తిరుమల బ్రహ్మోత్సవాలు : సింహవానంపై యోగ నరసింహుడిగా శ్రీనివాసుని దర్శనం

తిరుమల బ్రహ్మోత్సవాలు : సింహవానంపై యోగ నరసింహుడిగా శ్రీనివాసుని దర్శనం
x
Highlights

తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వేలకొలది భక్తుల మధ్య...

తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వేలకొలది భక్తుల మధ్య నిర్వహిస్తారు. అదే విధంగా ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో స్వామివారికి ఏకాంతంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. మొదటి రెండు రోజుల బ్రహోత్సవాల్లో మొదటి రోజు ధ్వజారోహణం, రెండో రోజు శేషవాహనం పైన ఊరేగించారు. అదేవిధంగా మూడో రోజు ఉదయం అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడికి సింహవాహన సేవ వైభవంగా జరిగింది. ఆ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనీ తలపైన ఆదిదేవుడిని ధరించాలనీ చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగిస్తారు. ఆల‌యంలోని ధ్వ‌జ‌స్తంభం వ‌ర‌కు స్వామివారిని సింహ‌ వాహ‌నంపై ఏకాంతంగా ఊరేగించారు.

ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమైంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. సింహ రూప దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. ఇక ఇదే రోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి, అచ్చమైన భోగశ్రీనివాసునిగా ముత్యాలపందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. ముత్యాల నిర్మలకాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం.

బ్రహ్మోత్సవాలలో రకములు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజులు కన్నులపండువగా జరుగుతాయి. నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో- అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు. స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి, భక్తిపారవశ్యంతో పునీతులవుతారు.

నిత్య బ్రహ్మోత్సవం

ప్రతి సంవత్సరం నిర్ధారిత మాసంలో నిర్ధారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మోత్సవాలు. ఇవి మూడురోజులుగానీ అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులుగానీ జరుగుతాయి.

శాంతి బ్రహ్మోత్సవం

కరవు, కాటకాలు, భయాలు, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి 'శాంతి బ్రహ్మోత్సవాలు'. ఇలాంటి శాంతి బ్రహ్మోత్సవాలను గత చరిత్రకాలంలో చాలామంది ప్రభువులు, దేశ, ప్రాంత, జనహితార్థం అయిదు రోజులపాటు నిర్వహించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి.

శ్రద్ధా బ్రహ్మోత్సవాలు

ఎవరైనా భక్తుడు, తగినంత ధనాన్ని దేవస్థానంలో, దైవసన్నిధిలో సమర్పించి, భక్తిశ్రద్ధలతో జరిపించుకొనేది 'శ్రద్ధా బ్రహ్మోత్సవం'. శ్రీవారి ఆలయంలో ఇలాంటి శ్రద్ధా బ్రహ్మోత్సవాలను 'ఆర్జిత బ్రహ్మోత్సవాలు'గా పేర్కొంటున్నారు.

ఒకరోజు బ్రహ్మోత్సవం

రథసప్తమి రోజు స్వామిని సప్తవాహనాలలో ఊరేగిస్తారు. అందువల్ల దీనిని ఒకరోజు బ్రహ్మోత్సవమని చెబుతారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభించి, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనంలో స్వామిని ఊరేగిస్తారు. చక్రస్నానానంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలలో ఊరేగిస్తారు. సప్తాశ్వాల, సప్తమి నాటి, సప్తవారాల సంకేతంగా సూర్యుడు పుట్టినప్పుడు ఈ ఉత్సవం జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories