చిన్నప్పుడు కట్టెలు మోసింది.. ఇప్పుడవే చేతులు భారత్‌కు వెండి పతకాన్ని అందించాయి..

Biography of Chanu Saikhom Mirabai
x

చిన్నపుడు కట్టెలు మోసింది.. ఇప్పుడవే చేతులు భారత్‌కు వెండి పతకాన్ని అందించాయి..

Highlights

Chanu Saikhom Mirabai: చిన్నపుడు కట్టెలు మోసింది. ఇప్పుడవే చేతులు వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు వెండి పతకాన్ని అందించాయి.

Chanu Saikhom Mirabai: చిన్నప్పుడు కట్టెలు మోసింది. ఇప్పుడవే చేతులు వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు వెండి పతకాన్ని అందించాయి. మారు మూల రాష్ట్రం నుంచి వచ్చిన ఆ యువతి అంతర్జాతీయ స్థాయిలో భారత్ జెండాను రెపరెపలాడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకంతో శుభారంభం చేసిన మీరాబాయి చాను తోటి భారత క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచింది. మీరాబాయి ఒలింపిక్స్‌ ప్రస్థానంపై HMTV స్పెషల్‌ ఫోకస్‌.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ క్రీడాకారులు శుభారంభాన్ని అందించారు. రెండు దశాబ్దాల తర్వాత వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం లభించింది. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి కాంస్యం గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇన్నాళ్ళ తర్వాత మారుమూల రాష్ట్రం నుంచి వచ్చిన మీరాబాయి జాను మరో మెట్టు ఎక్కింది. 49 కేజీల విభాగంలో రజతం సాధించింది. ఈసారి మన క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన ఇస్తారన్న ఆశల్ని తొలిరోజే నిలబెట్టింది మీరాబాయి. అదేవిధంగా మొదటిరోజు పోటీల్లో హాకీ జట్టు కూడా ఓ విజయం సాధించింది. షూటర్స్‌ కూడా మెరుగైన ప్రదర్శన చేశారు. తొలిరోజు మన క్రీడాకారులు సాధించిన విజయాలతో భారత్‌కు మరిన్ని పతకాలు ఖాయమని భావిస్తున్నారు. ఏదేమైనా వెండికొండ మీరాబాయి జాను తొలి పతకాన్ని అటు దేశానికి ఇటు స్వరాష్ట్రానికి కుటుంబానికి ఎంతో సంతోషాన్నిచ్చారు. తమ కుమార్తె ఒలింపిక్స్‌లో పతకం సాధించడాన్ని టీవీలో చూసిన ఆమె కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగితేలుతున్నారు. రాష్ట్రపతి, ప్రధానితో సహా యావత్‌ దేశం మీరాబాయి జానును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు దగ్గరలోని నాంగ్‌పోక్‌ కక్చింగ్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1994లో మీరాబాయి జాను జన్మించింది. చిన్నతనంలో వంట కలప తెచ్చే సమయంలో తన అన్నకంటే తానే ఎక్కువ బరువు మోయడాన్ని చూసి కుటుంబమంతా ఆశ్చర్యపోయింది. ఆర్థికంగా ఇబ్బందులున్నా తమ కుమార్తెకు తగిన విద్య నేర్పించాలని కుటుంబం నిర్ణయించుకుంది. ఆమెకు ఇష్టమైన వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు. తన అమ్మా, నాన్నల కష్టానికి తగిన ఫలాల్ని అందిస్తూ వచ్చింది మీరాబాయి. వారి కలలను సాకారం చేస్తూ 11 ఏళ్ళ వయస్సు నుంచే అనేక పోటీల్లో విజయాన్ని సాధించింది. 2014లో గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో తొలి రజతాన్ని సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది మీరాబాయి. 2016లో రియో ఒలింపిక్స్‌లో పోటీలో పాల్గొనేందుకు జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో విజయం సాధించింది. నేషనల్‌ ట్రయిల్స్‌లో ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచి తన ఆరాధ్య గురువు కుంజూరాణి దేవి రికార్డును అధిగమించింది మీరాబాయి. ఇంఫాల్‌కు చెందిన కుంజూరాణిదేవి ఏడుసార్లు వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించింది. భారత్‌ మహిళా వెయిట్‌లిఫ్టర్లలో మేటిగా పేరు తెచ్చుకున్న కుంజురాణి రికార్డులనే మీరాబాయి జాను చెరిపేసింది.

అయితే 2016 రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం పోటీపడినా మీరాబాయి సాధించలేకపోయింది. ఆ వెంటనే పుంజుకుని 2017లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది. ఇరవై సంవత్సరాల తర్వాత వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించిన ఇండియన్‌ వెయిట్‌లిఫ్టర్‌గా రికార్డులకెక్కింది. అక్కడి నుంచి ప్రతి పోటీలో పతకాల వేట కొనసాగిస్తూనే ఉంది. 2018లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, ఆ తర్వాత మరో మూడు నేషనల్‌, ఇంటర్నేషనల్‌ పోటీల్లో పతకాలు సాధించింది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించే లక్ష్యంతో బరిలో దిగింది. 49 కేజీల విభాగంలో 202 కేజీలు ఎత్తిన మీరాబాయి స్వర్ణం కోసం జరిగిన మూడో ప్రయత్నంలో విఫలమైంది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడటంతో స్వర్ణం చేజారింది. అప్పటికే ఆమెకు రజతం ఖాయమైంది. 210 కేజీల బరువు ఎత్తిన చైనా లిఫ్టర్‌ జిజోయ్‌ పసిడి పతకాన్ని దక్కించుకుంది. కొద్దిలో బంగారు పతకం జారిపోయినా రెండో స్థానంలో నిలిచి భారత్‌కు శుభారంభాన్ని అందించింది మీరాబాయి జాను. 26 ఏళ్ళ మీరాబాయిని కేంద్రం ఇప్పటికే అనేక అవార్డులతో సత్కరించింది. పద్మశ్రీ అవార్డుతో పాటు రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు కూడా ఆమె అందుకుంది. ప్రస్తుతం రైల్వేలో ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తోందామె.

రాష్ట్రపతి, ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులు దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు సచిన్‌ టెండూల్కర్‌ వంటి క్రికెటర్లు మీరాబాయి జానుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు దశాబ్దాల నాడు సిడ్నీ ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్య పతకం తెచ్చిన కరణం మల్లీశ్వరి మీరాబాయిను ప్రశంసించారు. ఆమె సాధించిన విజయం దేశంలోని యూత్‌కు వెయిట్‌ లిఫ్టింగ్‌లో మరింత ఇష్టం పెరుగుతుందన్నారు. తొలిరోజు మీరాబాయి సాధించిన పతకం ఇతర క్రీడాకారులకు కూడా ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు కరణం మల్లీశ్వరి.

ఒలింపిక్స్‌లో తొలి పతకాన్ని తెచ్చిన మీరాబాయి తన ఈ విజయాన్ని దేశానికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించింది. తాను ఈ స్థాయికి వచ్చేందుకు ప్రోత్సహించిన దేశ ప్రజలకు, కేంద్ర భుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. తన కుటుంబానికి, మరీ ముఖ్యంగా తన తల్లికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నానని, తన కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసిందని గుర్తు చేసుకుంది ఒలింపిక్స్‌లో భారత వెండికొండ సైకోమ్‌‌ మీరాబాయి జాను.

Show Full Article
Print Article
Next Story
More Stories