి

Highlights

IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడవ, నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది.

IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడవ, నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సఫారీలు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి, 61 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో అలవోకగా ఛేదించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి అంతర్జాతీయ సెంచరీ ఈ గెలుపులో హైలైట్‌గా నిలిచింది.

మొదటగా బౌలింగ్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. దక్షిణాఫ్రికా జట్టును 270 పరుగులకే పరిమితం చేయడంలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలకంగా నిలిచారు, వీరిద్దరూ చెరో 4 వికెట్లు తీసుకున్నారు. ఈ 4 వికెట్లతో కుల్దీప్ యాదవ్ కొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 4-వికెట్ హాల్ (ఒక ఇన్నింగ్స్‌లో 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు) తీసుకున్న భారత బౌలర్ల జాబితాలో కుల్దీప్ (11 సార్లు) చేరాడు. అతని కంటే ముందు అజిత్ అగార్కర్ (12 సార్లు), మహ్మద్ షమీ (16 సార్లు) మాత్రమే ఉన్నారు.

271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. సిరీస్‌లోని గత రెండు మ్యాచ్‌లలో 40 పరుగులు మాత్రమే చేసిన జైస్వాల్, ఈ మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా ఆడాడు. యశస్వి జైస్వాల్ తొలుత నెమ్మదిగా 75 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసినా, ఆ తర్వాత వేగం పెంచాడు. ఈ మ్యాచ్‌లో 121 బంతుల్లో 116 పరుగులు (12 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సెంచరీతో అతను మూడు ఫార్మాట్లలో (టెస్టు, T20I, ODI) సెంచరీలు సాధించిన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.

రోహిత్ శర్మ 75 పరుగుల (7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్ ఆడి, జైస్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రోహిత్ అవుటైన తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ, దూకుడుగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. విరాట్ కోహ్లీ కేవలం 45 బంతుల్లో 65 పరుగులు (6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. జైస్వాల్, కోహ్లీ కలిసి కేవలం 84 బంతుల్లో 116 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ 39.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌ను గెలుచుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories