Kallakuru Venkateswara Swamy Temple: కాళ్లకూరు వేంకటేశ్వరుని ఆలయం విశేషాలు...

Kallakuru Venkateswara Swamy Temple: కాళ్లకూరు వేంకటేశ్వరుని ఆలయం విశేషాలు...
x
Kallakuru Shri Venkateswaraswamy Temple
Highlights

Kallakuru Venkateswara Swamy temple: కలియుగదైవం, మలయప్ప స్వామి అనేకానేక ప్రదేశాల్లో ఆవిర్భవించి, భక్తుల కోరికలు తీరుస్తూ, అనంతమైన తన మహిమలతో అశేష భక్త జనకోటిని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు.

కలియుగదైవం, మలయప్ప స్వామి అనేకానేక ప్రదేశాల్లో ఆవిర్భవించి, భక్తుల కోరికలు తీరుస్తూ, అనంతమైన తన మహిమలతో అశేష భక్త జనకోటిని ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. అలా ఆవిర్బవించిన శ్రీ వేంకటేశ్వరుని మహమాన్విత క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా 'కాళ్లకూరు'లో కనిపిస్తుంది.

స్థలపురాణము

పూర్వం తిరుమల కొండపై శ్రీధరుడనే బ్రాహ్మణుడుండే వాడు. అతను శ్రీవారి ఆలయంలో నాట్యంచేసే పద్మావతి అనే ఆమెను ప్రేమించి తనను పెండ్లాడమని కోరగా ఆమె తిరస్కరిస్తుంది. దానికి కోపగించిన శ్రీధరుడు ఆమెను శపిస్తాడు. దానికి కినుక వహించిన ఆమె కూడా శ్రీధరుడిని శపిస్తుంది. శాపవిమోచనము కొరకు ఆ ఇద్దరు శ్రీ వేంకటేశ్వరుని సేవిస్తారు. దాంతో ఆ దేవ దేవుడు కరుణించి పద్మావతికి తన పేరుతో నదిగా గోదావరి సమీపాన అవతరిస్తావని....... శ్రీధరునికి..... బ్రాహ్మణుడిగా జన్మించి అష్టకష్టాలు పడి శిష్యులతో పద్మావతీ నది తీరంలో తన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడని .... శాప విమోచన మార్గాలు చెపుతాడు. కొన్నాళ్లకు శ్రీధరుడు గోదావరి ప్రాంతాన పద్మావతీ నదీ తీరాన వేంకటేశుని బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. కాని ఆవిగ్రహం దొంగల పాలు కాగా, శ్రీవేంకటేశ్వరుడు... శ్రీధరుని కలలోకొచ్చి ... నదికి పశ్చిమాన ఉన్న అశ్వత్థ వృక్షంలో శిలారూపంలో ఉన్నానని చెప్పగా,... శ్రీధరుడు ఆ విగ్రహాన్ని తెచ్చి నదికి తూర్పు దిక్కున ప్రతిష్ఠించి పూజించాడు. అలా ఆ ఇరువురికి శాప విమోచనము కలుగుతుంది. శ్రీధరుడు ప్రతిష్ఠించిన విగ్రహము నడుము క్రింది భాగమంతా భూమిలో కూరుకు పోయి.... కాళ్లు కనబడకుండా ఉండేది. అందువలన ఆ క్షేత్రానికి కాళ్లకూరు అనే పేరు స్థిరపడి పోయింది.

చరిత్ర

గతంలో మొగల్తూరు ప్రాంతాన్ని పాలించిన కలిదిండి రంగరాజు ప్రస్తుతమున్న ఈ ఆలయ నిర్వహణకొరకు 83 ఎకరాల భూమిని దానంచేశాడు. నేటికీ ఆ భూమి ఈ ఆలయ ఆధీనంలోనే ఉంది. ఇందులో కొంత భూమిలో వరి పండిస్తుండగా మరి కొంత భూమిలో తోటలు, చేపల చెరువులు ఉన్నాయి. ఈ క్షేత్రానికి పూజలే కాదు కోరిక తీరిన భక్తులు భూములు, ఇతర వసతులు కానుకలుగా సమర్పిస్తున్నారు. తర్వాతి కాలంలో అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి రామలింగరాజు దంపతులు 7.50 లక్షల రూపాయలతో భక్తులకు విశ్రాంతి గృహాన్ని నిర్మించారు. అలాగే జవ్వల పల్లె గ్రామానికి చెందిన గోకరాజు, మహాలక్ష్మమ్మ కుమారుడు నడింపల్లి వెంకట్రామ రాజు ఇచ్చిన 7 లక్షల రూపాయలతో కార్యనిర్వాహక అధికారి కార్యాలయాన్ని నిర్మించారు.

ఆలయ విశిష్టత

పచ్చని పంటపొలాల మధ్యన ఉన్న గ్రామంలో కొలువై ఉండటం ఈక్షేత్రానికి ఒక ప్రత్యేకత అయితే మరొక ప్రత్యేకత స్వామివారికి తల వెనుక భాగంలో స్త్రీలకి వలె కొప్పు ఉండడము. ఈ విధమైన రూపము దేశంలో మరెక్కడాలేదు. అదే విధంగ స్వామి వారి హృదయంలో లక్ష్మీ దేవి రూపం కనిపిస్తుంది. స్వామివారికి కుడి ఎడమల్లో పద్మావతీ, ఆండాళ్ అమ్మ వార్లు దర్శనమిస్తారు. ఈ స్వామి వారు కోరిన కోరికలను నెరవేరుస్తారని ..... పూజలే గాదు ... భక్తులు భూములు ఇతర వసతులు కల్పిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణము రంగు రంగుల పూలతో, పచ్చని మొక్కలతో శోభిల్లుతుంటుంది. ఈ ఆలయ ఆవరణములో మనోహర మైన ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమాచార్య విగ్రహం మనోహరంగా కనిపిస్తుంది. ఇంతటి విశిష్టతలున్న ఈ ఆలయాన్ని తప్పక సందర్శించ వలసినదే.

పూజలు, ఉత్సవాలు

ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ ఏకాదశి, ఆశ్వయుజ శుద్ధ చతుర్ధశి రోజుల్లో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఆ సందర్భంలో తయారు చేసే పొంగలి ప్రసాదానికి ప్రాముఖ్యత ఉంది. దానిని తింటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మిక, ఈ పులిహోర ప్రసాదానికి దేశ విదేశాల్లోను మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. కొంత మంది భక్తులు ఈ పులిహోర పోపు తయారు చేయించుకొని విదేశాలకు కూడా తీసుకెళుతుంటారు. తిరుమలలో శ్రీ వారి లడ్డుకు దేశ విదేశాలలో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఈ ఆలయంలోను పులిహోరకు స్థానికంగా అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో శాంతి కళ్యాణం జరిపిస్తే తమ ఇంట మంచి జరుగు తుందని భక్తుల విశ్వాసం. మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారు ప్రతి ఒక్కరు తమ మొదటి జీతాన్ని ఈ స్వామి వారికి ఇవ్వడము కాళ్లకూరు పరిసర ప్రాంతాల్లో సర్వ సాధారణము.

ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి?

ఈ ఆలయము భీమవరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి కలిదిండి మీదుగా పశ్చిమ గోదావరి లోకి ప్రవేశించగానే ఏలూరుపాడు, జువ్వలపాలెం గ్రామాలు దాటాక ఈ క్షేత్రము కనిపిస్తుంది. భీమవరం నుండి ఈ క్షేత్రానికి ప్రతి అరగంటకు RTC బస్సులుంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories