రేవ్ పార్టీలంటే కొందరికి ఎందుకంత క్రేజ్... వీటిలో ఇల్లీగల్ ఏంటి?
రేవ్ పార్టీలు రోజువారీ జీవితంలోని ఒత్తిడిని మటుమాయం చేస్తాయని వాటిలో పాల్గొనే వాళ్ళు చెబుతుంటారు. ఆ పార్టీలో ఉల్లాసంగా గడిపే ప్రతి క్షణం జీవితానికి కొత్త శక్తినిస్తుందని భావిస్తారు.
రేవ్ పార్టీ అంటే కొందరికి ఎందుకంత మోజు? అసలు ఈ పార్టీలలో ఏం జరుగుతుంది? కోట్లు ఖర్చు చేసి రేవ్ పార్టీలు ఎందుకు నిర్వహిస్తారు? ఈ పార్టీల్లో పాల్గొనడానికి సెలబ్రిటీలు, వీఐపీలు ఎందుకు ఆసక్తి చూపుతారు? కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయల టికెట్ కొనుక్కుని మరీ ఎందుకు వెళతారు? రేవ్ పార్టీల్లో పాల్గొంటే లైఫ్ లో స్ట్రెస్ అంతా మాయమైపోతుందా? కొత్త ఎనర్జీ వస్తుందా? ఇలాంటి పార్టీల మీద పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు? వీటిలో ఇల్లీగల్ ఏంటి?
రేవ్ పార్టీలను ఎందుకు ఇష్టపడతారు?
సన్ సెట్ టూ సన్ రైజ్... పేరుతో బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీ మీదకు సిటీ క్రైమ్ బ్రాంచ్ – సీసీబీ రైడ్ చేసి దాదాపు 150 మంది మీద ఆరోపణలు నమోదు చేసింది. వారిలో సినిమా, టీవీ తదితర రంగాలకు చెందిన తెలుగు ప్రముఖులు ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి. వారిలో కొందరి పేర్లు స్పష్టంగా పోలీసుల రికార్డులకెక్కాయి. ఇంతకీ, సెలెబ్రిటీలు, డబ్బున్నవాళ్ళు ఈ పార్టీలంటే ఎందుకు ఇష్టపడతారు? ఈ క్రేజ్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?
రేవ్ పార్టీలు రోజువారీ జీవితంలోని ఒత్తిడిని మటుమాయం చేస్తాయని వాటిలో పాల్గొనే వాళ్ళు చెబుతుంటారు. ఆ పార్టీలో ఉల్లాసంగా గడిపే ప్రతి క్షణం జీవితానికి కొత్త శక్తినిస్తుందని భావిస్తారు. బిడియం, సంకోచం వదిలేసి హుషారుగా జరుపుకునే ఈ వేడుక వల్ల స్నేహ బంధాలు మరింత బలపడతాయనే అభిప్రాయాలూ వినిపిస్తుంటాయి. అంతేకాదు, ఈ పార్టీల్లో పాల్గొంటే ఏదో ఒక స్పిరిచ్యువల్ హైట్ ను అందుకున్నట్లు అనిపిస్తుందనీ కొందరు చెబుతారు. చెవులు దద్దరిల్లే సంగీతపు హోరు, ఒంటికి రెక్కలు వచ్చినట్లుగా చేసే డాన్సులతో ఈ పార్టీ యానిమల్స్ తాము సాధారణ జీవితం నుంచి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయిన అనుభూతికి లోనవుతారు. అదే ఈడీఎం మహిమ అని చెబుతుంటారు.
ఈడీఎం అంటే ఏంటి?
రేవ్ పార్టీ అంటేనే ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ అని అర్థం. దీన్నే క్లుప్తంగా ఈడీఎం అంటారు. ఈ మాట 1970లలో వాడుకలోకి వచ్చిందని చెబుతారు. క్రాఫ్ట్ వేర్, జార్జియో మోరోడర్ వంటి ఎలక్ట్రానిక్ మ్యూజిక్ సింథసైజర్లు, ఇతర పరికరాలతో ప్రయోగాలు ప్రారంభించిన సమయంలో ఈడీఎం వెలుగులోకి వచ్చిందని అంటారు. 1980లలో టెక్నో, హౌస్ మ్యూజిక్ ఈడీఎం శకం వచ్చేసింది. ఈ ఎలక్ట్రానికి సంగీతం హోరులో డీజేలు ప్రతి క్షణంలో ప్రతి శబ్దాన్నీ నియంత్రిస్తూ ప్లే చేస్తారు. ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ పెంచాలో బాగా తెలిసిన వాళ్ళు ఈ మ్యూజిక్‌తో జనానికి పిచ్చెక్కిస్తారు.
మ్యూజిక్ పై ప్రేమ
రేవ్ పార్టీలో దుమ్ము రేపే సంగీతానిదే కీలక పాత్ర. దద్దరిల్లే మ్యూజిక్ లేకుండా రేవ్ పార్టీ అనేదే ఉండదు. పల్సింగ్ టెక్నో, డబ్సెప్ట్, హౌస్, హర్డ్ కోర్ మ్యూజిక్ ప్లే చేస్తుంటే.. పార్టీకి వచ్చిన వాళ్ళ ఒళ్ళు మరిచి డాన్స్ చేస్తుంటారు.
మ్యూజిక్ లవర్స్ కు మోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ ను డిఫరెంట్ స్టయిల్స్ లో ప్లే చేసే టాలెంటెడ్ డీజేలు ఈ పార్టీల్లో ఉంటారు. భారీ రేవ్ సౌండ్ సిస్టమ్స్ ద్వారా మ్యూజిక్ వింటుంటే పార్టీలో ఉన్న వారికి ఎక్కడలేని జోష్ వస్తుంది. ఆ ధ్వని ప్రపంచంలో వారంతా గాల్లో తేలిపోతుంటారు. ఆ అనుభవం ఏడాదికో రెండేళ్ళకో ఒక్కసారైనా సొంతం చేసుకోవాలని రేవ్ ప్రియులు ఎదురు చూస్తుంటారు.
కట్టుబాట్ల నుంచి స్వేచ్ఛ
ఈ పార్టీల్లో పాల్గొనేవారు తమ మనసులో ఉన్న మాటలను ఎలాంటి సంకోచం లేకుండా చెప్పుకుంటారు. ఈ వాతావరణ వారికి అలాంటి మానసిక స్థితిని కల్పిస్తుంది. అందరూ ఓపెనప్ అయినట్లు బిహేవ్ చేస్తుంటారు కాబట్టి, సామాజిక కట్టుబాట్లు, మొహమాటాలు ఈ సంబరంలో చెల్లాచెదురైపోతాయి.
డెయిలీ రొటీన్ లైఫ్ నుంచి ఇదంతా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా ఉంటుందో ఈ పార్టీలో పాల్గొంటే తెలుస్తుందని కొందరు అంటారు. ఆటా పాటా అంతా ఇక్కడ ఆర్ట్ ఫామ్‌కు అత్యున్నత స్థాయిలో ఉంటుందన్నది రేవ్ పార్టీ ప్రేమికుల అభిప్రాయం.
స్ట్రెస్ నుంచి రిలీఫ్
రేవ్ పార్టీలోకి అడుగు పెట్టగానే కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. డిమ్ లైట్ల వెలుతురులో మ్యూజిక్ వినిపిస్తుంది. ఈ మ్యూజిక్ కు అనుగుణంగా బాడీ ఊగిపోతుంది. ఈ హుషారు మూలంగా మనలో గడ్డ కట్టుకున్న స్ట్రెస్ అంతా ఇట్టే కరిగిపోతుందని అంటారు.
ఇంతవరకూ ఒక కథ. ఇక్కడి నుంచి ఈ పార్టీ కథ మరో ఎపిసోడ్‌లోకి అడుగు పెడుతుంది. అదే అపరిమిత ఆల్కహాల్. ఈ పార్టీ ఆహ్వానం అందుకున్న వారు ఇక్కడ లిక్కర్ ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. రకరకాల బ్రాండ్లు అందుబాటులో ఉంచడం ఈ పార్టీల్లో ఆనవాయితీ. దీనితో కూడా పంచాయితీ లేదు. కానీ, ఆ తరువాత ఘట్టంతోనే సమస్య మొదలవుతుంది. సిస్టమ్ ఎంటరవుతుంది. అదే డ్రగ్స్ ఎపిసోడ్. రేవ్ పార్టీల్లో కొకైన్, చరస్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు తప్పనిసరిగా సప్లై చేస్తారని, అవి లేకుండా అది రేవ్ పార్టీయే కాదని చాలా మంది చెబుతుంటారు.
ఆర్ధరాత్రిలో లేజర్ షోలు... క్రాకర్స్
చీకట్లో లేజర్ లైట్ల వెలుగులతో పాటు బాణసంచాను కూడ కాల్చుతారు. మ్యూజిక్ అండా డాన్స్ తో పాటు డ్రగ్స్ మ్యాజిక్ తో సాగే ఈ పార్టీలలో లేజర్ షోలు, బాణాసంచా కాల్చడాలనేవి ఓ స్పెషల్ అట్రాక్షన్. అలా ఈ పార్టీలలో మనసుకూ, శరీరానికీ ఊహించని స్థాయిలో ఉద్వేగాన్ని అందించే వాతావరణాన్ని సృష్టిస్తారు. అదొక మాయ. దాన్ని ఒకసారి రుచి చూస్తే ఆవాయిడ్ చేయడం కష్టం.
స్నేహాలు, కొత్త పరిచయాలు
ఈ వాతావరణంలోకి వచ్చే ముందే అందరూ ఒక రకమైన మానసిక స్థితితో వస్తారు. ఈ పార్టీ మ్యాజిక్ లో కాసేపు గడిపాక అక్కడున్న వారంతా లైక్ మైండెడ్ పీపుల్ గా కనిపిస్తారు. తమవంటి ఉల్లాసవంతమైన మనుషులతో నిండిన మరో ప్రపంచమే ఇదనే ఫీలింగ్ అక్కడున్న వారికి వచ్చేస్తుంది. దాంతో, ఈ వాతావరణంలో స్నేహం బలపడుతుందనీ, కొత్త బంధాలు మొదలవుతాయనీ చాలా మంది చెబుతుంటారు. అరమరికలు లేకుండా మాట్లాడుకోగలిగే వాతావరణంలో స్నేహం మరి కొన్ని మెట్లు ముందుకు వెళ్తుందనడంలో సందేహం లేదు.
నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ
బయటి సమాజంలో కొన్ని రకాల దుస్తులు తమకు నచ్చినా సరే వేసుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. కానీ, ఈ మరో ప్రపంచంలో మగవాళ్ళు, మహిళలు తమకు నచ్చినట్లుగా దుస్తులు వేసుకుంటారు. నచ్చినట్లు దుస్తులు వేసుకునే స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం రాజీ పడాల్సిన పని ఉండదు. ఈ పార్టీలకు వచ్చే వారికి డ్రెస్ కోడ్ ఏమీ ఉండదు. దాంతో, పార్టీకి వచ్చే వారు తమకు లేటెస్ట్ ఫ్యాషన్ అనిపించిన డ్రెస్ తో ముస్తాబై రావచ్చు. ఇష్టమైన దుస్తులు వేసుకోవచ్చు. ఇష్టమైనది తినొచ్చు, తాగొచ్చు. ఇష్టమైన వారితో మాట్లాడొచ్చు. ఒక్కటేమిటి, మొత్తంగా ఇష్ట ప్రకారమే ఇక్కడ గడిపేయొచ్చు. అంటే, ఈ పార్టీలో ఎవరికైనా తమదైన కంఫర్ట్ జోన్ క్రియేట్ అవుతుంది
ఆధ్యాత్మిక కోణం
రేవ్ పార్టీల్లో ఆధ్యాత్మిక కోణం ఉందని కొందరు చెబుతారు. పాత రోజుల్లో సన్యాసులు గంజాయి సేవించి మానసిక బంధనాలు తెంచుకుని అంతశ్చేతనను ఆవిష్కరించుకున్నట్లుగా రేవ్ పార్టీలలో కూడా ఈ ఉత్సాహవంతులు తమకు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుందని అంటారు. పశ్చిమ దేశాల్లో కూడా రేవ్ పార్టీలను ఆధ్యాత్మిక వేదికలుగా చూసే సంప్రదాయం ఉంది. హిప్పీల కల్చర్ నుంచి వచ్చిన ఈ రేవ్ సంస్కృతిలో అలాంటి కోణం ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు.
అందరూ ఒక్కటే...
ప్రజలందరూ ఒక్కరే... అంటే పార్టీలో పాల్గొంటున్న ప్రజలందరూ అన్న మాట. అందరూ ఒక్కటేనని, మనుషుల మధ్య భేషజాలు లేవనే అభిప్రాయాన్ని కల్పించడానికి రేవ్ కల్చర్ ప్రయత్నిస్తుంది. ఆస్తి, అంతస్తులు అన్నీ బయటి ప్రపంచానికి సంబంధించినవే. ఇక్కడ అందరూ ఒక్కటే అనే అట్మాస్ఫియర్ ఒకటి రేవ్ పార్టీల్లో క్రియేట్ అవుతుంది. ఇది మనుషులతో కనెక్ట్ కావడానికి బాగా ఉపయోగపడుతుందని మానసిక నిపుణులు చెబుతుంటారు. మన వృత్తులు, హోదాలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ పైన కప్పుకున్న ముసుగులే... అవి తీసి చూస్తే మనమంతా ఒకే రకమైన అవసరాలు, కోరికలు ఉన్న మనుషులమేనని గుర్తు చేయడమే రేవ్ పార్టీ క్రేజ్ కు కారణమని చెప్పొచ్చు.
రేవ్ పార్టీ చేసుకుంటే పాపమా?
విందు వినోదాలతో ఆర్గనైజ్ చేసిన ఒక పార్టీని రేవ్ పార్టీ అని పిలిచారంటే... అందులో డ్రగ్స్ వాడకం, సెక్స్, లిక్కర్ తప్పకుండా ఉంటాయనే భావిస్తారు. సామాజిక కట్టుబాట్ల ఉల్లంఘన వంటి కారణాలతో చేసే సోషల్ పోలీసింగ్‌తో పాటు, డ్రగ్స్ వినియోగం చట్ట విరుద్ధం కాబట్టి భారత్‌లో ఇలాంటి పార్టీలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచుతారు. చట్ట విరుద్ధమైన పదార్థాలు, ఆగకుండా మోత మోగించే సంగీతం ఉంటే అది రేవ్ పార్టీగా పరిగణించాల్సి ఉంటుందని భారత చట్టాలు చెబుతున్నాయి. చట్ట ప్రకారంగా చూస్తే, రేవ పార్టీలు NDPS అంటే, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ -1985 పరిధిలోకి వస్తాయి.
సో.. ఇల్లీగిల్ యాక్టివిటీకి అడ్డాగా మారిందనే అనుమానం ఏ కాస్త వచ్చినా పోలీసులు పార్టీ జరుగుతన్న ప్రదేశంలో రైడ్ చేస్తారు. పోలీసులకు డ్రగ్స్ దొరికినా, పార్టీలో ఉన్న వాళ్ళ బ్లడ్ సాంపిల్స్ ద్వారా వారు డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైనా క్రిమినల్ కేసులు నమోదవుతాయి.
రేవ్ పార్టీలు జనావాసాల మధ్య ఏర్పాటు చేసినప్పుడు శబ్ద కాలుష్యం కూడా ఒక నేరమే అవుతుంది. భారత సంస్కృతి, సామాజిక నిబంధనలకు విరుద్దమైన ప్రవర్తనలను ప్రోత్సహిస్తాయనే కారణాలతోనే మన దేశంలో రేవ్ పార్టీలపై నిషేధం విధించారు. ఈ పార్టీలలో వ్యాపార లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు లభించినా, మైనర్లు ఉన్నట్లు నిరూపణ అయినా అది మరింత పెద్ద కేసు అవుతుంది.
కొన్ని దేశాల్లో రేవ్ పార్టీయింగ్ నిషిద్ధమేమీ కాదు. అయితే, దానికి సంబంధించిన నియమ నిబంధనలను నిర్వాహకులు పాటించాల్సి ఉంటుంది. లిబరల్ ఎకానమీతో ఆర్థికంగా ఎదుగుతున్న భారతదేశంలో కొత్తగా విస్తరిస్తున్న ఈ రేవ్ కల్చర్ ఇంకా సవాళ్ళను ఎదుర్కొనే దశలోనే ఉందన్నది సామాజిక నిపుణుల అభిప్రాయం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire