IND vs NZ Final 2026: పాకిస్థాన్ ఆటగాడి రికార్డుపై కన్నేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. ఆందోళనలో భారత్ క్రికెట్ ఫాన్స్!
IND vs NZ Final 2026: టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ప్రతి ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరన్నది క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే.
IND vs NZ Final 2026: పాకిస్థాన్ ఆటగాడి రికార్డుపై కన్నేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు.. ఆందోళనలో భారత్ క్రికెట్ ఫాన్స్!
IND vs NZ Final 2026: టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ప్రతి ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరన్నది క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే. ప్రతి టోర్నీలో కొందరు స్టార్ బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండి.. పరుగుల వరద పారిస్తూ టాప్ స్కోరర్లుగా నిలుస్తారు. 2007లో ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటివరకు పలు దేశాల స్టార్ బ్యాటర్లు ఈ ఘనతను అందుకున్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆ టాప్ బ్యాటర్ల లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం.
మొదటి టాప్ స్కోరర్ మ్యాథ్యూ హేడెన్:
2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మ్యాథ్యూ హేడెన్ టాప్ రన్ స్కోరర్. కేవలం 6 ఇన్నింగ్స్‌ల్లోనే 265 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2009లో శ్రీలంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ 7 ఇన్నింగ్స్‌ల్లో 317 పరుగులు చేసి అద్భుత ప్రదర్శనతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2010 టీ20 వరల్డ్ కప్‌లో మరో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్ధనే 6 ఇన్నింగ్స్‌ల్లో 302 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. 2012లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ 6 ఇన్నింగ్స్‌ల్లో 249 పరుగులు చేసి టోర్నీ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ రెండుసార్లు:
2014లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఈ రికార్డు నెలకొల్పాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో 319 పరుగులు చేసి పొట్టి టోర్నీలో అత్యధిక పరుగులు సాధించాడు. 2016లో బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 295 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా.. 2021లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 303 పరుగులతో ముందంజలో నిలిచాడు. 2022లో కోహ్లీ 296 పరుగులు చేసి మరోసారి టీ20 వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2024లో అఫ్గానిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గర్భాజ్ 8 ఇన్నింగ్స్‌ల్లో 281 పరుగులు చేసి తన జట్టులో కీలక పాత్ర పోషించాడు.
2026లో ఫర్హాన్ రికార్డు ప్రదర్శన:
2026 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం 6 ఇన్నింగ్స్‌ల్లోనే 383 పరుగులు చేసి టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతని దూకుడు బ్యాటింగ్ ప్రస్తుత టోర్నీలో ప్రధాన చర్చగా మారింది. అయితే పాక్ సూపర్ 8 నుంచే నిష్క్రమించడం విశేషం.
ఫర్హాన్ రికార్డు కోసం పోటీ:
026 టీ20 వరల్డ్ కప్‌లో సాహిబ్‌జాదా ఫర్హాన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఇంకా ఉన్నాయి. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ ఫిన్ అలెన్ ఈ రికార్డును అధిగమించాలంటే ఇంకా 95 పరుగులు చేయాలి. టిమ్ సీఫర్ట్‌కు 100 పరుగులు, భారత ఓపెనర్ ఇషాన్ కిషన్‌కు 121 పరుగులు అవసరం. ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు భారీ ఇన్నింగ్స్ ఆడతారో అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. కివీస్ బ్యాటర్లు ఈ రికార్డు నెలకొల్పితే.. టీమిండియా విజయావకాశాలు సన్నగిల్లుతాయి. ఫైనల్లో అలెన్, సీఫర్ట్ ఆడకూడదని ఇండియన్ ఫాన్స్ కోరుకుంటున్నారు. ఫర్హాన్ రికార్డుని కిషన్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారు.




