Viral Video: 10 నిమిషాల డెలివరీ కోసం ఇంత రిస్కా? వైరల్ వీడియో చూసి జనాలు షాక్

Viral Video: 10 నిమిషాల డెలివరీ కోసం ఇంత రిస్కా? వైరల్ వీడియో చూసి జనాలు షాక్
x
Highlights

10 నిమిషాల డెలివరీ కోసం ఇంత రిస్కా? వైరల్ వీడియో చూసి జనాలు షాక్

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రం చూసేవారికి ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక డెలివరీ బాయ్ రోడ్లపై రోలర్ స్కేటింగ్ చేస్తూ బుల్లెట్‌లా దూసుకుపోతున్నాడు. నిమిషాల్లో డెలివరీ చేయాలనే ఒత్తిడి వల్లనో లేక తనకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించడానికో కానీ, అతను చేస్తున్న ఈ సాహసం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు అతన్ని హృతిక్ రోషన్ క్రిష్ సినిమాతో పోలుస్తున్నారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం క్విక్ కామర్స్ లేదా 10 నిమిషాల డెలివరీ సేవలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సర్వీసుల వల్ల డెలివరీ ఏజెంట్లపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని, అది రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ఒక ఆశ్చర్యకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో బ్లింకిట్ సంస్థకు చెందిన టీ-షర్టు ధరించిన ఒక యువకుడు, తన వీపున డెలివరీ బ్యాగ్ తగిలించుకుని రోలర్ స్కేటింగ్ చేస్తూ బిజీ రోడ్డుపై వెళ్తున్నాడు. వాహనాల మధ్య నుంచి అతను చాలా వేగంగా, చాకచక్యంగా దూసుకుపోతుండటం వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతని టాలెంటును చూసి ఆశ్చర్యపోతుంటే, మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ఆ యువకుడు కనీసం హెల్మెట్ కానీ, మోచేతులకు లేదా మోకాళ్లకు ప్యాడ్స్ కానీ ధరించలేదు. రోడ్డుపై చిన్న రాయి తగిలినా లేదా ఏదైనా వాహనం స్వల్పంగా తగిలినా అతను తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంది. ఈ సాహసం ఒకరి ప్రాణాల మీదికే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ఇబ్బంది కలిగించవచ్చని రోడ్డు భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ యువకుడు సరదా కోసం ఇలా చేస్తున్నాడా లేక పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడా అనేది స్పష్టంగా తెలియలేదు. కొందరు యూజర్లు మాత్రం, ఇలాంటి నైపుణ్యం ఉన్నవారిని కంపెనీలు ప్రోత్సహించాలని, అయితే సరైన శిక్షణ, రక్షణ పరికరాలు ఇస్తే ఇది భవిష్యత్తులో నగరాల్లో వేగంగా డెలివరీ చేయడానికి ఒక మంచి పర్యావరణ హితమైన మార్గం అవుతుందని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా, ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఇలాంటి సాహసాలు ఎప్పటికీ ప్రమాదకరమే.

Show Full Article
Print Article
Next Story
More Stories