తిరుమల బ్రహ్మోత్సవాలు : మోహినీ అవతారంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

తిరుమల బ్రహ్మోత్సవాలు : మోహినీ అవతారంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు
x
Highlights

తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వేలకొలది భక్తుల మధ్య...

తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వేలకొలది భక్తుల మధ్య నిర్వహిస్తారు. అదే విధంగా ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో స్వామివారికి ఏకాంతంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. మొదటి రెండు రోజుల బ్రహోత్సవాల్లో మొదటి రోజు ధ్వజారోహణం, రెండో రోజు శేషవాహనం పైన ఊరేగించారు. అదేవిధంగా మూడో రోజు ఉదయం సింహవాహన సేవ, నాలుగవ రోజు కల్పవృక్ష వాహనంపై ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకున్ని ఊరేగించారు.

ఇక బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజు ఈ రోజు కావడంతో మంగళవారం ఉదయమే స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. క్షీరసాగర మధనంలో స్వామివారు మోహినిగా ఉద్భవించినట్టు భక్తుల ప్రతీతి. ఈ అవతార వూరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. మోహినీ అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి, తన కుడిచేతితో చిలుకను పట్టుకొని ఉంటారు. ఈ హారాన్నీ, చిలుకనూ స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్‌ (గోదాదేవి) నుంచి తెచ్చినట్లుగా చెప్తారు. అర్చకులు, జీయంగార్లు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శ్రీవారి గరుడ వాహనం

ఇక ఐదో రోజు సాయంత్రం వేళ స్వామివారి ప్రధాన వాహనం గరుడుడిపై ఊరేగిస్తారు. ఈ గరుడుడిని 'పెరియ తిరువాడి' అంటారు. అయిదోరోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్నిరోజులూ ధ్రువబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడవాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్పస్వామికి అలంకరింపజేస్తారు. అలాగే ఈరోజునే, శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి సమర్పించే నూతన వస్త్రాలను స్వామివారు స్వీకరిస్తారు. గరుడ వాహనసేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు.

Show Full Article
Print Article
Next Story
More Stories