నగలు వేసుకుని బయటకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీకే ప్రమాదం!

రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యులకు గుదిబండగా మారడమే కాకుండా, దొంగలకు వరంగా మారుతున్నాయి.

Arun Chilukuri
Published on: 6 Feb 2026 12:18 PM IST
నగలు వేసుకుని బయటకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీకే ప్రమాదం!
X

రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యులకు గుదిబండగా మారడమే కాకుండా, దొంగలకు వరంగా మారుతున్నాయి. ఇటీవల నగరాల్లోనూ, పల్లెల్లోనూ పట్టపగలే గొలుసు దొంగతనాలు (Chain Snatching) పెరిగిపోతున్నాయి. ఆటో కోసం ఎదురుచూస్తున్నా, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నా.. ఏమరుపాటుగా ఉంటే చాలు దొంగలు రెప్పపాటులో నగలతో ఉరుకుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిత్యం జరుగుతున్న దాడులు - ఓ చేదు నిజం

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే దొంగల ధైర్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. చుట్టూ జనం ఉన్నా, మెడలో గొలుసు లాగడమే కాకుండా, బాధితురాలు ప్రతిఘటిస్తే ఆమెను కింద పడేసి ఈడ్చుకెళ్లేందుకు కూడా వెనుకాడటం లేదు. దీనివల్ల నగలు పోవడమే కాకుండా ప్రాణాపాయం కూడా సంభవిస్తోంది.

మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

బయటకు వెళ్లేటప్పుడు: వీలైనంత వరకు బయటకు వెళ్లేటప్పుడు బంగారు నగలు ధరించకపోవడమే మంచిది. ఒకవేళ మంగళసూత్రం వంటివి తప్పనిసరి అయితే, వాటిని స్కార్ఫ్ లేదా చున్నీతో కనిపించకుండా కప్పేయండి.

నడిచేటప్పుడు అప్రమత్తత: రోడ్డుపై నడుస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ లేదా మెసేజ్ చేస్తూ పరధ్యానంగా ఉండకండి. వెనక నుంచి ఏదైనా వాహనం వస్తున్నట్లు అనిపిస్తే వెంటనే అప్రమత్తమై పక్కకు తప్పుకోండి.

ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు: చిరునామా అడగడానికో, బిల్లుల పేరుతోనో వచ్చే గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. తలుపు తీయకుండా కిటికీలోంచే మాట్లాడండి. సెఫ్టీ లాక్ లేదా కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మేలు.

ముగ్గు వేసే సమయంలో: తెల్లవారుజామున ఇంటి ముందు ముగ్గు వేసే మహిళలు దొంగలకు ఈజీ టార్గెట్ అవుతున్నారు. ఆ సమయంలో మెడలో బంగారం లేకుండా చూసుకోవాలి.

సిక్స్త్ సెన్స్ వాడండి: ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తున్నారని అనుమానం వస్తే, వెంటనే దారి మార్చి జన సంచారం ఉన్న షాపుల్లోకి లేదా పెట్రోల్ బంక్‌ల్లోకి వెళ్లండి.

రక్షణ కవచాలు: బ్యాగులో ఎప్పుడూ పెప్పర్ స్ప్రే (Pepper Spray) లేదా చిన్న విజిల్ ఉంచుకోండి. ఆపద సమయంలో ఇవి ప్రాణాలను కాపాడతాయి.

గుర్తుంచుకోండి.. నగ కంటే ప్రాణం ముఖ్యం!

ఒకవేళ దొంగలు దాడి చేస్తే, నగలను కాపాడుకోవాలనే ప్రయత్నంలో వారితో పెనుగులాడవద్దు. ప్రాణం కంటే నగలు ముఖ్యం కాదు. దొంగను ఎదిరించే క్రమంలో తీవ్ర గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. దానికి బదులుగా దొంగ ఆనవాళ్లు, వారి వాహనం నంబర్, రంగు వంటివి గుర్తుంచుకుని వెంటనే 100కి ఫోన్ చేయండి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story