Kotipalli Temple in East Godavari: కోటిపల్లి కోటీశ్వారాలయం విశిష్టత..

Kotipalli Temple in East Godavari: కోటిపల్లి కోటీశ్వారాలయం విశిష్టత..
x
Highlights

Kotipalli Temple in East Godavari: దేశంలో ఉన్న అన్ని ప్రసిద్ధ హిందూ దేవాలయాలన్నింటికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.

Kotipalli Temple in East Godavari: దేశంలో ఉన్న అన్ని ప్రసిద్ధ హిందూ దేవాలయాలన్నింటికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాంటి ఆలయాల్లో కోటిపల్లి కోటీశ్వారాలయం కూడా ఒకటి. ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామ క్షేత్రానికి సమీపంలో గౌతమీ నదీ తీరాన వెలసింది.

స్థల పురాణము

ఈక్షేత్రము పూర్వ కాలంలో కోటి తీర్థం గాను సోమ ప్రభాపురముగాను పిలువబడి, నేడు కోటిపల్లి మహా క్షేత్రముగా ఖ్యాతి గాంచింది. ఈ క్షేత్రంలో గౌతమీ పుణ్య నదిలో విష్ణు తీర్థ, రుద్ర తీర్థ, బ్రహ్మ తీర్థ, మహేశ్వర తీర్థత, రామ తీర్థ మొదలగు అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో అంతర్వాహినులుగా ప్రవహించు చున్న కారణంగా దీనికి కోటి తీర్థ క్షేత్రముగా ప్రఖ్యాతి వచ్చింది. కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరస్వామివారు, అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిఉన్నది. ఈ మూడు విగ్రహాలను ఇంద్రుడు,చంద్రుడు, కశ్యపమహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు.

ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టు కోవడానికి ఉమా సమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని, రాజరాజేశ్వరి సమేతుడైన సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్ఠించి తన పాపాలు పోగొట్టుకొన్నాడని అంటారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన సిద్ధి జనార్దన స్వామి వారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించాడని, ఆయనే క్షేత్రపాలకుడని చెబుతారు.

ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. గోదావరిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసింది గౌతమ మహర్షి అని చెబుతారు. శ్రీగౌతమీ మాహాత్మ్యంలో ఈ విధంగా చెప్పబడింది: ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తారో వారి సర్వ పాపాలు పోతాయని. ఈ క్షేత్రంలో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరడం వల్ల ఈ క్షేత్రానికి కోటి తీర్థం అని కూడా పేరు.

క్షేత్ర విశిష్టత

ఈ ఆలయ ప్రాంగణములో ఉమాసమేత కోటీశ్వరాలయము, శ్రీదేవి, భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం, నాగలింగం, భోగలింగము ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయము ముందొక ధ్వజస్తంభము, నందీశ్వరుడు, కొలను ఉన్నాయి. ఈ రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరాలయములో దసరా ఉత్సవములు, కార్తీక దీపోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆలయానికి ఎదురుగా సోమగుండం అనే ఒక పెద్ద చెరువు ఉంది.ఈ దేవాలయములో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రి రోజు రాత్రి ఈ దేవాలయ ప్రాంగణంలో కోటి దీపాలు వెలిగిస్తారు. ద్రాక్షారామం చుట్టూ ఉన్న అష్ట సోమేశ్వరాలలో కోటిపల్లి ఒకటి.

ఆలయ విశేషాలు.. పూజలు, అర్చనలు

ఈ పవిత్ర గౌతమీ తీర్థం లోని పుణ్య స్నానం సర్వపాపాలను తొలగించి పుణ్యాన్ని ఇస్తుంది. శివ, కేశవ భేదం లేదని ఈ క్షేత్రం మనకు పున: పున: చెబుతుంది. కోటీశ్వర లింగం యోగ లింగం అని, సోమేశ్వర లింగం భోగ లింగం అని, రాజరాజేశ్వరమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లి అని భక్తుల నమ్మిక. అర్చకులు ప్రతీరోజు ప్రాతః కాలమందే కోటి తీర్థం నుండి జలాలు తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం, అర్చన చేస్తారు. సాయం సంధ్య వేళ స్వామికి ధూప సేవ, ఆస్థాన సేవ, పవళింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పురాతన కాలం నుండి ఈ పవిత్రక్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సోమప్రభాపురం అని పిలిచేవారు. ఇక్కడ సోమ కుండం అనే ఒక పెద్ద పుష్కరిణి నేటికీ ఉంది. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు. ఆలయంలో నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉన్నాయి. ఉత్తర మండపంలో కాలభైరవ స్వామి మందిరం ఉంది. ఈ దేవాలయం లోనే చంద్రమౌళీశ్వర స్వామి శంకరాచార్యుల మందిరం, ఉమా సమేత మృత్యుంజయ లింగం, నవగ్రహాల గుడి ఉన్నాయి.

ఎలా వెళ్లాలి ?

కోటిపల్లి మహా క్షేత్రము తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం మండలంలో ద్రాక్షారామ క్షేత్రానికి సమీపంలో గౌతమీ నదీ తీరాన ఉంది. కాకి నాడ నుండి బస్సు సౌకర్యమున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories