Arshdeep vs Mitchell: అర్షదీప్ - మిచెల్ వివాదం.. అసలు కారణం అదే..!
Arshdeep vs Mitchell: భారత్-న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఉత్కంఠ రేపిన అర్ష్‌దీప్ సింగ్, డారిల్ మిచెల్ వివాదం వెనుక అసలు కారణాలేంటి?
Arshdeep vs Mitchell
T20 World Cup Final 2026: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనగానే ఆ ఉత్కంఠ, ఆ వేగం, ఆ ఎమోషన్స్ వేరే లెవల్‌లో ఉంటాయి. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ మెగా ఫైనల్‌లో టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించినా.. మ్యాచ్ మధ్యలో జరిగిన ఒక సంఘటన మాత్రం అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
మైదానంలో మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. భారత్ విసిరిన లక్ష్యం దిశగా కివీస్ బ్యాటర్లు పోరాడుతున్నారు. సరిగ్గా 11వ ఓవర్.. బంతి అర్ష్‌దీప్ సింగ్ చేతిలో ఉంది. క్రీజులో ప్రమాదకరమైన బ్యాటర్ డారిల్ మిచెల్. ఆ ఓవర్‌లో మిచెల్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదడంతో మైదానంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఏం జరిగింది? ఆ వివాదానికి కారణమేంటి?
వరుస సిక్సర్లతో ఒత్తిడిలో ఉన్న అర్ష్‌దీప్.. మూడో బంతిని సంధించాడు. మిచెల్ ఆ బంతిని నేరుగా బౌలర్ వైపు ఆడాడు. బంతిని అందుకున్న అర్ష్‌దీప్, ఆవేశంలో దాన్ని నేరుగా బ్యాటర్ వైపు విసిరాడు. అది చూసి షాక్ అయిన మిచెల్, తృటిలో తప్పించుకుని.. కోపంతో బౌలర్ వైపు దూసుకొచ్చాడు. "ఇదేం పద్ధతి?" అన్నట్లుగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.
కెప్టెన్ ఎంట్రీ.. కూల్ అయిన వాతావరణం
పరిస్థితి చేయి దాటిపోతుండగా, టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రంగంలోకి దిగాడు. తనదైన స్టైల్‌లో మిచెల్‌ను శాంతపరిచి, పరిస్థితిని చక్కదిద్దాడు. అంపైర్లు కూడా జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు. కాసేపటికే అర్ష్‌దీప్ తన తప్పు తెలుసుకుని మిచెల్‌కు సారీ చెప్పడంతో ఆ వివాదానికి తెరపడింది.
అసహనానికి అసలు కారణం ఆ క్యాచ్ డ్రాప్?
అయితే అర్ష్‌దీప్ అంతలా సహనం కోల్పోవడానికి కేవలం సిక్సర్లు మాత్రమే కారణం కాదని అభిమానులు విశ్లేషిస్తున్నారు. ఆ వివాదానికి ముందే హార్దిక్ పాండ్యా ఒక సులువైన క్యాచ్‌ను వదిలేయడం, వికెట్లు దక్కకపోవడం అర్ష్‌దీప్‌ను నిరాశకు గురిచేశాయి. ఫైనల్ వంటి హై-ప్రెజర్ మ్యాచ్‌లో అదృష్టం కలిసిరాకపోవడంతోనే ఆ యువ బౌలర్ అలా రియాక్ట్ అయి ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మైదానంలో చిన్నపాటి ఘర్షణలు సహజమే అయినా.. అంతిమంగా క్రీడా స్ఫూర్తే గెలిచింది. అర్ష్‌దీప్ సారీ చెప్పడం, కివీస్ బ్యాటర్ కూల్ అవ్వడం క్రీడల్లో ఉండే అందాన్ని చాటిచెప్పాయి. ఏది ఏమైనా, ఆ కసితోనే భారత్ అద్భుత విజయాన్ని అందుకుని కప్పును ముద్దాడింది.




