Mysore Pak: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మైసూర్ పాక్‌కు కొత్త పేరు!

Mysore Pak Renamed as Mysore Shree Jaipur Sweets Owner Reaction
x

Mysore Pak: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మైసూర్ పాక్‌కు కొత్త పేరు!

Highlights

Mysore Pak: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌పై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Mysore Pak: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్థాన్‌పై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరిగా చేయాలని డిమాండ్లు జోరందుకున్నాయి. ఇదే తరుణంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. ‘మైసూర్ పాక్‌’ వంటి స్వీట్ల పేర్లను మార్చాలంటూ వినిపించిన ఆలోచనలు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చాయి.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ప్రముఖ స్వీట్ షాప్ ‘త్యోహార్ స్వీట్స్’ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. దుకాణ యజమాని అంజలీ జైన్ తమ షాప్‌లో విక్రయించే మైసూర్ పాక్‌ పేరు మార్చి మైసూర్ శ్రీగా, మోతీ పాక్‌ను మోతీ శ్రీ, ఆమ్ పాక్‌ను ఆమ్ శ్రీ, గోండ్ పాక్‌ను గోండ్ శ్రీగా మార్చేశారు. అంతేకాదు, స్వర్ణ భాషం పాక్‌ను స్వర్ణ శ్రీ, చాందీ భాషం పాక్‌ను చాందీ శ్రీగా పేరు మార్చారు.

‘‘దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లోనే కాదు… ప్రతి పౌరుడిలో ఉండాలి. అందుకే మేము ఈ మార్పు తీసుకొచ్చాం. ‘శ్రీ’ అనే పదం శుభానికి, మంగళానికి సంకేతం కావడంతో కొత్తగా ఆ పేర్లు పెట్టాం’’ అని తెలిపారు.

అయితే, అసలు విషయమేంటంటే — ‘పాక్’ అనే పదానికి పాకిస్థాన్‌తో అసలు సంబంధం లేదు. అది సంస్కృతం నుంచి వచ్చిన మాట. దాని అర్థం ‘వండటం’. ఇక పాకం అనే పదాన్ని బెల్లం లేదా చక్కెర కలిపిన వంటల్లోనూ వాడతారు. కానీ, పేరు విన్నాక వెంటనే పాకిస్థాన్ గుర్తుకు వస్తోందని భావించి — సున్నితమైన సందర్భంలో ఈ మార్పు చేశారు. ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు ‘పాక్‌’ అంటే వంట అనే అర్థమని, అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories