కరోనా వైరస్ లాక్ డౌన్.. వైరల్ అవుతున్న'వడియాల' వీడియోలు!

కరోనా వైరస్ లాక్ డౌన్.. వైరల్ అవుతున్నవడియాల వీడియోలు!
x
lockdown lo vadiyalu (images from youtube and krithika facebook)
Highlights

తెలుగు వారికి వడియాలు అంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంటా వడియాలు పెట్టడం కచ్చితంగా జరుగుతుంది. నగరాల్లో ఆ సందడి కాస్త...

తెలుగు వారికి వడియాలు అంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంటా వడియాలు పెట్టడం కచ్చితంగా జరుగుతుంది. నగరాల్లో ఆ సందడి కాస్త తక్కువే అయినా, ఇప్పటికీ పల్లెల్లో ఈ వడియాలు పెట్టడం ఒక పండగలా సాగుతుంది. ఏడాదికి సరిపడా వడియాలు.. పచ్చళ్ళు ఎండా కాలంలో పట్టేసుకుని అట్టేపెట్టేసుకుంటారు. అసలే కరోనా వైరస్ గోలతో చావో బ్రతుకో అని చూస్తుంటే ఈ వడియాల గోల ఏమిటా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం..

కరోనాతో లాక్ డౌన్ విధించి.. అందర్నీ ఇంటికే పరిమితం అవ్వండి అని ప్రభుత్వం చెప్పింది. మీ కోసమే ఇదంతా అని ఎంత మొత్తుకున్నా దాదాపు 30 శాతం ప్రజలు ఎదో వంక తో రోడ్లేక్కేస్తూనే ఉన్నారు. ఇటువంటి వారిని పోలీసులు పట్టుకుని కౌన్సెలింగ్ ఇస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో ఒకచోట ఒక యువతి స్కూటీ పై చక్కగా రోడ్డుమీద చక్కర్లు కొడుతుంటే పోలీసులు ఆపారు. అమ్మా ఎక్కడికి వెళ్లావు అని అడిగారు. దానికి ఆ అమ్మాయి మొదట మందులకు అని అబద్ధం చెప్పింది. తరువాత మందుల చీటీ చూపించమని అడిగితె, ఇక లాభం లేదనుకుని అసలు విషయం చెప్పింది. వడియాలు పెట్టడానికి చుట్టాలింటికి వెళ్లి వస్తున్నానని చక్కగా చెప్పేసింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ వీడియో కూడా వైరల్ అయిపొయింది..

దీనిని బేస్ చేసుకుని కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క కూతురు సౌమ్య(బేబీ కృతిక) ఇంట్లో నుంచే ఓ వీడియో చేసి వదిలింది. చక్కగా డ్రాయింగ్ వేసుకుంటున్న ఆమెను తండ్రి ఏం చేస్తున్నావు తల్లీ అని అడిగాడు. దానికి సౌమ్య డ్రాయింగ్ వేసుకుంటున్నా డాడీ అని సమాధానం ఇచ్చింది. చిన్న ప్రశ్న అడుగుతాను జవాబు చెబుతావా అని అడిగాడు ఆమె తండ్రి. అడుగు డాడీ అంది సౌమ్య. నమ్మకం అంటే ఏమిటి తల్లీ అని అడిగాడాయన. దానికి కొద్దిగా ఆలోచించిన సౌమ్య నమ్మకమంటే వడియాలు అని చెప్పింది. దానికి ఆశ్చర్యపోయిన తండ్రి ఎలా అని అడిగాడు. దానికి సౌమ్య ఇలా చెప్పింది..''అసలే కరోనా వైరస్ గోలతో ప్రపంచమంతా భయపడి పోతుంటే.. మన తెలుగు ప్రజలు మాత్రం సంవత్సరానికి సరిపడే వడియాలు, పచ్చళ్ళు తయారు చేసుకుంటున్నారు డాడీ. అంటే మనల్ని కరోనా ఏమీ చేయదు అనే నమ్మకమే కదా అందుకే వడియాలు నమ్మకానికి మారుపేరు అని చెబుతున్నా'' అంది.

ఈ వీడియో చూస్తే అది నిజమని మీరూ అంటారు. ఇక ఇదిలా ఉంటె ఈ సందర్భంగా వడియాలకూ తెలుగు ప్రజలకూ ఉండే అవినాభావ సంబంధాన్ని చెప్పే సీన్ ఒకటి మీకు గుర్తుచేస్తాం. అప్పట్లో అన్న ఎన్టీఅర్ నటించిన యమగోల అనే సినిమా వచ్చింది. సూపర్ హిట్ సినిమా ఇది. యమలోకంలో అన్న చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్టీఅర్ ఎంత సందడి చేస్తారో అంత కంటే ఎక్కువ సూర్యాకాంతం చేస్తారు. తనను యమలోకానికి తీసుకువచ్చిన భటులతో ఆమె చేసే నటన సూపర్ గా ఉంటుంది. ఈ సందర్భంలో ఆమె యమలోకానికి కూడా వడియాలు పట్టుకుని వచ్చేస్తుంది. దీంతో యమ భటులు మా రూల్స్ ఒప్పుకోవు అంటారు. అయినాగానీ సూర్యాకాంతం మాత్రం ఒడియాలు లేకపోతె నేను బ్రతకలేను బాబోయ్ అంటూ ఉంటుంది. ఈ సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. మన తెలుగు ప్రజలకూ వడియాలకూ ఉన్న చక్కని సంబంధాన్ని ఈ సీన్ మనకు చెబుతుంది.

మొత్తమ్మీద కరోనా కల్లోలం లోనూ తెలుగు ప్రజల ఆత్మస్థైర్యాన్ని ఈ వడియాల సంస్కృతి మరో మారు ప్రపంచానికి చాటి చెబుతోంది. ఈ వడియాల వీడియోలు ఇప్పుడు లాక్ డౌన్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి మీరూ చూసేయండి..

Show Full Article
Print Article
Next Story
More Stories