ఆకాశంలో అరుదైన ఘట్టం.. 400 ఏళ్ల తర్వాత!

ఆకాశంలో అరుదైన ఘట్టం.. 400 ఏళ్ల తర్వాత!
x
Highlights

వినీలాకాశంలో మునుపెన్నడూ చూడని మహా కలయిక నేడు ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోనే అతి పెద్ద గ్రహాలైన గురు-శని అత్యంత సమీపంలోకి రానుండటంతో ఆ రెండూ...

వినీలాకాశంలో మునుపెన్నడూ చూడని మహా కలయిక నేడు ఆవిష్కృతం కానుంది. సౌర కుటుంబంలోనే అతి పెద్ద గ్రహాలైన గురు-శని అత్యంత సమీపంలోకి రానుండటంతో ఆ రెండూ కలిసినట్లుగా ఆకాశంలో ఏర్పడే అద్భుతం వీనుల విందు చేయనుంది. ఒకటి కాదు.. రెండు కాదు అక్షరాల 400 సంవత్సరాల తర్వాత ఈ రెండు గ్రహాలు ఇంత దగ్గరకు వచ్చినట్లు కనిపించనున్నాయి. అందుకే దీనిని ఖగోళ శాస్త్రజ్ఞులు గ్రేట్ కంజంక్షన్ అంటే మహా కలయికగా అభివర్ణిస్తున్నారు.

ఇవాళ సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అంబరంలో అబ్బురపరిచే ఈ దృశ్యం జీవితకాలపు అనుభూతిగా మిగిలిపోనుంది. వాస్తవానికి మన సౌర కుటుంబంలో గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ మరో గ్రహానికి దగ్గరగా దూరంగా వచ్చి పోవటం సర్వసాధారణమే. అలాగే గురు-శని గ్రహాలు ప్రతి ఇరవై ఏళ్ళకు ఒకసారి దగ్గరగా వస్తాయి. కానీ ఈసారి దాదాపుగా ఆ రెండు గ్రహాలు 456 మిలియన్ మైళ్ల దగ్గరకు రానున్నాయి. కానీ అంత దూరంలో ఉన్నా భూమి పైనుంచి మనం చూసినప్పుడు అవి దాదాపుగా 0.1 కోణంతో కలిసినట్లు కనబడతాయి. అందుకే దీనిని మహా కలయిక అని ఖగోళ శాస్త్రజ్ఞులు వర్ణిస్తున్నారు.

చివరిసారి 1623వ సంవత్సరంలో ఇలా జరిగింది. అంటే 397 సంవత్సరాల తర్వాత ఇంత దగ్గరగా ఈ రెండు గ్రహాలు వస్తున్నాయి. అంతకుముందు 1226లో ఈ రెండు గ్రహాలు ఇంత దగ్గరగా వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. అందుకే ఈ అద్భుతం ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంత దగ్గరగా కాకపోయినా మళ్లీ ఈ రెండు గ్రహాలు దగ్గరగా రావాలంటే 2080 సంవత్సరం వరకూ వేచి ఉండాలి. అందుకే దీనిని శాస్త్రజ్ఞులు జీవిత కాలపు అనుభూతిగా అభివర్ణిస్తున్నారు.

భారత్‌లోని ప్రధాన నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత ఈ మహా కలయికను మామూలు కంటితో చూడొచ్చు. ఇవాళ సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 నిమిషాల వరకు నైరుతి, పశ్చిమ దిక్కుల్లో రెండు గ్రహాలు భూమికి దగ్గరగా రావడాన్ని వీక్షించొచ్చు. గురు గ్రహం ఒకింత పెద్దగా, ప్రకాశవంతమైన నక్షత్రంలా దర్శనమిస్తుంది. దానికి ఎడమ భాగంలో కొంచెం పైన శని ఒకింత మసకగా కనిపిస్తుంది. రెండింటినీ స్పష్టంగా, విడివిడిగా చూడాలంటే బైనాక్యులర్‌ను ఉపయోగించాలి. చిన్నపాటి టెలిస్కోపును వాడితే గురు గ్రహం చుట్టూ ఉన్న నాలుగు పెద్ద చందమామలూ కనిపిస్తాయి. ఆకాశంలో జరిగే ఈ అద్భుతాన్ని చిన్నారులకు చేరువ చేయాలని విజ్ఞాన ప్రపంచం కాంక్షిస్తోంది. ప్రతి ఒక్కరూ సాధారణ కంటితో చూడగలిగేలా అంబరంలో ఏర్పడుతున్న వింతను విద్యార్థులకు చేరువ చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories