International Tiger Day: నేడే గ్లోబల్ టైగర్స్ డే.. పులుల సంతతిని లెక్కలు వేసిన కేంద్రం

International Tiger Day: నేడే గ్లోబల్ టైగర్స్ డే.. పులుల సంతతిని లెక్కలు వేసిన కేంద్రం
x
international tiger day
Highlights

International Tiger Day: పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే మానవాళితో పాటు జంతువుల నివాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ప్రభుత్వాలు వీటికి లెక్కలు వేసి, అవసరమైన చోట ప్రత్యేక జోన్ లు ఏర్పాటు చేస్తుంటారు.

International Tiger Day: పర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే మానవాళితో పాటు జంతువుల నివాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే ప్రభుత్వాలు వీటికి లెక్కలు వేసి, అవసరమైన చోట ప్రత్యేక జోన్ లు ఏర్పాటు చేస్తుంటారు. ఇక ఈ రోజు నిర్వహించే ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా వీటికి సంబంధించిన లెక్కలు పూర్తిచేసింది భారత ప్రభుత్వం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పులుల సంతతిలో 75 శాతం పులులు మన దేశంలో ఉన్నట్టు లెక్కలు వేశారు. ఇదేకాకుండా మన దేశ వ్యాప్తంగా ఉన్న 2,697 పులుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 74 ఉన్నట్టు లెక్కలు వేశారు. ఇటీవల కాలంలో ఇవి పెరిగినట్టు అంచనా వేశారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పులుల సంఖ్య పెరగడానికి చేసిన కృషి ఫలిస్తోంది. నాలుగేళ్లలో వాటి సంఖ్య బాగా పెరిగింది. జూలై 29న గ్లోబల్‌ టైగర్‌ డే సందర్భాన్ని పురస్కరించుకొని గత ఏడాది చేపట్టిన పులుల గణన ఆధారంగా కేంద్రం మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 50 టైగర్‌ రిజర్వ్‌లలో ఉత్తరాఖండ్‌లో కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌లో అత్యధికంగా 231 పులులు, ఆ తర్వాత కర్ణాటకలోని నాగర్‌హోల్‌లో 127, బందీపూర్‌లో 127 పులులు ఉన్నట్టు వెల్లడించింది. మిజోరంలోని డంపా, బెంగాల్‌లోని బుక్సా, జార్ఖండ్‌లో పాలమూ రిజర్వ్‌లలో ఒక్క పులీ మిగల్లేదు.

ఏపీలో 48, తెలంగాణలో 26

2018 పులుల గణన ప్రకారం దేశవ్యాప్తంగా 2,967 పులులు ఉండగా.. ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నట్టు తాజా నివేదిక అంచనావేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 68 పులులు ఉండగా.. అప్పటికీ ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో 6 పులులు పెరిగాయి. నాగార్జునసాగర్‌(ఏపీ) టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో 43 పులులు సంచరిస్తుండగా.. ఇందులో టైగర్‌ రిజర్వ్‌లోపలే 38 ఉన్నట్టు నివేదిక తెలిపింది. తెలంగాణలోని ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో 9 ఉండగా.. రిజర్వ్‌ లోపలి ప్రాంతంలో 7 ఉన్నట్టు నివేదిక తెలిపింది. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో 1 ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో ఉన్న పులుల వయస్సు తక్కువని వివరించింది.

75% పులులు భారత్‌లోనే..

ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో పులులు ఉన్నాయి. ఈ దేశాల్లోని మొత్తం పులుల్లో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయి. బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చైనా, ఇండోనేసియా, మలేసియా, మయన్మార్‌ వంటి దేశాల్లో పులులు బాగా కనిపిస్తాయి. 2018లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పులుల గణన గిన్నిస్‌ రికార్డులకు కూడా ఎక్కింది. కెమెరాల ద్వారా అతి పెద్ద వన్యప్రాణి సర్వేగా దీనిని గుర్తిస్తూ గిన్నిస్‌బుక్‌ ధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.

పులుల సంరక్షణకు ఇతర దేశాలతో కలిసి పనిచేస్తాం: జవదేకర్‌

1973లో కేవలం తొమ్మిది మాత్రమే టైగర్‌ రిజర్వ్‌లు ఉన్న మన దేశంలో ఇప్పుడు వాటి సంఖ్య 50కి చేరుకుంది. దేశంలో ఉన్న అన్ని టైగర్‌ రిజర్వ్‌లూ నాణ్యతాపరంగా బాగున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ పులుల సంరక్షణ కోసం ఇతర దేశాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని, భారత్‌ ఈ సంరక్షణ చర్యలకు నేతృత్వం కూడా వహిస్తుందన్నారు. అడవుల కొరత, సమృద్ధిగా వర్షపాతం లేకపోయినప్పటికీ భారత్‌ పులుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న చర్యలతో ప్రపంచ జీవవైవిధ్యంలో 8% పెరిగిందన్నారు.

దేశంలో పులులు పెరిగింది ఇలా...

2006 - 1,411

2010 - 1,706

2014 - 2,226

2018 - 2,967

Show Full Article
Print Article
Next Story
More Stories