Weapons in Stomach: కత్తి, నెయిల్ కట్టర్స్, ఇంకా ఏవేవో మింగేశాడు

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Aug 2024 2:18 PM IST
Weapons in Stomach: కత్తి, నెయిల్ కట్టర్స్, ఇంకా ఏవేవో మింగేశాడు
X

Doctors removes knife, nail cutters from stomach: కడుపులో కత్తులు పెట్టుకుని మీదకు తియ్యగా మాట్లాడుతున్నాడు అని అంటుంటారు. మనసులో పగలు, ప్రతీకారాలు పెట్టుకుని బయటికి ప్రేమలు నటించే వారిని ఉద్దేశించి ఆ మాట చెబుతుంటారు. కానీ ఇక్కడ ఓ యువకుడు నిజంగానే కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నాడు. చిన్నచిన్న వస్తువులు, లేదా నాణేలు మింగిన చిన్న పిల్లలను చూసి ఉంటారు. కానీ ఇలా గోర్లు కత్తిరించే నెయిల్ కట్టర్స్, కత్తి, తాళం చెవులు, కీ చైన్ రింగ్ లాంటివి మింగిన వాళ్లను ఎప్పుడైనా చూశారా ? లేదు కదా.. కానీ ఇదిగో బీహార్‌లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఈస్ట్ చంపారన్ జిల్లాకు చెందిన ఒక 22 ఏళ్ల యువకుడు మానసిక సమస్యలతో సతమతమవుతున్నాడు. అతడు ప్రస్తుతం మానసిక నిపుణుల వద్ద చికిత్స పొందుతున్నాడు. తాజాగా అతడికి భరించలేని కడుపు నొప్పి వస్తుండటంతో కుటుంబసభ్యులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అబ్డామెన్ ఎక్స్‌రే తీసి చూస్తే అతడి కడుపులో కొన్ని లోహాపు వస్తువులు ఉన్నట్లుగా కనిపించింది.

కడుపులో లోహపు వస్తువులు గుర్తించి ఆశ్చర్యపోయిన డాక్టర్స్, అతడికి సర్జరీ చేసి మరింత షాకయ్యారు. మొదటిగా అతడి పొట్టలోంచి ఒక కీ చైన్ రింగ్ బయటపడింది. ఆ తరువాత రెండు తాళం చెవులు, నాలుగు అంగుళాల కత్తి, మరో రెండు నెయిల్ కట్టర్స్ బయటపడ్డాయి. పొట్టలోంచి వరుసపెట్టి వస్తోన్న ఆయుధాలు, వస్తువులు చూసి డాక్టర్స్ నివ్వెరపోయారు. ఇవేనా.. లేక పొట్టలోపల ఇంకేమైనా ఉన్నాయా అని క్షుణ్ణంగా పరీక్షించి చూడటం డాక్టర్స్ వంతయ్యింది.

ఇవన్నీ లోపలికి ఎలా వెళ్లాయి అని డాక్టర్స్ ఆ యువకుడిని ప్రశ్నించగా.. ఇటీవల కాలంలో లోహపు వస్తువులు మింగడం మొదలుపెట్టానని అమాయకంగా బదులిచ్చాడు. సర్జరీ తరువాత ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story