ఫిబ్రవ‌రి 1న రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

ఫిబ్రవ‌రి 1న రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి
x
Highlights

తిరుమల, 2020 జ‌న‌వ‌రి 21: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 1న‌ రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా...

తిరుమల, 2020 జ‌న‌వ‌రి 21: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 1న‌ రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ర‌థ‌స‌ప్త‌మి ఏర్పాట్ల‌పై అద‌న‌పు ఈవో సమీక్ష నిర్వహించారు.

స‌మావేశం అనంత‌రం అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తిఏటా మాఘ శుద్ధ స‌ప్త‌మినాడు తిరుమ‌ల‌లో ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌న్నారు. క్రీ.శ 1564 నుండి తిరుమ‌ల‌లో ఈ ప‌ర్వ‌దినాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు శాస‌నాధారాలు ఉన్నాయ‌ని తెలిపారు. శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఒకేరోజు ఏడు ప్ర‌ధాన వాహ‌నాల‌పై ఊరేగే కార‌ణంగా దీన్ని ఒక‌రోజు బ్ర‌హ్మోత్స‌వాల‌ని, ఉప బ్ర‌హ్మోత్స‌వాల‌ని పిలుస్తార‌ని వివ‌రించారు. సూర్య‌ప్ర‌భ వాహ‌నంతో మొద‌లై రాత్రి చంద్ర‌ప్ర‌భ వాహ‌నంతో వాహ‌న‌సేవ‌లు ముగుస్తాయ‌ని తెలిపారు. వాహన సేవ‌లను తిలకించేందుకు ఉదయం 4 నుండి రాత్రి 9 గంటల వరకు గ్యాలరీల్లో భ‌క్తులు వేచి ఉంటార‌ని, ఎండ‌కు ఇబ్బందిప‌డ‌కుండా జ‌ర్మ‌న్ షెడ్లు ఏర్పాటుచేశామ‌ని, టి, కాఫి, అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు నిరంతరాయంగా పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు తిల‌కించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహ‌న‌సేవ‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌ని అద‌న‌పు ఈవో తెలిపారు. మెరుగైన పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌న్నారు. వాహ‌న‌సేవ‌ల ఎదుట ఆక‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. టిటిడి నిఘా, భ‌ద్ర‌తా విభాగం అధికారులు పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని మెరుగైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని ఆదేశించామ‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు 3500 మంది శ్రీ‌వారి సేవ‌కులు, 300 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవ‌లను వినియోగించుకుంటామ‌ని తెలిపారు. ఈ ప‌ర్వ‌దినం కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలో క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, బ్ర‌హ్మోత్స‌వం, వ‌సంతోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవలను రద్దయ్యాయ‌ని, సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తామ‌ని వివ‌రించారు. అదేవిధంగా, వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దాత‌ల‌కు ప్రత్యేక దర్శనాలను ర‌ద్దు చేశామ‌ని తెలిపారు.

రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు :

సూర్యప్రభ వాహనం ఉదయం 5.30 గం||ల నుంచి 8.00 గం||ల వరకు

చిన్నశేష వాహనం ఉదయం 9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు

గరుడ వాహనం ఉదయం 11.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు

హనుమంత వాహనం మధ్యాహ్నం 1.00 గం||ల నుంచి 2.00 గం||ల వరకు

చక్రస్నానం మధ్యాహ్నం 2.00 గం||ల నుంచి 3.00 గం||ల వరకు

కల్పవృక్ష వాహనం సాయంత్రం 4.00 గం||ల నుంచి 5.00 గం||ల వరకు

సర్వభూపాల వాహనం సాయంత్రం 6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు

చంద్రప్రభ వాహనం రాత్రి 8.00 గం||ల నుంచి 9.00 గం||ల వరకు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories