అర్ధచంద్రాకారంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిక్షేత్రం ఎక్కడుందంటే

అర్ధచంద్రాకారంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిక్షేత్రం ఎక్కడుందంటే
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం కూడా ఒకటి. గోదావరి పరివాహక ప్రాంతంలో, పచ్చని పకృతి అందాల మధ్య ఈ...

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం కూడా ఒకటి. గోదావరి పరివాహక ప్రాంతంలో, పచ్చని పకృతి అందాల మధ్య ఈ ఆలయం వెలసిల్లింది. ఆ ఆలయం ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూర్ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రానికి 135 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరునాగారం - భద్రాచలం ప్రధాన రహదారిని అనుకొని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రం పై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

స్థలపురాణం

ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు. ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇక్కడి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూగా వెలిశాడట. శాతవాహన శక ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చినారట. మహారాజు 76 వేల సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతున్నది. ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు. ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు. స్వామివారికి ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అను ఇద్దరు భార్యలు ఉన్నారు. క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయ స్వామి, షిఖాంజనేయ స్వాములున్నారు. క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాలస్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణాన నార నర్సింహ క్షేత్రాలు ఉన్నాయి.

ఆలయ ప్రత్యేకతలు

నవనారసింహులు క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల నృసింహస్వామిని చెపుతారు. స్వామివారి మూర్తి మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసిన మెత్తగా మానవ శరీరం లాగా అనిపిస్తుందట. స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రం ఉంటుంది. దీనినుంచి ఓ ద్రవం విడుదలవుతూ ఉంటుంది. దీనిని అదుపుచేయడానికి స్వామివారి ఆ రంధ్ర భాగంలో మంచి గంధాన్నుంచుతారు. పూర్వకాలంలో ఈ మూర్తి వెలికితీసే క్రమంలో స్వామివారి మూర్తిమీద రంధ్రం పడిందట. ఆనాటినుంచి ఆ రంధ్రంనుంచి ఓ ద్రవం కారుతుందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. స్వామి వారి ఆ రంధ్రంలో ఉంచిన మంచి గంధానే్న భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.

ఈ మల్లూరులో ఉన్న శ్రీ హేమాచల నృసింహ క్షేత్రంలో ఉన్న ప్రత్యేక ఆకర్షణ ఇక్కడున్న చింతామణి జలపాతం. దట్టమైన అడవిలో కొండలపైనుంచి వస్తున్న ఈ జలధారను చింతామణి జలపాతంగా చెబుతారు. ఈ జలపాతంలో భక్తులు భక్తిస్నానాలు చేస్తారు. ఈ జలధార విశేషమైన ఔషధ గుణాలు కల్గినదని, దీనిని సేవిస్తే సమస్త రోగాలు మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. దీనికి సమీపంలోనే మరో చిన్ని జలపాతం ఉంది.

చింతామణి జలపాతానికి సమీపంలో మహాలక్ష్మిదేవి పురాతన మందిరం ఉంది. హేమాచల నృసింహ క్షేత్రంలో ఇతర దేవతా మందిరాలు కూడా ఉన్నాయి. ఈ దివ్యాలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం, మహాలక్ష్మి, గోదాదేవి మందిరాలు కూడా దర్శనమిస్తాయి. ఆ దివ్యాలయాల సందర్శనం పూర్వ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఈ క్షేత్రంలో ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమికి స్వామివారికి అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో దట్టమైన అడవిలో శిఖాంజనేయస్వామి మందిరం ఉంది. ఇది అతి పురాతనమైనది. స్వామివారి మూర్తి ఏ కాలంనాటిదని చెప్పడానికి ఇతమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ హేమాచల నరసింహస్వామి మూర్తి కాలంనాటిదిగా చెబుతారు.

బ్రహ్మోత్సవాలు

శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ నిర్వాహకులు ప్రతీ యేటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ పూజారులు నర్సింహస్వామి జయంతి, స్వామి వారి కల్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, నాక భలి (నాగబెల్లి), వసంతోత్సవం, నిర్వహిస్తారు.

హేమాచల క్షేత్రాన్ని దర్శించిన రాణి రుద్రమదేవి

మల్లూరు హేమాచల క్షేత్రాన్ని కాకతీయ రాణి రుద్రమదేవి సందర్శించడమే కాక ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలనను సాగించిన కాకతీయ రాజుల ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్ర ప్రాంతం ఉండేది. ఈ హేమాచల క్షేత్రం పై గోన గన్నారెడ్డి నేతృత్వంలో సైనిక స్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గుట్ట శిఖరం పై కాకతీయ రాజులు.. కొనేరు, అర్ధ మండపం, గుర్రపు శాలలు, రాక్షస గుహలు నిర్మించి శత్రు రాజ్యాలతో యుద్ధం చేయడానికి ఇక్కడ వ్యూహ రచనలు చేసేవారని చెబుతున్నారు. గోదావరికి కేవలం కోసుపెట్టు దూరంలో ఉన్న ఈ క్షేత్ర శిఖరం నుంచి గోదావరి అవతలి వైపు నుంచి కాకతీయ రాజ్యం వైపు దూసుకొచ్చే శత్రు సైన్యాలను గుర్తించడానికి దర్పణం ద్వారా వీక్షించే వారని తెలుస్తుంది. శత్రు రాజ్యాలతో జరిగే యుద్ధ కాలంలో రక్షణ కోసం రాణి రుద్రమదేవి సహా ప్రధాన సైనికాధిపతులు ఇక్కడి కోటలో విడిది చేసేవారట.

17వ శతాబ్దంలో గజనీమహమ్మద్ రాక

కాకతీయుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో గజనీ మహ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, కోటగుళ్ల లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు. పైగా బంగారు బిస్కెట్లు ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లు చెబుతున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధ చంద్ర నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండడమే ఇందుకు కారణం.

చింతామణి జలపాతం

హేమాచల క్షేత్రంలోని చింతామణి జలపాతం (అక్కథార - చెల్లెధార) ను సర్వరోగనివారిణిగా పరిగణిస్తారు. కాశీ, గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవి నమ్ముతారు. వంద రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్ని నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం యేడాది పొడవునా పారుతూనే ఉంటుంది. హేమాచల క్షేత్ర దర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుంది. ఈ క్షేత్రం పై భక్తుల ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమి పై ఒత్తిడి పెరిగి అడుగు నుంచి జలాలు ఎక్కువగా ఉబికి వస్తాయట.

Show Full Article
Print Article
Next Story
More Stories