IND vs NZ Final 2026: దంచికొట్టిన అభిషేక్, సంజు, కిషన్.. న్యూజిలాండ్ ముందు ఊహించని టార్గెట్!
IND vs NZ Final 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 రన్స్ చేసింది
IND vs NZ Final 2026: దంచికొట్టిన అభిషేక్, సంజు, కిషన్.. న్యూజిలాండ్ ముందు ఊహించని టార్గెట్!
IND vs NZ Final 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 రన్స్ చేసింది. దాంతో న్యూజిలాండ్ ముందు 256 పరుగుల టఫ్ టార్గెట్ ఉంది. భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు సంజు శాంసన్ (89; 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (54; 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (52; 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు హాఫ్ సెంచరీలు బాదారు. ఇన్నింగ్స్ చివరలో శివమ్ దూబే దంచికొట్టాడు. న్యూజిలాండ్ బౌలర్ జేమ్స్ నీషమ్ మూడు వికెట్స్ పడగొట్టాడు.
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఫైనల్లో టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దంచి కొట్టారు. ముందుగా అభిషేక్ జోరందుకోగా.. ఆపై సంజు కూడా బాదడం మొదలెట్టాడు. దాంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ కోల్పోకుండా 92 రన్స్ చేసింది. అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచుల్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. ఇంకుముందు ఫిన్ అలెన్ (19 బంతుల్లో 50) దక్షిణాఫ్రికాపై సెమీస్‌లో వేగంగా హాఫ్ సెంచరీ సాధించాడు.
అభిషేక్, సంజు దంచుడుతో టీ20 ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచుల్లో వేగంగా (7.2 ఓవర్లు) 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ నిలిచింది. 7.1వ ఓవర్‌లో అభిషేక్ (52) అవుట్ అయ్యాడు. సంజుకు ఇషాన్ తోడవ్వడంతో పరుగుల వరద ఆగలేదు. ఇక 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 127/1గా ఉంది. ధాటిగా ఆడిన సంజు హాఫ్ సెంచరీ బాదాడు. రచిన్ రవీంద్ర వేసిన ఓవర్‌లో మూడు సిక్సులు బాదిన సంజు.. 20 పరుగులు పిండుకున్నాడు. మరోవైపు కిషన్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. అయితే భారత్‌కు ఒకే ఓవర్‌లో మూడు షాక్‌లు తగిలాయి. సంజు, ఇషాన్ సహా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0)ను జేమ్స్ నీషమ్ అవుట్ చేశాడు. దాంతో భారత్ స్కోర్ వేగం తగ్గింది. హార్దిక్ (18), తిలక్ (8) తడబడ్డారు, హార్దిక్ అవుట్ అనంతరం క్రీజులోకి వచ్చిన దూబే.. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. నీషమ్ వేసిన 20వ ఓవర్లో ఏకంగా 24 రన్స్ బాదాడు. దూబే 8 బంతుల్లో 26 రన్స్ చేయడంతో భారత్ స్కోర్ 250 దాటింది.




