Teachers Day 2020: తరాలు మారినా తరగని బాధ్యతకు మరో రూపు టీచర్!

Teachers Day 2020: తరాలు మారినా తరగని బాధ్యతకు మరో రూపు టీచర్!
x

Happy Teachers Day

Highlights

Teachers Day 2020 | ఉపాధ్యాయుడు అంటే నిలువెత్తు బాధ్యతకు ప్రతిరూపం!

ఆశ్రమాలు పాఠశాలలుగా...పాఠశాలలు కార్పోరేట్ సంస్థలుగా..ప్రకృతి ఒడిలో అఆలు దిద్దడం.. పలకాబలపంతో అక్షరమాల అద్ధడం గా..కీబోర్డుమీద వేళ్ళతో పదాల సరిగమలుగా మారడం దాకా విద్య అర్థం మారిపోయింది. విద్యార్థుల తీరూ మారిపోయింది. కానీ మారనిది ఉపాధ్యాయుల బాధ్యతే! ఆశ్రమాల్లో గురుశిష్యుల బంధం అయినా.. పాఠశాలలో ఉపాధ్యాయ, విద్యార్థి సంబంధం అయినా.. కార్పొరేటు కాన్వెంట్ లో టీచర్ స్టూడెంట్ మధ్య ఉండే బాండింగ్ అయినా అన్నిటి మధ్య సారూప్యత మాత్రం ఒకటే భావితరాలకు బంగారు బాట వేయాలనే ఉపాధ్యాయుడి తపన. తన విద్యార్థి ఉన్నతంగా ఎదగాలనే ప్రయత్నం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మారని టీచర్ బాధ్యత.

సినిమాల్లో టీచర్లను ఎంత జోవియల్ గా చూపించినా.. కుర్రకారు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటపుడు టీచర్లను ఎంతగా ఎగతాళిగా మాట్లాడుకున్నా అది అక్కడివరకే. తరగతి గదిలో చేరిన తరువాత ఇప్పటికీ అధ్యాపకుడి మీద విద్యార్థికి అదే గౌరవం. తరాలు మారినా అంతరాలు పెరిగిన గురుశిష్య సంబంధం మాత్రం మారదు.

తన దగ్గర చదువుకున్న పసివాడు గర్వించే అధికారిగా మారితే ఎంత సంతోషిస్తారో.. పొరపాటునో గ్రహపాటునో ఒక్క విద్యార్థి పెడతోవన పడ్డాడని తెలిస్తే అంతకు ఎక్కువగా బాధపడేవాడు ఉపాధ్యాయుడు ఒక్కడే. ఒక వ్యక్తీ ఎదుగుదలకు మనస్ఫూర్తిగా సంతోషించే వాడు.. ఒక మనిషి దిగజారుడుతనానికి కుమిలిపోయే వాడు టీచర్ ఒక్కడే. దానికి వారెవరూ తన కులం కానక్కర్లేదు.. తన మతం కానక్కర్లేదు.. తన బంధువూ అవ్వక్కర్లేదు. తన విద్యార్ధి అయితే చాలు. తన స్టూడెంట్ ఓటమిని తనదిగా భావించి కన్నీరు పెడతాడు.. తన విద్యార్థి విజయాన్ని చూసి గర్వంతో తల ఎగరెస్తాడు. ముందే చెప్పినట్టు తనకి ఉన్న ప్రాధామ్యం తను ఓనమాలు నేర్పిన పిల్లాడి భవితే!

కాలంతో పాటు కొంతవరకూ ధోరణులు మారుతున్నాయి. కానీ, పూర్తిగా ఆ విలువలు దిగజారలేదు. ఇప్పటికీ తన వాక్కుతో.. తన హృదయంతో.. తన మేధస్సుతో భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఉపాధ్యాయలోకానికి ప్రతి ఒక్కరూ క్రుతజ్ఞులై ఉంటారు. ఇప్పటికీ ఉపాధ్యాయ-విద్యార్థి బంధాన్ని బాధ్యతగా భావిస్తూ ఎన్నో ఇక్కట్ల మధ్య ఆ బాధ్యతను నిలుపుకుంటూ వస్తున్న అంధకార మవుతున్న వ్యవస్థల్లో చిరుదివ్వెల్లా మార్గదర్శకత్వం వహిస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికీ టీచర్స్ డే సందర్భంగా HMTV శుభాకాంక్షలు చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories